logo

దిగజారిన స్థానం!!

పదోతరగతి పరీక్షల్లో ఉత్తీర్ణత శాతం గతేడాది కంటే పెరిగినా రాష్ట్రస్థాయిలో విశాఖ, అనకాపల్లి జిల్లాల స్థానాలు మాత్రం దిగజారిపోయాయి.

Published : 23 Apr 2024 04:45 IST

మూడు నుంచి ఎనిమిదికి పడిపోయిన విశాఖ
పది ఫలితాలపై పాలనా ప్రభావం

ఈనాడు, విశాఖపట్నం: పదోతరగతి పరీక్షల్లో ఉత్తీర్ణత శాతం గతేడాది కంటే పెరిగినా రాష్ట్రస్థాయిలో విశాఖ, అనకాపల్లి జిల్లాల స్థానాలు మాత్రం దిగజారిపోయాయి. అల్లూరి జిల్లాలో విద్యార్థులు సత్తా చాటడంతో ఆ జిల్లా స్థానం కాస్త మెరుగుపడింది. గతేడాది 82.68 శాతం ఉత్తీర్ణతతో విశాఖ జిల్లా మూడోస్థానంలో నిలవగా, ఈ ఏడాది ఉతీర్ణత 91.15 శాతానికి పెరిగినా జిల్లా ర్యాంకు ఎనిమిదో స్థానానికి పడిపోయింది. అనకాపల్లి జిల్లా గతేడాది 77.74 శాతం ఉత్తీర్ణతతో అయిదో స్థానంలో నిలిస్తే ఈ ఏడాది 89.04 శాతం ఉత్తీర్ణత నమోదు చేసినా, రాష్ట్ర స్థాయిలో జిల్లా ర్యాంకు 12వ స్థానానికి దిగజారిపోయింది. అల్లూరి సీతారామరాజు జిల్లా గతేడాది 61.41 శాతం ఉత్తీర్ణతతో 24వ స్థానంలో నిలవగా ఈసారి 90.95 శాతంతో తొమ్మిదో స్థానానికి ఎగబాకింది. మార్చిలో జరిగిన ఈ పరీక్షలకు ఈ మూడు జిల్లాల నుంచి మొత్తం ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లు విద్యార్థులు 60,291 మంది పరీక్షలకు హాజరైతే 54,485 మంది ఉత్తీర్ణులయ్యారు. ఎప్పటిలాగే ఈసారి కూడా బాలికలే పైచేయి సాధించారు.

  • వరసగా రెండేళ్లు 2019-20, 20-21లో పదోతరగతి పరీక్షలను కొవిడ్‌ కారణంగా నిర్వహించలేదు.. అందరు విద్యార్థులనూ ఉత్తీర్ణులు చేశారు.
  • గతేడాదితో పోల్చితే ఈ ఏడాది ప్రథమ శ్రేణిలో ఎక్కువ మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు.
  • సబ్జెక్టు టీచర్ల కొరత, ఏడాది పొడవునా సిఫార్సు బదిలీలు చేపట్టడం, నాడు నేడు పనులపై చూపిన శ్రద్ధ బోధనపై అధికారులు చూపకపోవడంతో విశాఖ, అనకాపల్లి ర్యాంకులు పడిపోయినట్లు విద్యావేత్తలు విశ్లేషిస్తున్నారు.

పది ఫలితాల్లో మెరిశారు...

రాష్ట్ర ప్రభుత్వం సోమవారం విడుదల చేసిన పదో తరగతి ఫలితాలలో నగర విద్యార్థులు సత్తా చాటారు. పలువురు మంచి మార్కులు సాధించి ఉత్తమ భవిష్యత్తుకు బాటలు వేసుకున్నారు.  

కూలీ కొడుక్కి 596 మార్కులు

మురళీనగర్‌, న్యూస్‌టుడే : పల్నాటికాలనీకి చెందిన విద్యార్థి రెడ్డి హేమంత్‌కుమార్‌ 10వ తరగతి ఫలితాల్లో 596 మార్కులు సాధించాడు. హేమంత్‌ తండ్రి నాగభూషణం గోడౌన్‌ కళాసీగా, తల్లి సత్యవతి దినసరి కూలీగా పనిచేస్తున్నారు. ప్రతిరోజు ఉదయం 3 గంటలకు నిద్రలేచి 3 గంటల సమయం చదివేవాడినని విద్యార్థి పేర్కొన్నాడు. ఇంటర్‌ తరువాత ఐఐటీలో చేరాలనే ఆకాంక్షను వ్యక్తం చేశాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని