logo

ఐఎస్‌ఐ మద్దతుదారుడి అరెస్టుకు ప్రతీకారంగానే కోయంబత్తూరులో బాంబు పేలుళ్లకు కుట్ర

ఐఎస్‌ఐ మద్దతుదారుడిని అరెస్టు చేసినందుకే కోయంబత్తూరులో బాంబు పేలుళ్లకు కుట్ర చేసినట్లు తెలిసింది.

Published : 29 Apr 2024 00:13 IST

సైదాపేట, న్యూస్‌టుడే: ఐఎస్‌ఐ మద్దతుదారుడిని అరెస్టు చేసినందుకే కోయంబత్తూరులో బాంబు పేలుళ్లకు కుట్ర చేసినట్లు తెలిసింది. కోయంబత్తూరు కోట్టైమేడు సంగమేశ్వరర్‌ ఆలయం ముందు 20244 అక్టోబర్‌ 23న కారు బాంబు పేలుడు సంభవించింది. ఈ ఘటనలో కారులో ఉన్న ఆదే ప్రాంతానికి చెందిన జమేషా ముబిన్‌ అనే యువకుడు మృతి చెందాడు. దీపావళి ముందు రోజు జనం ఎక్కువగా గుమిగూడే సమయంలో బాంబు పేలుడుకు కుట్ర చేసిన నేపథ్యంలో జమేషా ముబిన్‌ బలయ్యాడు. ఈ కేసు దర్యాప్తు ఎన్‌ఐఏ చేపట్టింది. దీనికి సంబంధించి 14 మందిని అరెస్టు చేశారు. ముందే ఈ కేసులో రెండు అభియోగపత్రాలు దాఖలు చేశారు. ముబిన్‌, ఐఎస్‌ఐ ముఖ్య మద్దతుదారుడు అయిన ఉమర్‌ ఫారూక్‌ సన్నిహితుడు అయిన కోయంబత్తూరు పోత్తనూరు తిరుమలై నగర్‌కు చెందిన తాహా నజీర్‌ అనే వ్యక్తి 14వ నేరస్థుడిగా పేర్కొంటూ గత నవంబర్‌లో ఎన్‌ఐఏ అధికారులు అరెస్టు చేశారు. ఇతనిపై చెన్నై పూందమల్లి ఎన్‌ఐఏ ప్రత్యేక కోర్టులో ప్రస్తుతం అభియోగపత్రం దాఖలు చేశారు. అందులో కోయంబత్తూరు కారు బాంబు పేలుడు గురించి పలు సంచలన విషయాలు వెల్లడించారు. కోయంబత్తూరుకు చెందిన మహ్మద్‌ అజారుద్దీన్‌ అనే వ్యక్తి ఐఎస్‌ఐకు మద్దతుగా పని చేయడంతో 2019లో అరెస్టయ్యాడని, దీనికి ప్రతీకారం తీర్చుకునే విధంగా కోయంబత్తూరులో కారు బాంబు పేలుడు జరిపేందుకు ముబిన్‌, అతని సహచరులు ప్రణాళిక రచించినట్లు పేర్కొంది. అదృష్టవశాత్తు బాంబు ముందుగానే పేలడంతో పెనుప్రమాదం తప్పినట్లు తెలిపింది. అదేవిధంగా అరెస్టయిన ఉమర్‌ ఫారూక్‌ సత్యమంగళం అటవీ ప్రాంతంలో ఐఎస్‌ఐ మద్దతుదారులకు ఆయుధ శిక్షణ ఇచ్చినట్లు అందులో వివరించింది. అతనితోపాటు తాహా నజీర్‌ కలిసి కుట్రలు చేసినట్లు, తద్వారా దేశ శాంతిభద్రతలకు విఘాతం కలిగించి, సమైక్యత, మతసామరస్యాన్ని దెబ్బతీసేందుకు ఆ ముఠా పని చేసినట్లు పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని