logo

డబ్బన్నావ్‌.. డబ్బాకొట్టుకున్నావ్‌!!

‘మా పాలనలో అక్కచెల్లెమ్మల ఆర్థిక సాధికారతే లక్ష్యంగా ముందడుగు వేశాం. 14 రోజుల పాటు పండగ వాతావరణంలో చేయూత పంపిణీ జరుగుతుంది. ప్రతి ఇంట్లో మహిళలను లక్షాధికారులుగా మార్చాం.’

Updated : 29 Apr 2024 07:52 IST

‘చేయూత’ నాలుగో విడత నిధులేవి జగన్‌!!
ఇలాగేనా అక్కచెల్లెమ్మలను లక్షాధికారులనుచేసేది
ఉత్తుత్తి బటన్‌ నొక్కి ఆర్భాటం

 జగన్‌ మాట

‘మా పాలనలో అక్కచెల్లెమ్మల ఆర్థిక సాధికారతే లక్ష్యంగా ముందడుగు వేశాం. 14 రోజుల పాటు పండగ వాతావరణంలో చేయూత పంపిణీ జరుగుతుంది. ప్రతి ఇంట్లో మహిళలను లక్షాధికారులుగా మార్చాం.’

 నాలుగో విడత చేయూత పంపిణీ సందర్భంగా సీఎం జగన్‌


వాస్తవం

‘చేయూత’ నిధుల విడుదలకు బటన్‌ నొక్కి రెండు నెలలు గడుస్తున్నా నేటికీ మహిళల ఖాతాల్లోకి డబ్బులు రాలేదు. వారంతా డబ్బుల కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు. తరచూ బ్యాంకులకు వెళ్లి ఎంతో ఆశగా డబ్బులు పడ్డాయేమోనని తనిఖీ చేసుకుంటున్నారు. ఏమీ రాలేదని బ్యాంకు సిబ్బంది చెబుతుండటంతో ఉసూరుమంటూ ఇంటి దారి పడుతున్నారు.


ఈనాడు డిజిటల్‌, విశాఖపట్నం

నా అక్కచెల్లెమ్మలంటూ ఊదరగొట్టిన జగన్‌ వారికి కుచ్చుటోపీ పెట్టారు. చేయూత పథకం కింద ఇచ్చే చివరి విడత ఆర్థిక సాయాన్ని ఎగ్గొట్టే ఎత్తుగడ వేశారు. జిల్లాలో చివరి విడత కింద ఒక్కొక్కరికి రూ.18,750 చొప్పున 84,678 మందికి రూ.158.77 కోట్లు చెల్లించాలి. మార్చి 7న అనకాపల్లి జిల్లాలో చేయూత నిధుల విడుదలకంటూ బహిరంగ సభ ఏర్పాటుచేశారు. నాడు బటన్‌ నొక్కినా నేటికీ ఒక్క రూపాయి కూడా జమ చేయలేదు. ఈ పథకం కింద లబ్ధి పొందుతున్న మహిళలందరూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలే. నాలుగు విడతల నిధులు విడుదల చేసినట్లు తాజాగా జగన్‌ విడుదల చేసిన మ్యానిఫెస్టోలో పేర్కొన్నారు. అయితే నాడు బటన్‌ నొక్కినా...ఇంకా తమ ఖాతాలకు ఒక్క రూపాయి కూడా రాలేదని లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు.

లబ్ధిదారుల సంఖ్యలో సగానికి పైగా కోత.. : చేయూత పథకం కింద 45-60 ఏళ్ల మధ్య ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు ఏడాదికి రూ.18,750 చొప్పున నాలుగేళ్లకు రూ.75 వేలు అందిస్తామని వైకాపా ప్రభుత్వం గొప్పలు చెప్పింది. మూడో విడత సాయం అందించేందుకు 2022లో రాష్ట్రస్థాయిలో 10 దశల తనిఖీ ప్రక్రియ చేపట్టారు. లబ్ధిదారుల సంఖ్యను తగ్గించేందుకు కుట్ర పన్నారు. 300 యూనిట్ల విద్యుత్తు వినియోగం, కుటుంబంలో ప్రభుత్వ ఉద్యోగి, ఆదాయపన్ను చెల్లింపుదారుడు, వ్యవసాయ భూమి, నాలుగు చక్రాల వాహనం, పట్టణాల్లో 1000 చ.అడుగుల విస్తీర్ణం కంటే పెద్ద ఇల్లు ఉండటం తదితర కారణాలతో చాలా మందిని అనర్హులుగా మార్చారు. తాము అర్హులమని నిరూపించుకోవడానికి లబ్ధిదారులు సరైన ధ్రువపత్రాలు సమర్పించేందుకు నానా తంటాలు పడ్డారు. ఆ సమయంలో జిల్లాలోని లబ్ధిదారుల సంఖ్యలో సగానికి పైగా తగ్గించారు.

ఉత్తుత్తి బటన్‌: గతేడాది సెప్టెంబరులోనే నాలుగో విడత నిధులు విడుదల చేయనున్నట్లు తొలుత 2023-24 సంక్షేమ క్యాలెండర్‌లో ప్రకటించారు. తర్వాత ఈ ఏడాది ఫిబ్రవరిలో ఇస్తామని క్షేత్రస్థాయికి సమాచారం పంపారు. దీన్ని ఎన్నికల ప్రచారానికి వినియోగించుకునే కుట్రలో భాగంగానే విడుదల సమయం మార్చారు. తొలుత ఫిబ్రవరి 5న విడుదల చేస్తామని.. ఆ తర్వాత 16కు, 21కి, 26కి ఇలా వాయిదాల మీద వాయిదాలు వేశారు. చివరికి మార్చి 7న జరిగిన బహిరంగ సభలో ఉత్తుత్తి బటన్‌ నొక్కారు.

నిబంధనల కొర్రీలతో ఎగనామం: పేదల సంక్షేమానికి కృషి చేస్తున్నానని చెప్పే జగన్‌ తెరవెనుక నిబంధనల గిరి గీసి కోతలు పెడుతున్నారు. చేయూత లబ్ధిదారులకు ఏటికేడు ఇలాగే గండి కొడుతున్నారు. సామాజిక పింఛన్‌, విద్యుత్తు వాడకం వంటి కొర్రీలు వేశారు. తొలి రెండు విడతల్లో లబ్ధి పొందినవారికీ మూడు, నాలుగు విడతల్లో అనర్హుల ముద్ర వేసి ఎగనామం పెట్టారు. జిల్లావ్యాప్తంగా కార్యక్రమాలు నిర్వహించి నమూనా చెక్కులు పంపిణీ చేశారు. ఆయా సభలకు రాకుంటే నిధులు రావని బెదిరింపులకు పాల్పడ్డారు. దీంతో ఎండను సైతం లెక్కచేయకుండా పలువురు ఆయా కార్యక్రమాలకు హాజరైనా ప్రయోజనం లేకపోయింది.

జీవీఎంసీ పరిధిలో లబ్ధిదారులు ఇలా..

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని