logo

రాత్రి వేళల్లో తరలిస్తున్నారు..!

జిల్లాలో బెరైటీస్‌ అక్రమ రవాణా కొనసాగుతోంది. అడ్డుకట్ట వేసేందుకు అటవీశాఖ అధికారులు చేస్తున్న ప్రయత్నాలు పూర్తిగా సఫలమవడం లేదు. అధికారుల కళ్లుగప్పి విలువైన ఖనిజాన్ని రాత్రి వేళ సరిహద్దులు దాటిస్తున్నారు.

Updated : 24 Apr 2024 06:03 IST

గార్లలో ఆగని బెరైటీస్‌ అక్రమ రవాణా

భద్రతకు నోచుకోని బెరైటీస్‌ ఖనిజ నిల్వలు(పాత చిత్రం)

ఈనాడు, మహబూబాబాద్‌, న్యూస్‌టుడే, గార్ల: జిల్లాలో బెరైటీస్‌ అక్రమ రవాణా కొనసాగుతోంది. అడ్డుకట్ట వేసేందుకు అటవీశాఖ అధికారులు చేస్తున్న ప్రయత్నాలు పూర్తిగా సఫలమవడం లేదు. అధికారుల కళ్లుగప్పి విలువైన ఖనిజాన్ని రాత్రి వేళ సరిహద్దులు దాటిస్తున్నారు. ముఖ్యంగా గార్ల మండలం నగరం, బాలాజీతండా, కోట్యానాయక్‌తండా, పాతపోచారం పరిసరాల్లో సుమారు వంద ఎకరాల్లో విస్తరించిన ఈ బెరైటీస్‌ నిక్షేపాలను గతంలో సర్కారు అనుమతులతో తవ్వకాలు చేశారు. పలు కారణాలతో కొన్నాళ్లుగా పనులు ఆగాయి. దాంతో తరలించడానికి సిద్ధంగా ఉన్న ఖనిజాల నిల్వలు కుప్పలుగా ఉన్నాయి. వాటి రక్షణగా అటవీశాఖ అధికారులు నిక్షేపాలున్న గుట్ట చుట్టూ కందకాలు తీశారు. కనకవర్షం కురిపిస్తున్న ఆ ఖనిజంపై అక్రమార్కుల కన్నుపడింది. అడ్డంకులను దాటుకొని రహస్యంగా టిప్పర్లు, ట్రాక్టర్ల ద్వారా తరలిస్తున్నారు.

ఖనిజ విలువ ఇదీ

బెరైటీస్‌ ఖనిజాలలో నాణ్యమైన దాన్ని పెట్రోలియం శుద్ధి చేసేందుకు, రంగుల తయారీకి తదితరాల వాటిలో వినియోగిస్తుంటారు. నాణ్యత లేని దాన్ని సిమెంట్‌ తయారీకి వాడతారు. ఒక్కో టిప్పరులో సుమారు 35 టన్నులు,  ట్రాక్టర్లలో దాదాపు 6 టన్నుల ఖనిజం పడుతుందని గతంలో అక్కడ పనిచేసిన వ్యక్తులు చెబుతున్నారు. నాణ్యమైన ఖనిజం టన్నుకు రూ. 10 వేల చొప్పున, నాణ్యత లేని దానికి టన్నుకు రూ.6 వేల చొప్పున ధర పలుకుతుందని తెలిసింది. ఈ లెక్కన టిప్పరు ఖనిజాన్ని రూ. 3.50 లక్షలు, ట్రాక్టరు ఖనిజాన్ని రూ. 60 వేల చొప్పున విక్రయిస్తున్నట్లు సమాచారం.

యంత్రాలను వినియోగిస్తూ

స్థానిక, ఖమ్మం, కడప ప్రాంతానికి చెందిన అక్రమార్కులే ఈ వ్యవహరానికి పాల్పడుతున్నారు. నిక్షేపాలున్న ప్రాంతం నిర్జన ప్రదేశంలో ఉండడంతో రాత్రి అయితే చాలు అక్రమార్కులు ఆ ప్రాంతంలో యంత్రాలు, ట్రాక్టర్లతో వాలిపోతారు. కందకాలను యంత్రంతో పూడ్చేసి లోపలికి చొరబడతారు. ఆ యంత్రాన్ని ఉపయోగించి ట్రాక్టర్లలో ఖనిజాన్ని నింపుకుంటారు. ఆ తర్వాత బెరైటీస్‌తో ఉన్న వాహనాలు బయటికి వెళ్లగానే ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు యథావిధిగా జేసీబీతో కందకాలను తీస్తున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. మేడారం జాతర సమయంలో టిప్పర్ల ద్వారా వందల టన్నులు, గత నెలలోనూ ట్రాక్టర్ల ద్వారా తరలించినట్లు తెలిసింది. వారి అక్రమాలకు సెలవు రోజులను ఎంచుకుంటున్నట్లు సమాచారం. ముఖ్యంగా ఖమ్మం కేంద్రంగా ఖనిజాన్ని క్రషర్లలో పొడిగా మార్చి అక్కడి నుంచి కడప జిల్లా తదితర ప్రాంతాలకు తరలిస్తున్నట్లు పలువురు ఆరోపిస్తున్నారు. అక్రమాలను అడ్డుకోవడాన్ని ‘మామూలు’గా తీసుకోకుండా కట్టుదిట్టమైన భద్రతను పెంచి విలువైన ఖనిజం తరలకుండా చూడాలని, పరిశ్రమ నెలకొల్పి నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలని ప్రజలు కోరుతున్నారు.

పట్టుబడిన ఘటనలు ఇలా

  • గతేడాది పాత పోచారం నుంచి కమలాపురం వెళ్లే దారిలో బెరైటీస్‌తో కూడిన లారీని పోలీసులు పట్టుకున్నారు. బాధ్యులపై కేసు నమోదు చేశారు. ఈ ఖనిజాన్ని సూర్యాపేట జిల్లా కోదాడ వైపు తరలించాలనుకున్నట్లు తెలిసింది.
  • గతేడాది సెప్టెంబరులో రాత్రివేళ ట్రాక్టర్‌లో ఖనిజాన్ని తరలించేందుకు అక్రమార్కులు ప్రయత్నించారు. వర్షంతో ఆ ప్రాంతం బురదగా ఉండడంతో వాహనం అందులో కూరుకుపోగా తెల్లవారితే దొరికిపోతామనే భయంతో అక్రమార్కులు విలువైన రాళ్లను కిందవేసి వెళ్లారు.
  • తాజాగా నిక్షేపాలున్న ప్రాంతానికి రెండు ట్రాక్టర్లు ఖనిజాన్ని తరలించేందుకు వచ్చినట్లు గుర్తించిన పోలీసులు వాటిని స్టేషన్‌కు తరలించి కేసు నమోదు చేశారు.

బేస్‌క్యాంపులను ఏర్పాటు చేశాం

రమేష్‌, డీఆర్వో

ఖనిజాల నిల్వల ప్రాంతాల్లో కందకాలను తవ్వాం. నిక్షేపాలున్న ప్రాంతంలో బేస్‌క్యాంపులను ఏర్పాటు చేశాం. అక్కడ వాచర్లను నియమించాం. బీట్‌ అధికారి కూడా స్థానికంగానే ఉంటున్నారు. ఖనిజ అక్రమ తరలింపునకు పాల్పడేవారిపై చర్యలు తీసుకుంటాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని