logo

సైబర్‌ మోసమా.. వారియర్లు పట్టేస్తారు!

ఓ వైపు శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం పెరుగుతుండగా అదే తరహాలో సైబర్‌ మోసాలు విజృంభిస్తున్నాయి. డిజిటల్‌ లావాదేవీలు పెరుగుతున్న కారణంగా స్మార్ట్‌ఫోన్ల వినియోగం పెరిగింది.

Updated : 24 Apr 2024 07:34 IST

నెహ్రూసెంటర్‌, న్యూస్‌టుడే: ఓ వైపు శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం పెరుగుతుండగా అదే తరహాలో సైబర్‌ మోసాలు విజృంభిస్తున్నాయి. డిజిటల్‌ లావాదేవీలు పెరుగుతున్న కారణంగా స్మార్ట్‌ఫోన్ల వినియోగం పెరిగింది. అమాయక ప్రజలను పలు రకాల ఆఫర్లు, ప్రలోభాలకు గురి చేస్తూ మోసాలకు పాల్పడుతున్నారు. సైబర్‌ నేరాల నియంత్రణకు పోలీస్‌ శాఖ ప్రజల్లో అవగాహన కల్పిస్తోంది. దీంతోపాటు సైబర్‌ నేర బాధితులకు సత్వర సేవలు అందించేందుకు జిల్లాలో ప్రతి ఠాణాకు ఒక సైబర్‌ వారియర్‌ను నియమించింది.

  • సైబర్‌ మోసానికి గురైన బాధితులు టోల్‌ ఫ్రీ నెంబర్‌ 1930కి ఫిర్యాదు చేస్తున్నారు. సంఘటన జరిగిన 24 గంటల్లో ఫిర్యాదు చేస్తే బాధితులకు న్యాయం జరిగేలా సత్వర చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. జిల్లాలో సైబర్‌ నేరాలను నియంత్రించేందుకు సహాయక కేంద్రాలను నెలకొల్పి బాధితులకు వెంటనే న్యాయం జరిగేలా 18 ఠాణాల్లోని సిబ్బంది కొంతమందిని ఎంపిక చేసి 18 మందిని సైబర్‌ వారియర్లుగా ఎంపిక చేశారు. సెక్యురిటీ పాలసీ చట్టం, కమ్యూనికేషన్‌ వ్యవస్థ, ఇంటర్‌నెట్‌ డాటాసెంటర్‌, నెట్‌ వర్కింగ్‌ వ్యవస్థ, నేషనల్‌ నెట్‌వర్కింగ్‌. మొబైల్‌ అప్లికేషన్స్‌, సెక్యూరిటీ రిస్క్‌, సోషల్‌ మీడియా ఇన్‌ గవర్నర్‌, సంఘటన సమాచార విధానం తదితర అంశాలపై శిక్షణ ఇచ్చారు.

తీసుకోవాల్సిన చర్యలు

పోలీస్‌ శాఖలో నియమితులై పూర్తి స్థాయిలో సాంకేతిక పరిజ్ఞానంపై పట్టు ఉన్న సిబ్బందిని ఎంపిక చేశారు. సైబర్‌ నేరాలను నియంత్రించేందుకు ఎక్కడికక్కడే ఠాణాల వారీగా చర్యలు తీసుకుంటారు. నేర బాధితులకు మెరుగైన సేవలు అందించేందుకు సైబర్‌ వారియర్లకు ఒక మొబైల్‌తో పాటు సిమ్‌కార్డును అందజేశారు. సైబర్‌ కేసుల్లో పూర్తి స్థాయి ఆధారాలను సేకరించి నేరస్థులను గుర్తించడం, బాధితులకు న్యాయం చేసి, నేరస్తులకు శిక్షలు పడేలా చేయడం వారి విధి. కేసుల పరిస్థితిని బాధితులకు ఎప్పటికప్పుడు తెలియజేస్తారు.

  • జిల్లాలో జనవరి నుంచి మార్చి వరకు 189 ఫిర్యాదులు అందాయి. బాధితులు రూ.93,81,628 మోసపోయారు. ఇప్పటి వరకు 67 కేసులు పరిష్కరించగా రూ. 13,19,741 హోల్డ్‌లో పెట్టారు.

అవగాహన పెంపొందించుకోవాలి

సుధీర్‌ రాంనాథ్‌ కేకన్‌ ఎస్పీ మహబూబాబాద్‌

ప్రజలు సైబర్‌ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి. వ్యక్తిగత వివరాలను ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌లలో నమోదు చేయొద్దు. చరవాణులకు అపరిచితులు పంపిన లింకులను తెరవొద్దు. చరవాణి నుంచి ఆర్థిక లావాదేవీలు జరిపే సమయంలో అప్రమత్తంగా ఉండాలి. సైబర్‌ నేరానికి గురైతే వెంటనే 1930కి ఫిర్యాదు చేసి, సంబంధిత ఠాణాలో సంప్రదించాలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని