logo

వరాలిచ్చినా వనితల ఓటు పడలేదు!

లోక్‌సభ ఎన్నికల్లో తలపడిన మూడు ప్రధాన కూటములు ప్రత్యేకించి మహిళా ఓటర్ల మీద పెద్ద ఆశలే పెట్టుకున్నాయి.

Updated : 29 Apr 2024 06:38 IST

మేనిఫెస్టోలో ప్రాధాన్యత ఇచ్చినా ఆసక్తి చూపని మహిళలు
చెన్నైలో భారీగా ఓటింగ్‌ తగ్గడంతో డైలమాలో ఈసీ

లోక్‌సభ ఎన్నికల్లో తలపడిన మూడు ప్రధాన కూటములు ప్రత్యేకించి మహిళా ఓటర్ల మీద పెద్ద ఆశలే పెట్టుకున్నాయి. వారి ఓట్లను కొల్లగొట్టడం కోసం తమ మేనిఫెస్టోల్లో అమితంగా ఆకర్షించే హామీల్నీ గుప్పించాయి. కానీ చెన్నై నగరంలోని 3 పార్లమెంటు స్థానాల్లో మాత్రం అసలు ఈ హామీల్నే మహిళలు పెద్దగా పట్టించుకోలేదనేది స్పష్టమవుతోంది. రాష్ట్రవ్యాప్తంగా వారి పోలింగ్‌శాతం పెరిగినా.. ప్రత్యేకించి నగరంలో పురుషులతో పోల్చితే మహిళలు పెద్దగా ఓటు వేసేందుకు రాకపోవడం విస్మయానికి గురిచేస్తోంది. ఇప్పుడు ఎన్నికల సంఘం సైతం ఆలోచనలో పడింది. 

ఈనాడు-చెన్నై

రాష్ట్రవ్యాప్తంగా 69.72శాతం పోలింగ్‌ నమోదైందని అందరికీ తెలిసిన విషయమే. నగరంలోని 3 పార్లమెంటు స్థానాలు కలిపి 55.94 శాతం నమోదైంది. ఎన్నికల కమిషన్‌ (ఈసీ) విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. ఈ మూడు స్థానాల్లో 11,19,800 మంది మహిళలు పోలింగ్‌కు దూరమయ్యారు. అంటే.. ఏకంగా మొత్తం మహిళా ఓటర్లలో 45.34 శాతం అన్నమాట. ఇంతేసి మంది పోలింగ్‌కు ఎందుకు రాలేకపోయారు, అసలు తమ ఫలితం ఏమవుతోందనే కంగారు డీఎంకే, అన్నాడీఎంకే, భాజపా కూటముల్లో ఉంది. వాస్తవానికి ఈ లోక్‌సభ నియోజకవర్గాల్లో పురుషులతో పోల్చితే మహిళా ఓటర్లు 70,634 మంది ఎక్కువ. ఇలా ఉత్తర చెన్నైలో 4.56 శాతం, దక్షిణ చెన్నైలో 2.05 శాతం, మధ్య చెన్నైలో 2.16 శాతం అధికంగా వారి ఓట్లున్నాయి. కానీ పోలింగ్‌ అయిపోయాక చూస్తే పూర్తి విరుద్ధంగా ఉంది.

ఆకర్షణీయ పథకాలున్నా నిరాశే

  • లోక్‌సభ ఎన్నికల కోసం డీఎంకే కూటమి రాష్ట్రవ్యాప్తంగా ఒకే మేనిఫెస్టోను విడుదల చేసింది. ఇదే బాటలో అన్నాడీఎంకే కూటమి నడిచింది. డీఎంకే, కాంగ్రెస్‌ కలిసి మహిళల కోసం పలు ఆకర్షిణీయ ప్రకటనలు చేశాయి. పేద మహిళలకు ఏటా రూ.లక్ష, ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 50శాతం రిజర్వేషన్‌ తదితరాలు ఇందులో ఉన్నాయి.
  • డీఎంకే ప్రత్యేకంగా విడుదలచేసిన మేనిఫెస్టోలో కుటుంబ పెద్దగా ఉన్న మహిళలకు ప్రతీనెలా రూ.1000ని ప్రకటించింది. గ్యాస్‌ ధరల్ని రూ.500కి తగ్గిస్తామని చెప్పింది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు పథకాన్నీ అమలుచేస్తున్నట్లు గుర్తుచేసింది.
  • అన్నాడీఎంకే, డీఎండీకే కలిసి విడుదలచేసిన మేనిఫెస్టోలో పేద మహిళలకు నెలకు రూ.3 వేలు ఆర్థిక సాయాన్ని ప్రకటించాయి. ఫలితంగా నగరంలో భాజపా, డీఎంకేను మించి ఓట్లు రాబట్టాలని చూశాయి.
  • చెన్నైకు ఎయిమ్స్‌ తీసుకొస్తానని మధ్య చెన్నై భాజపా అభ్యర్థి వినోజ్‌ పి.సెల్వం తన మేనిఫెస్టోలో ప్రకటించారు. ఇందులో కీలకంగా మహిళల కోసం ప్రత్యేక ఆరోగ్యసేవల్ని ఆయన వెల్లడించారు. రొమ్ము క్యాన్సర్‌, సర్వైకల్‌ క్యాన్సర్‌, అనీమియా వ్యాధులకు సంబంధించి చికిత్సలకు కృషిచేస్తానని తెలిపారు. మహిళా పారిశ్రామికవేత్తలకు రుణాలందిస్తామని వివరించారు.
  • దక్షిణ చెన్నైలో ‘అక్కా 1825’ పేరుతో తమిళిసై సౌందరరాజన్‌ మేనిఫెస్టో ఇచ్చారు. 1825 రోజుల్లో చేయబోయే పనుల్ని వివరించారు. పేద మహిళల కోసం పలు వరాల్ని ప్రకటించారు. వారిని సాధికారత దిశగా నడిపించేందుకు ఉద్యోగ, ఉపాధి మార్గాల్ని వెల్లడించారు.

కారణమేంటో?

ప్రస్తుతం చెన్నైలోని 3 పార్లమెంటు స్థానాలూ డీఎంకే గుప్పిట్లోనే ఉన్నాయి. వాటిని మళ్లీ కైవసం చేసుకుంటామని డీఎంకే ధీమాతో ఉండగా.. కాదు, మా సత్తా చూపిస్తామని ఎన్డీయే, అన్నాడీఎంకే కూటములు ఒకరకంగా బలప్రదర్శనే చేశాయి. నగరంలో మహిళలు, యువత ఓట్లు ఎక్కువగా ఉండటంతో వారిని ఆకర్షిస్తూనే ప్రచారం సాగింది. కానీ పోలింగ్‌దాకా వచ్చాక మహిళా ఓటర్లు ఆసక్తి చూపకపోవడం అందరికీ మింగుడు పడటం లేదు. దక్షిణ చెన్నైలో 55శాతం పురుషుల ఓట్లు పోలవగా మహిళలవి కేవలం 53.2 శాతానికే పరిమితమయ్యాయి. మధ్య చెన్నైలో మహిళా ఓట్లు 52.4శాతం, పురుషులు 55.5 శాతంగా ఉంది. ఉత్తర చెన్నైలో పురుషుల ఓట్లు 61.7 శాతం పోలవగా మహిళా ఓట్లు 58.5 శాతం ఉన్నాయి. ఈ పరిస్థితిపై ఇటు రాజకీయ పార్టీలు, అటు ఎన్నికల కమిషన్‌ లోతుగా విశ్లేషిస్తోంది. రాబోయే ఎన్నికల్లో ఈ తరహా ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటామని చెబుతోంది.

ఎక్కడెక్కడ ఎంత..

అసెంబ్లీ నియోజకవర్గం - మహిళల పోలింగ్‌ శాతం

తిరువొత్తియూర్‌ - 61.58
డాక్టర్‌ రాధాకృష్ణన్‌ నగర్‌ - 65.83
పెరంబూర్‌ - 58.71
కొలత్తూర్‌ - 54.54
తిరు వి.కా.నగర్‌ - 54.08
రాయపురం - 55.41
ఉత్తర చెన్నై పార్లమెంటు - 58.52
మైలాపూర్‌ - 51.05
సైదాపేట - 52.04
టి.నగర్‌ - 52.33
విరుగంబాక్కం - 53.25
వేళచ్చేరి - 53.61
శోళింగనల్లూర్‌ - 54.70
దక్షిణ చెన్నై పార్లమెంటు- 53.22
విల్లివాక్కం - 52.19
ఎగ్మూర్‌ - 55.34
హార్బర్‌ - 51.67
చేపాక్‌ తిరువెళ్లికెణ్ణి - 52.32
థౌజండ్‌లైట్్స - 51.07
అన్నానగర్‌ - 52.41
మధ్య చెన్నై పార్లమెంటు- 52.44

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని