logo

జగనొస్తే జనానికి చుక్కలే!

తెలంగాణలో సీఎం కాన్వాయ్‌ వల్ల సామాన్య ప్రజలు ఇబ్బందులు పడకూడదు. అవసరమైతే తన కాన్వాయ్‌ ఆపి వాళ్లను స్వేచ్ఛగా వెళ్లనివ్వాలని’ అక్కడి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చెబుతున్నారు.

Updated : 08 Mar 2024 05:04 IST

బస్సుల్లేక ప్రయాణికుల అగచాట్లు
చేయూత సభ కోసం హైవేపై వాహనాల మళ్లింపు
ఈనాడు, అనకాపల్లి - న్యూస్‌టుడే అనకాపల్లి/పట్టణం, ఎలమంచిలి

తెలంగాణలో సీఎం కాన్వాయ్‌ వల్ల సామాన్య ప్రజలు ఇబ్బందులు పడకూడదు. అవసరమైతే తన కాన్వాయ్‌ ఆపి వాళ్లను స్వేచ్ఛగా వెళ్లనివ్వాలని’ అక్కడి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చెబుతున్నారు. మరి ఏపీలో సీఎం జగన్‌ గాల్లో ప్రయాణించినా నేలపై రాకపోకలకు ఆంక్షలు పెడుతున్నారు. గతేడాది భోగాపురం విమానాశ్రయం శంకుస్థాపనకు విశాఖ నుంచి హెలికాప్టర్‌లో జగన్‌ వెళితే ఆ ప్రాంతానికి 150 కి.మీ దూరానున్న నక్కపల్లిలో భారీ వాహనాలను నిలిపేశారు. తాజాగా అనకాపల్లిలో గురువారం నిర్వహించిన చేయూత సభకు వచ్చిన జగన్‌ కోసం సభా ప్రాంగణానికి ఇరువైపులా 60 కి.మీ దూరంలో భారీ వాహనాలను ఒక పూటంతా నిలిపేసి డ్రైవర్లకు నరకం చూపించారు. 30 కి.మీ దూరంలో సైతం ఇతర వాహనాలను దారి మళ్లించి ప్రయాణికులను ఇక్కట్లకు గురిచేశారు. సీఎం జగన్‌ ఎక్కడికి వెళితే అక్కడ జనాలకు చుక్కలు చూపించడం పరిపాటిగా మారిపోయింది.


జాతీయ రహదారి దిగ్బంధం..

అనకాపల్లి, కశింకోట మండలాల మధ్య పిసినికాడ వద్ద జాతీయ రహదారిని ఆనుకునే చేయూత సభ నిర్వహించారు. ఈ సభలోకి సీఎం వాహనం వెళ్లడానికి వీలుగా రహదారి మధ్య డివైడర్‌ కొంతమేర తవ్వేశారు. సభకు జనాలను తరలించే వాహనాలు తప్ప ఇతర వాహనాలేవీ రాకుండా 30 కి.మీ ముందే లూప్‌ లైన్‌లోకి దారి మళ్లించారు. సభకు తరలించిన వాహనాలు చాలావరకు జాతీయ రహదారిపైనే నిలిపేయడంతో ఇరువైపులా మూడు కి.మీ పూర్తిగా ట్రాఫిక్‌ నిలిచిపోయింది.   తుని నుంచి విశాఖ వైపు వచ్చే వాహనాలను రేగుపాలెం కూడలి నుంచి ఎలమంచిలి మీదుగా మళ్లించారు. ఈ రోడ్డు సింగిల్‌ లైన్‌ కావడంతో పాటు సెజ్‌కు సంబంధించిన భారీ వాహనాలు తిరుగుతుండడంతో రోడ్డంతా రద్దీగా మారిపోయింది. ఆనందపురం నుంచి ఆరు వరుసల జాతీయ రహదారిపై వచ్చిన భారీ వాహనాలను సబ్బవరం సమీపంలోని టోల్‌ గేటు వద్ద, విజయవాడ నుంచి వచ్చే భారీ వాహనాలను నక్కపల్లి టోల్‌గేటు దగ్గర నిలిపేశారు. మూడు కి.మీ. మేర గంటల తరబడి వాహనాలను నిలిపేయడంతో డ్రైవర్లంతా ఇబ్బందులు పడ్డారు. గతంలో ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి లేదని, జగన్‌ వచ్చాకే రోడ్లపై నరకం చూపిస్తున్నారంటూ డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అనకాపల్లితో సంబంధం లేకుండా మాడుగుల వెళ్లాల్సిన పౌరసరఫరాల లారీని కూడా నిలిపేశారని ఇలాంటి నాయకుల్ని మళ్లీ ఎన్నుకోకూడదని సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టారు.


పిల్లలతో ప్రచారమా?

సీఎం సభలో విద్యాశాఖాధికారులు అత్యుత్సాహం చూపించారు. కశింకోట బాలికల ఉన్నత పాఠశాలకు చెందిన సుమారు 200 మంది విద్యార్థినులతో ‘జగనన్న నేను సిద్ధం’ అంటూ బోర్డులు పట్టుకునేలా చేశారు. సీఎం కాన్వాయ్‌ వెళ్లే దారి పొడవునా ఇలా రోడ్డుపై బోర్డు పట్టుకుని నిలబడేలా చేశారు. చదువుకునే పిల్లలతో రాజకీయ ప్రచారం చేయించడం పట్ల పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు.


ప్రభుత్వ కార్యక్రమమా.. వైకాపా ప్రచారమా!

వైఎస్సార్‌ చేయూత కార్యక్రమాన్ని అధికార పార్టీ ఎన్నికల ప్రచార సభగా మార్చుకుంది. ప్రభుత్వ సొమ్ముతో ఏర్పాటు చేసిన సభలో పార్టీ ముచ్చట్లు పెట్టారు. జగన్‌ సభా వేదికపైకి చేరుకోవడానికి ముందు పది నిమిషాల పాటు మంత్రి అమర్‌నాథ్‌, అనకాపల్లి వైకాపా సమన్వయకర్త మలసాల భరత్‌, ఉత్తరాంధ్ర పార్టీ వ్యవహారాల సమన్వయకర్త వైవీ సుబ్బారెడ్డితో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. అనంతరం వేదికపైకి వచ్చి కలెక్టర్‌ రవితో, తర్వాత స్థానిక పార్టీ సమన్వయకర్త భరత్‌తో మాట్లాడించారు. అనకాపల్లి నుంచి పోటీచేసే అభ్యర్థిని పరిచయం చేయడమే కాకుండా అందరూ ఆశీర్వదించాలని జగన్‌ కోరారు. ‘భరత్‌కు రాబోయే ఎన్నికల్లో తోడుగా నిలబడండి. మరో తమ్ముడు అమర్‌ను గుండెల్లో పెట్టుకుంటాను. కచ్చితంగా రాబోయే రోజుల్లో అమర్‌కు మంచి చేస్తాను’ అని జగన్‌ చెప్పడంతో అధికారులు ఇదేమైనా పార్టీ కార్యక్రమమా పరిచయాలు చేస్తున్నారని చర్చించుకోవడం కనిపించింది.  సభ మొత్తం వైకాపా రంగుల పరదాలతో కప్పేయడమే కాకుండా సభకు వచ్చిన మహిళలకు సిద్ధం ప్లకార్డులు ఇచ్చి ప్రదర్శించారు. ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడికి, ఎంపీˆ బీవీ సత్యవతికి ప్రసంగించే అవకాశం లేకపోయింది.  


సైరన్ల మోత

సభకు వచ్చిన చాలామంది వైకాపా స్థానిక నేతలు సైతం తమ వాహనాలకు సైరన్‌లు ఏర్పాటు చేసుకుని విచ్చలవిడిగా ఉపయోగించారు. వాస్తవానికి అంబులెన్స్‌, పోలీసు ఎస్కార్ట్‌ వంటి వాహనాలకు మాత్రమే సైరన్‌ ఉపయోగించుకోవాలి. అటువంటిది జడ్‌పీటీసీ సభ్యులు, ఎంపీపీలు, కార్పొరేషన్ల మాజీ ఛైర్మన్‌లు, డైరెక్టర్లు.. ఇలా చాలామంది వారి వాహనాలకు సైరన్లు పెట్టుకుని పోలీసుల ముందే మోత మోగించుకుంటూ తిరగడం విశేషం..


విద్యార్థులు చేరుకోవడమే పరీక్ష..

సీఎం సభకోసం బస్సులు మళ్లించడంతో ఇంటర్‌ విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు చేరుకోవడానికి హైరానా పడ్డారు. కశింకోట, తాళ్లపాలెం విద్యార్థులు అనకాపల్లిలో పరీక్షలు రాస్తున్నారు. సీఎం వస్తున్నారు ఇబ్బందులు తప్పవని తల్లిదండ్రులే రోజూ  కంటే రెండు గంటల ముందుగానే ఇళ్లనుంచి పిల్లలను తీసుకుని పరీక్షా కేంద్రాల్లో దిగబెట్టారు. పరీక్ష రాసిన విద్యార్థులు ఇళ్లకు చేరుకోవడానికి మాత్రం తంటాలు పడాల్సి వచ్చింది. నాలుగైదు కి.మీ. కాలినడకన వచ్చి ప్రైవేటు వాహనాల్లో  ఇళ్లకు చేరాల్సి వచ్చింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని