logo

బకాయిలు రావు.. పనులు సాగవు..

ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దేందుకు గత ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ‘మన ఊరు మన బడి’ కార్యక్రమం అమలు చేస్తోంది. ఇందులో భాగంగా చేపట్టిన పాఠశాలల మరమ్మతులు, నూతన నిర్మాణాల పనులకు నిధుల కొరత ఏర్పడటంతో.. సుమారుగా ఏడాది కాలంగా పనులు నిలిచిపోయాయి.

Published : 24 Apr 2024 02:42 IST

బడులకు వేసవి సెలవులు ప్రకటించినా అసంపూర్తి పనులను ప్రస్తావించిన ఊసే లేదు. గుత్తేదారులు, యాజమాన్య కమిటీలు రావాల్సిన బిల్లుల కోసం కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. జూన్‌ 4 వరకు ఎన్నికల కోడ్‌ అమల్లో ఉండటంతో.. అప్పటి వరకు ఒక్క రూపాయి కూడా విడుదలయ్యే అవకాశాలు లేవు.

ములుగు పట్టణంలోని ప్రభుత్వ పాఠశాలలో అసంపూర్తిగా నిర్మాణం చేసిన భననం ఇది. గతేడాది ‘మన ఊరు మన బడి’ కార్యక్రమం కింద సుమారు రూ.6 లక్షల నిధులతో పనులు ప్రారంభించారు. బిల్లులు రాకపోవడంతో.. మధ్యలోనే నిలిపివేశారు.

పనులు పూర్తయినా.. బిల్లులు చెల్లించని ములుగులోని ప్రాథమిక పాఠశాల

ములుగు, న్యూస్‌టుడే: ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దేందుకు గత ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ‘మన ఊరు మన బడి’ కార్యక్రమం అమలు చేస్తోంది. ఇందులో భాగంగా చేపట్టిన పాఠశాలల మరమ్మతులు, నూతన నిర్మాణాల పనులకు నిధుల కొరత ఏర్పడటంతో.. సుమారుగా ఏడాది కాలంగా పనులు నిలిచిపోయాయి. గతేడాది మే చివరి నాటికి పనులు పూర్తి చేయాలని గడువు విధించినప్పటికీ.. బిల్లులు రాకపోవడంతో.. గుత్తేదారులు, పాఠశాల యాజమాన్య కమిటీలు పనులను మధ్యలోనే నిలిపివేశారు. దీంతో ఆయా పాఠశాలల్లో విద్యార్థులకు తిప్పలు తప్పడం లేదు.

రూ.3.19 కోట్ల బకాయిలు

కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పాఠశాల యాజమాన్య కమిటీల పద్ధతిని పక్కన పెట్టి ఐకేపీ మహిళా సంఘాల ద్వారా పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు పనులు చేపట్టాలని నిర్ణయించి నిధులు కూడా కేటాయించింది. ‘మన ఊరు మన బడి’ పనులకు సంబంధించి ఎలాంటి మార్గదర్శకాలు జారీ చేయలేదు. జిల్లా పరిధిలో మొత్తం 125 బడుల్లో ‘మన ఊరు మన బడి’ కింద 2,839 పనులు చేపట్టగా, వీటి విలువ రూ.21.79 కోట్లుగా నమోదైంది. ఇందులో 2,407 పనులకు రూ.18.60 కోట్లు చెల్లించారు. ఇంకా రూ.3.19 కోట్ల పనులకు బిల్లులు చెల్లించాల్సి ఉంది. ఈ పనులను మూడు ఇంజినీరింగ్‌ శాఖలకు అప్పగించారు. ఇందులో పంచాయతీరాజ్‌ ఇంజినీరింగ్‌ శాఖకు వాజేడు, వెంకటాపురం, కన్నాయిగూడెం మండలాలు కేటాయించారు. గిరిజన సంక్షేమ శాఖకు ములుగు, గోవిందరావుపేట, తాడ్వాయి, ఏటూరునాగారం, మంగపేట మండలాలు ఉండగా, ఈడబ్ల్యూఐడీసీ కింద వెంకటాపూర్‌ మండలాన్ని కేటాయించారు.

మొదటి విడత 125 బడుల ఎంపిక

జిల్లాలో మొత్తం 348 ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలున్నాయి. మొదటి విడతలో రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలో 125 ఎంపిక చేసి మరమ్మతులు, అదనపు గదుల నిర్మాణం మొదలగు పనులు చేపట్టారు. ఇందులో 77 ప్రాథమిక, 17 ప్రాథమికోన్నత, 33 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. మొత్తం తొమ్మిది మండలాలుండగా, ఒక్కో మండలంలో నాలుగు బడులను ఎంపిక చేసి వాటిని మోడల్‌ స్కూల్స్‌గా తీర్చిదిద్దాలని నిర్ణయించి ఎట్టకేలకు పూర్తి చేశారు. రూ.30 లక్షల లోపున్న పనులను పాఠశాల యాజమాన్య కమిటీలు, ఆపైనున్నవి టెండరు ద్వారా గుత్తేదారుకు అప్పగించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని