logo

తాగునీటి ప్రాజెక్టులను నిరంతరం పర్యవేక్షించాలి

వేసవి నేపథ్యంలో రాష్ట్రంలోని తాగునీటి ప్రాజెక్టులను నిరంతరం పర్యవేక్షించాలని అధికారులకు ముఖ్యమంత్రి స్టాలిన్‌ సూచించారు.

Published : 28 Apr 2024 00:44 IST

అధికారులకు సీఎం సూచన

సమీక్ష నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి

చెన్నై, న్యూస్‌టుడే: వేసవి నేపథ్యంలో రాష్ట్రంలోని తాగునీటి ప్రాజెక్టులను నిరంతరం పర్యవేక్షించాలని అధికారులకు ముఖ్యమంత్రి స్టాలిన్‌ సూచించారు. సచివాలయంలో శనివారం వివిధ శాఖల ఉన్నతాధికారులతో జరిగిన సమీక్షలో ముఖ్యమంత్రి మాట్లాడారు. వేసవిలో తాగునీటి అవసరాలు పెరుగుతున్నాయని తెలిపారు. ప్రస్తుతం జలాశయాల్లో ఉన్న నీటిని పొదుపుగా ఉపయోగించి తర్వాతి రెండు నెలలకు తాగునీటి అవసరాలను పూర్తి చేయాల్సిన సంక్లిష్ట పరిస్థితుల్లో ఉన్నామని పేర్కొన్నారు. రాష్ట్రంలో కరవుతో తాగునీటి ఎద్దడి నెలకొన్న 22 జిల్లాలకు రాష్ట్ర విపత్తు సహాయ నిధి నుంచి రూ.150 కోట్లను తాగునీటి సరఫరా పనుల కోసం కేటాయించినట్టు తెలిపారు. ప్రస్తుతం అమలులో ఉన్న పలు ఉమ్మడి తాగునీటి ప్రాజెక్టుల పనితీరును నిరంతరం పర్యవేక్షించించాలని సూచించారు. ప్రజలను నేరుగా కలిసి సమస్యలకు వెంటనే పరిష్కారించాలని స్థానిక సంస్థల కమిషనర్లకు సూచించాలని తెలిపారు. సమావేశంలో మంత్రులు కేఎన్‌ నెహ్రూ, పెరియసామి, ప్రభుత్వ ప్రధానకార్యదర్శి శివ్‌దాస్‌ మీనా, జలవనరులశాఖ అదనపు ప్రధానకార్యదర్శి సందీప్‌ సక్సేనా తదితరులు పాల్గొన్నారు.

భాజపా చర్యలను ప్రజలు గమనిస్తున్నారు

చెన్నై: కేంద్రంలోని భాజపా ప్రభుత్వ చర్యలను రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారని ముఖ్యమంత్రి స్టాలిన్‌ తెలిపారు. ఆయన తన ఎక్స్‌ పేజీలో... మిగ్‌జామ్‌ తుపాను, వరద నష్టం సాయంగా రూ.37,907 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం కోరిందన్నారు. బాధితులకు తక్షణ సాయం, మౌలిక వసతుల పునరుద్ధరణకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు రూ.2,477 కోట్లు ఖర్చు పెట్టిందని తెలిపారు. సుప్రీంకోర్టును ఆశ్రయించిన తర్వాతే కేంద్రంలోని భాజపా సర్కారు రూ.276 కోట్లను ప్రకటించిందని పేర్కొన్నారు. రాష్ట్రానికి సాయం, న్యాయం లేదని వంచించే కేంద్ర భాజపా ప్రభుత్వ చర్యలను రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు.

త్యాగరాయర్‌ సేవలు చిరస్మరణీయం

చెన్నై: సర్‌ పిట్టి త్యాగరాయర్‌ జయంతి సందర్భంగా ఆయన సేవలను ముఖ్యమంత్రి స్టాలిన్‌ స్మరించుకున్నారు. ఆయన తన ఎక్స్‌ పేజీలో... బ్రాహ్మణేతర సిద్ధాంతాన్ని ప్రకటించి ద్రావిడ జాతి హక్కు గళాన్ని గట్టిగా వినిపించిన ధీరుడు సర్‌ పిట్టి త్యాగరాయర్‌ అన్నారు. మరకలేని రాజకీయ జీవితంతో చెన్నైలో విద్య, వైద్య అభివృద్ధికి అండగా ఉన్న ప్రజా సేవకుడని కొనియాడారు. అల్పాహార పథకానికి ఆద్యుడని తెలిపారు. వెతుకుతూ వచ్చిన పదవిని కాదన్న విలువలు కలిగిన వ్యక్తిగా అభివర్ణించారు. ఆయన జయంతి సందర్భంగా ఆయన జీవితాన్ని, సేవలను స్మరించి కీర్తిస్తున్నట్టు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు