logo

అవాస్తవ ప్రచారం తగదు: ముఖ్యమంత్రి స్టాలిన్‌

విజయబాటలో ఇండియా కూటమి వెళ్తున్నందున ఓటమి భయంతో మోదీ అవాస్తవ ప్రచారాలు చేస్తున్నారని ముఖ్యమంత్రి స్టాలిన్‌ విమర్శించారు. ఆయన విడుదల చేసిన ప్రకటనలో.. వెనుకబడిన, అణగారిన, షెడ్యుల్డ్‌ తెగల జీవితాల్లో వెలుగు నింపేందుకు 50శాతం రిజర్వేషన్ల పరిమితి తొలగించాలని రాష్ట్రంలోని రాజకీయ పార్టీలన్నీ కోరుతున్నాయన్నారు.

Updated : 19 May 2024 05:44 IST

ఆర్కేనగర్, న్యూస్‌టుడే: విజయబాటలో ఇండియా కూటమి వెళ్తున్నందున ఓటమి భయంతో మోదీ అవాస్తవ ప్రచారాలు చేస్తున్నారని ముఖ్యమంత్రి స్టాలిన్‌ విమర్శించారు. ఆయన విడుదల చేసిన ప్రకటనలో.. వెనుకబడిన, అణగారిన, షెడ్యుల్డ్‌ తెగల జీవితాల్లో వెలుగు నింపేందుకు 50శాతం రిజర్వేషన్ల పరిమితి తొలగించాలని రాష్ట్రంలోని రాజకీయ పార్టీలన్నీ కోరుతున్నాయన్నారు. ఈ పిలుపు ఇండియా కూటమిలో, దేశం మొత్తం ప్రతిధ్వనించడం ప్రారంభమైందని తెలిపారు. ఉత్తరప్రదేశ్‌ ప్రజలకు మేలుచేసే దీనిపై మోదీ ఎప్పుడూ మాట్లాడలేదని, హామీ ఇవ్వలేదన్నారు. ఆయన విద్వేష ప్రచారం మాత్రమే చేస్తున్నారన్నారు. మతోన్మాద ప్రచారం వదిలిపెట్టకుండా రాష్ట్రాల మధ్య వివాదాలు పెట్టాలని చూస్తున్నారన్నారు. రాష్ట్రంలో మహిళల కోసం తీసుకొచ్చిన పథకాలతో ఎందరో లబ్ధి పొందుతున్నారని గుర్తు చేశారు. బస్సుల్లో ఉచిత ప్రయాణం కారణంగా మెట్రో రైళ్లలో రద్దీ లేదని అంటున్నారన్నారు. కేటాయించిన నిధులు ఇవ్వకుండా చెన్నై మెట్రో రెండోదశ విస్తరణ ప్రాజెక్ట్‌ అడ్డుకున్న మోదీ వాస్తవాలు దాచిపెట్టి నిందలు మోపుతున్నారని తెలిపారు. భాజపా విభజన కలలు ఎప్పటికీ ఫలించబోవన్నారు.


ఇండియా కూటమిదే అధికారం: సెల్వపెరుంతగై 

కోయంబత్తూరు, న్యూస్‌టుడే: కేంద్రంలో జూన్‌ 4 తర్వాత ఇండియా కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయమని టీఎన్‌సీసీ అధ్యక్షుడు సెల్వపెరుంతగై ధీమా వ్యక్తం చేశారు. కోయంబత్తూరులో శనివారం జరిగిన పార్టీ కార్యకర్తల సమవేశంలో పాల్గొన్న అనంతరం విలేకరులతో మాట్లాడారు. అగ్రనేత రాహుల్‌గాంధీ చేపట్టిన జోడోయాత్రతో పార్టీ బలోపేతమైందన్నారు. ప్రధాని నరేంద్రమోదీ ఎన్నికల్లో చేస్తున్న విషపూరిత ఆరోపణలను ప్రజలు నమ్మే స్థితిలో లేరని, ఆ పార్టీ ఘోర పరాజయం పాలవడం ఖాయమన్నారు. రాష్ట్రంలో కామరాజర్‌ పాలన తీసుకురావాలన్నది ప్రతి కార్యకర్త ఆకాంక్ష అని, ఆ దిశగా కృషి చేస్తామన్నారు. 2026లో జరగనున్న శాసనసభ ఎన్నికల్లో డీఎంకేతో పొత్తుకు సంబంధించి పార్టీ అధిష్ఠానం నిర్ణయం తీసుకుంటుందని పునరుద్ఘాటించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని