logo

ఆస్కార్‌కు గుర్తుగా సొంతూర్లో గ్రంథాలయం

ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాలోని ‘నాటునాటు’ పాట రాసి అంతర్జాతీయ స్థాయిలో ఆస్కార్‌ పురస్కారం పొందారు ప్రముఖ సినీ గేయ రచయిత చంద్రబోస్‌. భూపాలపల్లి జిల్లా చల్లగరిగెలో జన్మించి తన కలంతో కమ్మని పాటలెన్నో రాస్తూ లక్షలాది ప్రేక్షకుల అభిమానం చూరగొన్నారు.

Published : 18 Mar 2024 06:23 IST

ప్రముఖ గీత రచయిత చంద్రబోస్‌

ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాలోని ‘నాటునాటు’ పాట రాసి అంతర్జాతీయ స్థాయిలో ఆస్కార్‌ పురస్కారం పొందారు ప్రముఖ సినీ గేయ రచయిత చంద్రబోస్‌. భూపాలపల్లి జిల్లా చల్లగరిగెలో జన్మించి తన కలంతో కమ్మని పాటలెన్నో రాస్తూ లక్షలాది ప్రేక్షకుల అభిమానం చూరగొన్నారు. ఇటీవల వరంగల్‌ ఎస్‌.ఆర్‌. విశ్వవిద్యాలయం       ఆయనకు గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసి గౌరవించింది. ఈ సందర్భంగా ‘ఈనాడు’ చంద్రబోస్‌ను పలకరించగా ఓరుగల్లుతో తనకున్న చిన్ననాటి జ్ఞాపకాలు పంచుకున్నారు.

ఈనాడు, వరంగల్‌: నేను పుట్టి పెరిగింది చల్ల గరిగె. వరంగల్‌తో ఎంతో అనుబంధం ఉంది. ఈ మట్టి వాసన చూసినా, ఈ గాలి పీల్చినా చెప్పలేనంత ఆనందం కలుగుతుంది. ఇక్కడకు వస్తేనే అమ్మ ఒడిలో ఉన్న అద్భుతమైన భావన కలుగుతుంది. నేను జూనియర్‌ కాలేజీలో చదివేటప్పుడు హనుమకొండలోని కేడీసీలో పాటల కార్యక్రమాలు జరిగేవి. అప్పటి గాయకులు శంకరన్న, సారంగపాణన్న పాటలు వింటూ ఎంతో స్ఫూర్తి పొందాను. శంకరన్న కంజర పట్టుకుని చక్కగా పాడేవారు. ఓరుగల్లు అంటేనే ఒక రకమైన ఉత్తేజం, చైతన్యం. ఎంతో మంది వరంగల్‌ కవులు, కళాకారుల నుంచి నేను ఎంతో నేర్చుకుని ఈ స్థాయికి వచ్చాను. ఎస్‌.ఆర్‌. ట్యుటోరియల్‌కు వచ్చి చదువుకున్నాను. వరదారెడ్డిని గురువుగా భావిస్తా. నేను చదువుకున్న సంస్థే నాకు డాక్టరేట్ ఇవ్వడం ఎంతో గర్వంగా భావిస్తున్నా.

చారిత్రక సంపదకు నిలయం

నా చిన్నతనంతో పోలిస్తే ఇప్పుడు ఓరుగల్లు ఎంతో అభివృద్ధి చెందింది. రహదారులు, భవనాలు, నగరం రూపురేఖలు మారిపోయాయి. ఎంతో అభివృద్ధి జరిగింది. ఇక్కడి చారిత్రక ప్రాంతాలకు కొదువ లేదు. రామప్ప ఆలయానికి యునెస్కో దక్కింది.  నేను 29 ఏళ్లుగా పాటల ప్రయాణం చేస్తున్నానంటే కారణం వరంగలే. నా బాల్యంలో చల్లగరిగెలో అనేక జానపద పాటలు వినేవాడిని. అప్పటి కళాకారుల్లా నేను పాటలు పాడి ప్రజల అభిమానాన్ని చూరగొనాలని అనుకునేవాడిని. వారిని ఆదర్శంగా తీసుకొని అంచెలంచెలుగా ఎదిగా.

సాహిత్యంపై అభిలాష పెంచింది...

నా పాట నాటునాటుకు ఆస్కార్‌ పురస్కారం వచ్చాక మా సొంతూరు చల్లగరిగెలో ఎప్పటికీ గుర్తుండిపోయేలా ఏదైనా చేయాలనుకున్నాం. మా శ్రీమతి సుచిత్ర ఆలోచనతో ఊళ్లో పాడుబడిన గ్రంథాలయం బాగు చేయాలని సంకల్పించాం. ఆస్కార్‌ అవార్డుకు గుర్తుగా ఆంగ్ల అక్షరం ‘ఓ’ ఆకారంలో గ్రంథాలయం రెండంతస్తుల్లో నిర్మిస్తున్నాం. ఇప్పటికి 80 శాతం పనులు పూర్తయ్యాయి. నాకు సాహిత్యంపై అభిలాష పెరగడానికి గ్రంథాలయమే కారణం కాబట్టి దాన్ని బాగు చేసి ఊరి రుణం తీర్చుకోవాలనుకున్నా.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని