logo

ఎన్‌కౌంటర్‌లో చనిపోయింది సుష్మిత కాదా..!

ఛత్తీస్‌గఢ్‌ అటవీ ప్రాంతంలో బుధవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో  తెలంగాణకు చెందిన ముగ్గురు మావోయిస్టులు మృతిచెందినట్లు వార్తలొచ్చాయి. వీరిలో హనుమకొండ జిల్లా హసన్‌పర్తి మండలం సూధన్‌పల్లికి చెందిన మావోయిస్టు దళ సభ్యురాలు తిక్క సుష్మిత

Published : 03 May 2024 05:21 IST

మృతదేహాన్ని చూసి వెనుదిరిగిన కుటుంబ సభ్యులు

హసన్‌పర్తి, న్యూస్‌టుడే: ఛత్తీస్‌గఢ్‌ అటవీ ప్రాంతంలో బుధవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో  తెలంగాణకు చెందిన ముగ్గురు మావోయిస్టులు మృతిచెందినట్లు వార్తలొచ్చాయి. వీరిలో హనుమకొండ జిల్లా హసన్‌పర్తి మండలం సూధన్‌పల్లికి చెందిన మావోయిస్టు దళ సభ్యురాలు తిక్క సుష్మిత (26) ఉందా లేదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎన్‌కౌంటర్‌ మృతుల్లో ఆమె ఆనవాళ్లు కనిపించక పోవడంతో మృతదేహం కోసం ఛత్తీస్‌గఢ్‌ వెళ్లిన కుటుంబ సభ్యులు, బంధువులు వెనుదిరిగి వస్తున్నారు. ఎన్‌కౌంటర్‌లో సుష్మిత మృతి చెందిందనే సమాచారంతో మృతదేహాన్ని తీసుకొచ్చేందుకు  సూధన్‌పల్లి గ్రామం నుంచి 8 మంది కుటుంబ సభ్యులు, బంధువులు వెళ్లారు. వారితో పాటు వెళ్లిన తెలంగాణ యునైటెడ్‌ ఫ్రంట్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కనకం మల్లేశం గురువారం రాత్రి ‘న్యూస్‌టుడే’తో మాట్లాడుతూ గురువారం మధ్యాహ్నం ఆరుగురు మావోయిస్టుల మృతదేహాలకు ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణపూర్‌ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించారని తెలిపారు. వారిలో సుష్మిత ఆనవాళ్లు మాత్రం ఎక్కడా కనిపించడం లేదన్నారు. ఆమె రెండు కణతలపై అర్ధ రూపాయి సైజ్‌లో చిన్నప్పుడు కాల్చిన గుర్తులు (బర్రలు) ఉంటాయన్నారు. ఆ ఆనవాళ్లు లేకపోవడంతో కుటుంబసభ్యులు తిరుగు ముఖం పట్టారని చెప్పారు. పోస్టుమార్టానికి ముందు మావోయిస్టుల మృతదేహాలను కుటుంబ సభ్యులకు చూపించాల్సి ఉండగా అలా చేయలేదని అన్నారు. పోలీసులు పెట్టిన చిత్ర హింసలు, పోస్టుమార్టం చేయడం వల్ల ఏర్పడ్డ గాయాల వల్ల కూడా ఆ గుర్తులు కనిపించడం లేదేమోనని అనుమానం సైతం వ్యక్తం చేశారు.

రవి మృతదేహం కోసం ఎదురుచూపులు

భీమదేవరపల్లి: ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన వంగర గ్రామానికి చెందిన మావోయిస్టు కాశవేని రవి అలియాస్‌ వినయ్‌ మృతదేహం కోసం కుటుంబ సభ్యులు, గ్రామస్థులు ఎదురుచూస్తున్నారు. మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకు రావడానికి వెళ్లిన కుటుంబ సభ్యులు, గ్రామస్థులు బుధవారం రాత్రి ఛత్తీస్‌ఘడ్‌ రాష్ట్రం నారాయణపూర్‌ జిల్లాకు చేరుకున్నారు. మావోయిస్టు రవి శరీరంలో ఉన్న మూడు బుల్లెట్లు తొలగించిన తరవాతే మృతదేహాన్ని ఇస్తామని పోలీసులు చెప్పినట్లు సోదరుడు వెంకటి ‘న్యూస్‌డే’కు తెలిపారు. బులెట్లు తీసేందుకు ప్రత్యేక బృందాలు అందుబాటులో లేకపోవడంతో పోస్టుమార్టం జాప్యం జరుగుతోందని చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని