logo

ధర పెరిగింది.. వినోదం తగ్గింది

గ్రామీణ ప్రాంతాల ప్రజలకు సైతం అంతర్జాలం, వినోదాన్ని చేరువ చేయాలన్న లక్ష్యంతో తెదేపా ప్రభుత్వంలో ప్రవేశపెట్టిన ఏపీ ఫైబర్‌ నెట్ పథకం వైకాపా ప్రభుత్వం వచ్చిన తర్వాత నిర్లక్ష్యానికి గురైంది.

Published : 28 Apr 2024 03:59 IST

ఏపీ ఫైబర్‌ నెట్‌ను పేదలకు అందని ద్రాక్షలా చేసిన జగన్‌
ఆదాయార్జనే లక్ష్యంగా వైకాపా ప్రభుత్వ పనితీరు

పెందుర్తి, వేపగుంట, పరవాడ, సబ్బవరం, న్యూస్‌టుడే: గ్రామీణ ప్రాంతాల ప్రజలకు సైతం అంతర్జాలం, వినోదాన్ని చేరువ చేయాలన్న లక్ష్యంతో తెదేపా ప్రభుత్వంలో ప్రవేశపెట్టిన ఏపీ ఫైబర్‌ నెట్ పథకం వైకాపా ప్రభుత్వం వచ్చిన తర్వాత నిర్లక్ష్యానికి గురైంది. పల్లె ప్రజలకు ఫైబర్‌ నెట్ అందని ద్రాక్షలా మారింది. పెందుర్తి మండలం రాంపురం గ్రామంలో ఫైబర్‌ నెట్ అందుబాటులోకి తీసుకొచ్చేందుకు 2018లో ప్రతిపాదించారు. అనంతరం ప్రభుత్వం మారడంతో మూలకు చేరింది. ప్రస్తుతం పెందుర్తి రెవెన్యూ మండలం పరిధిలోని ఒక్క పెందుర్తిలో మాత్రమే ఏపీ ఫైబర్‌ నెట్ అందుబాటులో ఉంది. అదికూడా అరకొరే. వైకాపా ప్రభుత్వం వచ్చిన తర్వాత డేటా సరఫరాను పరిమితం చేశారు. తెలుగు ఛానెళ్లలో కోత విధించారు. రెండు, మూడు రకాల ప్యాకేజీలను ప్రవేశపెట్టి ఆదాయార్జనే లక్ష్యంగా పని చేస్తోంది. తెదేపా హయాంలో రూ.250 ఛార్జీగా వసూలు చేయగా ప్రస్తుతం ప్రాథమిక ప్యాకేజీకి రూ.350 వసూలు చేస్తున్నారు. అప్పట్లో డేటా వినియోగం 15ఎంబీ వేగంతో అపరిమితంగా ఉండేది. ప్రస్తుతం 20ఎంబీ వేగంతో 200జీబీ డేటా మాత్రమే సరఫరా చేస్తున్నారు.

 ఛానెళ్లలో కోత..

గతంలో ఏపీ ఫైబర్‌ నెట్ ద్వారా తక్కువ ఖర్చుతో అధిక ఛానళ్లు, ఎక్కువ డేటా వచ్చేది. ప్రస్తుతం ధర పెరగడంతో పాటు ఛానెళ్లలో కోత విధించారు. వివిధ రకాల ప్యాకేజీల కారణంగా వినియోగదారులపై భారం పెరిగింది. డేటా పరిమితం చేయడంతో అంతర్జాలం వినియోగం కూడా తగ్గింది. దీంతో ప్రయివేటు ఆపరేటర్లపై ఆధారపడాల్సిన పరిస్థితి.

కిల్లి రమేశ్‌, పెందుర్తి

సక్రమంగా వచ్చిన రోజు లేదు

ఏపీ ఫైబర్‌ నెట్‌ తెదేపా ప్రారంభించిన తొలినాళ్లలో చక్కగా వచ్చేది. టీవీ, అంతర్జాలం, ఫోన్‌కు అనుసంధానం చేసినా బాగా పని చేసేవి. గతంలో ఈ మూడింటికి చాలా తక్కువ రుసుం వసూలు చేసేవాళ్లు. దీంతో ప్రతీఒక్కరూ ముందుకొచ్చేవారు. వైకాపా ప్రభుత్వం వచ్చిన తరువాత నెలవారీ రుసుమును పెంచేశారు. సిగ్నల్స్‌ సక్రమంగా పనిచేసిన రోజు ఒకటీ లేదు.

జీ.ఎస్‌.రెడ్డి, నరవ

సెటప్‌ బాక్సులు లేకపోవడం విడ్డూరం

ఏపీలో అద్భుతంగా పనిచేసే ఫైబర్‌ నెట్ పథకాన్ని జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం నీరుగార్చి నిర్వీర్యం చేసింది. చంద్రబాబు హయాంలో 100 ఎంబీపీఎస్‌ వేగంతో చాలా చక్కగా ఇంటర్‌నెట్‌ వచ్చేది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా లక్షల మంది కనెక్షన్లు తీసుకున్నారు. అలాంటి ఏపీ ఫైబర్‌ నెట్ను సెటప్‌ బాక్సులు లేవని చెప్పడం విడ్డూరంగా ఉంది.

కె.రామకృష్ణ రాజు నల్లరేగులపాలెం

సకాలంలో కనెక్షన్లు ఇవ్వలేకపోతున్నారు..

ఎంతో ప్రయోజనకరంగా ఉండే ఫైబర్‌ నెట్‌కు ప్రజల నుంచి డిమాండ్‌ ఉన్నప్పటికీ వైకాపా ప్రభుత్వం సకాలంలో కనెక్షన్లు ఇవ్వలేకపోతోంది. వాస్తవానికి ఫైబర్‌ నెట్ అద్దె కేవలం రూ. 150 మాత్రమే ఉండేది. దీంట్లో కేవలం ఛానెళ్ల కోసం రూ.100 చెల్లించగా మిగిలిన రూ.50 సెటప్‌ బాక్సు కోసం చెల్లించాల్సి ఉంటుంది. సెటప్‌ బాక్సు విలువ రూ.4 వేలు తీర్మానం అయ్యేదాక వసూలు చేసేవాళ్లు.

రొంగలి దేముడు, రావులమ్మపాలెం

అధ్వానంగా ఇంటర్‌నెట్‌

గతంలో అన్ని రకాల ఛానెల్స్‌ వచ్చేవి. నెలకు రూ.150 నుంచి రూ.200 మధ్య చెల్లించేవాళ్లం. వైకాపా వచ్చిన తర్వాత చాలా ఛానెల్స్‌ను ఆపేశారు. అయినా నెలకు రూ.350కి పెంచేశారు. ఇంటర్‌నెట్‌ అధ్వానంగా వస్తోంది. ప్రైవేట్‌ నెట్‌వర్కులు ఇంతకంటే తక్కువగా ఇస్తున్నాయి. తరచూ సేవలు మొరాయిస్తున్నాయి.

గండి మహేశ్‌, పరవాడ

విద్యార్థులకు ఎంతగానో ఉపకరించేది

చంద్రబాబు ముందుచూపుతో యువత, విద్యార్థులకు సైతం ఉపయోగపడేలా ఫైబర్‌ నెట్‌ను తీసుకొచ్చారు. కొవిడ్‌ సమయంలో ఆన్‌లైన్‌లో పాఠాలు వినేందుకు విద్యార్థుల ఎంతగానో ఉపయోగించుకున్నారు. వైకాపా ప్రభుత్వం దీని నిర్వహణ గాలికొదిలేసింది. దీంతో విద్యార్థులు మళ్లీ ఇబ్బందులకు గురవుతున్నారు.

మౌళి, జెర్రిపోతులపాలెం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు