logo

కరవులో ఆదుకోనున్న క్వారీలు

చెంగల్పట్టు జిల్లా పరిధిలోని గ్రామాలకు వేసవిలో నీటి సమస్య తలెత్తకుండా రాళ్ల క్వారీల నుంచి నీటిని సేకరించేందుకు చెంగల్పట్టు జిల్లా యంత్రాంగం సిద్ధమవుతోంది.

Published : 28 Apr 2024 00:42 IST

నిరుపయోగంగా ఉన్న రాళ్ల క్వారీల నుంచి నీటి సేకరణ
సన్నాహాలు చేస్తున్న చెంగల్పట్టు జిల్లా యంత్రాంగం

  న్యూస్‌టుడే, వడపళని : చెంగల్పట్టు జిల్లా పరిధిలోని గ్రామాలకు వేసవిలో నీటి సమస్య తలెత్తకుండా రాళ్ల క్వారీల నుంచి నీటిని సేకరించేందుకు చెంగల్పట్టు జిల్లా యంత్రాంగం సిద్ధమవుతోంది. ఈ ప్రాంతంలో నిరుపయోగంగా ఉన్న రాళ్ల క్వారీలను అధికారులు తనిఖీలు చేశారు. జిల్లా పరిధిలో 350 గ్రామాలున్నాయి. రోజుకు 55 లీటర్‌ ఫర్‌ కేపిటా (ఎల్‌పీసీ) నీరు కావాల్సి ఉంది.        

పరిశోధనలకు నమూనాలు

చెంగల్పట్టు జిల్లా కలెక్టరు అరుణ్‌ రాజ్‌ ఇటీవల పలు శాఖలకు చెందిన అధికారులు, గ్రామీణాభివృద్ధి అధికారులతో సమావేశమయ్యారు. జిల్లాలో నిరుపయోగంగా ఉన్న రాళ్ల క్వారీలను గుర్తించి వాటి గురించి తెలియజేయాల్సిందిగా ఆదేశించారు. కాట్టాన్‌కులత్తూరు, సెయింట్ థామస్‌ మౌంట్, తిరుపోరూరు, తిరుక్కళుకుండ్రం, మధురాంతకం వంటి చోట్ల 25 క్వారీలు ఉన్నట్లు గ్రామీణాభివృద్ధి విభాగ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీరు ఎన్‌.బాబు పేర్కొన్నారు. ఈ క్వారీల నుంచి నీటి నమూనాలను సేకరించి పరిశోధనలకు పంపుతున్నారు. వినియోగానికి ఉపయోగకరంగా ఉంటే ఆ నీటిని పరిసరాల్లో ఉన్న గ్రామాలకు సరఫరా చేస్తామని బాబు పేర్కొన్నారు.

విద్యుత్తు సమస్యలు తీర్చాలి..

ప్రస్తుతం జిల్లా యంత్రాంగం నీటిని ఓవర్‌హెడ్‌ ట్యాంకుల ద్వారా సరఫరా చేస్తోంది. ట్యాంకుల్లోకి నీరు చేరుకోవడానికి విద్యుత్తు అంతరాయం ఉండకూడదు. విద్యుత్తు సరఫరాల్లో ఏదేని అవాంతరాలు కలిగితే మోటార్లు పాడైపోయి, సరఫరాకు అంతరాయం కలుగుతుందని మరో అధికారి పేర్కొన్నారు. మాంబాక్కం పంచాయతీ అధ్యక్షుడు టీపీ వీరా మాట్లాడుతూ... పలు గృహవాసులు భూగర్భ జలాలపై ఆధారపడి ఉన్నారని, నీటి సరఫరా అంత సమస్య కాదని చెబుతున్నారు. లోక్‌సభ ఎన్నికలు ముగిసిన తర్వాత తరచూ విద్యుత్తుకు అంతరాయం కలుగుతోందని తెలిపారు. విద్యుత్తు కోతలుంటే ట్యాంకుల్లోకి నీటిని పంపు చేయడం కుదరదని వీరా చెబుతున్నారు.

అసరాన్నిబట్టి ట్యాంకర్లు

అవసరాన్ని బట్టి ట్యాంకరు లారీల ద్వారా నీటిని తరలించేందుకు జిల్లా యంత్రాంగం సిద్ధమవుతోంది. నీటి ఎద్దడి అంతగా లేదని, ఎలాంటి సమస్యనైనా సమర్థవంతంగా ఎదుర్కొని అందరికీ నీరు అందేలా చూడాలన్నదే జిల్లా యంత్రాంగం ఆశయమని సీనియర్‌ అధికారి ఒకరన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని