logo

నెగ్గేదెవరైనా.. విమానం తీసుకురావాలి

కొన్నేళ్లుగా వరంగల్‌ మామునూరు విమానాశ్రయం ఏర్పాటు ప్రక్రియ ముందుకు వెనక్కి అన్నట్టు సాగుతోంది. ఉమ్మడి వరంగల్‌ అభివృద్ధికి తోడ్పడే దీని పునరుద్ధరణ అంశం వరంగల్‌ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థులకు ఎంతో కీలకం కానుంది.

Updated : 24 Apr 2024 06:00 IST

‘వరంగల్‌’కు అత్యంత ప్రాధాన్యాంశం

కొన్నేళ్లుగా వరంగల్‌ మామునూరు విమానాశ్రయం ఏర్పాటు ప్రక్రియ ముందుకు వెనక్కి అన్నట్టు సాగుతోంది. ఉమ్మడి వరంగల్‌ అభివృద్ధికి తోడ్పడే దీని పునరుద్ధరణ అంశం వరంగల్‌ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థులకు ఎంతో కీలకం కానుంది. ఈ నేపథ్యంలో వరంగల్‌ విమానాశ్రయం ఏర్పాటులో ఉన్న అడ్డంకులు ఏమిటి? సేకరించాల్సిన భూమి ఎంత? ఇందుకు ప్రధాన పార్టీల అభ్యర్థులు ఎలా కృషిచేస్తామని చెబుతున్నారు? అనే కోణంలో ప్రత్యేక కథనం.

ఈనాడు, వరంగల్‌, మామునూరు, న్యూస్‌టుడే

విషయం ఇది

స్వాతంత్య్రం రాకముందే నిజాం కాలంలో వాయుదూత్‌ విమానాలు మామునూరులో నడిచాయి. భారత్‌ చైనా యుద్ధ సమయంలో ఇది కీలక సేవలు అందించింది. ఇప్పటికీ రన్‌వే ఉంది. రాకపోకలు సాగినప్పుడు 1871 ఎకరాల స్థలం ఉండేది. 32 ఏళ్ల కిందట పూర్తిగా మూత పడింది. అప్పుడప్పుడు శిక్షణ ఎయిర్‌క్రాఫ్ట్‌లు మాత్రం నడుస్తున్నాయి.

విమానాశ్రయం కోసం నక్కలపల్లిలో సేకరించే భూముల్లో  పసుపురంగు గుర్తు పెట్టిన రెవెన్యూ అధికారులు

తర్వాత ఏం జరిగింది..

మూతపడిన తర్వాత విమానాశ్రయం స్థలాన్ని పోలీసు బెటాలియన్‌, నవోదయ విద్యాలయం, వెటర్నరీ కళాశాలకు కొంత చొప్పున ఇవ్వడంతో ఇప్పుడు మిగిలింది 775 ఎకరాలే...

అడ్డంకులు ఏమున్నాయంటే..  

  • వరంగల్‌-ఖమ్మం జాతీయ రహదారిపై ఉన్న ఈ విమానాశ్రయం పునరుద్ధరణ చేపట్టాలంటే 1200 ఎకరాల భూమి అవసరమని ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్‌ ఇండియా పేర్కొంది. దీంతో మరో 425 ఎకరాల భూమిని సేకరించి పౌర విమానయాన శాఖకు అప్పగించాల్సి ఉంది. గత భారాస ప్రభుత్వ హయాంలో రెవెన్యూ శాఖ 185 ఎకరాల భూ సేకరణ చేసింది. భూములు కోల్పోయిన రైతులకు పరిహారం చెల్లించలేదు. మరో 240 ఎకరాల భూమిని సైతం సేకరించాల్సి ఉంది.
  • హైదరాబాద్‌లోని రాజీవ్‌గాంధీ విమానాశ్రయం నిర్మించిన జీఎంఆర్‌ సంస్థతో ఉన్న ఒక ఒప్పందం సైతం అడ్డంకిగా మారింది. ఈ క్రమంలో వరంగల్‌ ఎంపీ పాత్ర ఎంతో కీలకం కానుంది.

‘ఎన్నో ఏళ్లుగా ఊరిస్తున్న వరంగల్‌ విమానాశ్రయం ఏర్పాటుకు నెమ్మదిగా అడుగులు పడుతున్నాయి. ప్రాథమిక భూ సర్వే కోసం ఎయిర్‌పోర్ట్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా కసరత్తు ప్రారంభించింది.’

ఇప్పుడు ఏం చేయాలంటే..

అటు విమానయాన శాఖ, ఇటు రాష్ట్ర ప్రభుత్వంతో ఉన్నత స్థాయి సమావేశాన్ని ఓరుగల్లులో లేదా హైదరాబాద్‌లో ఏర్పాటుచేయాలి. రాష్ట్రంలో ముఖ్య నగరమైన వరంగల్‌కు ఎయిర్‌ పోర్టు రావాల్సిన ఆవశ్యకతను తెలియజేయాలి. కాకతీయ మెగా జౌళి పార్కు ఏర్పాటు, ఐటీ పరిశ్రమలు, యునెస్కోతో రామప్ప అంతర్జాతీయ పర్యాటక కేంద్రం కావడం.. ఇలా వివిధ అభివృద్ధి ప్రాజెక్టులు వస్తున్న క్రమంలో ప్రయాణికులకు ఎయిర్‌పోర్టు చాలా ముఖ్యమని తెలియజెప్పాలి. అందుబాటులో ఉన్న భూమి, సేకరించాల్సిన దానిపై చర్చ జరిగి అవసరమైతే కలెక్టర్‌ నేతృత్వంలో ఒక కమిటీ ఏర్పాటుచేసి ప్రక్రియను వేగవంతం చేస్తే విమానాశ్రయం మరో ఏడాదికైనా ఏర్పాటయ్యే అవకాశం ఉంది.

పరిహారం చెలించాలి

మన్నె శ్రీనివాస్‌ నక్కలపల్లి

మా కుటుంబానికి చెందిన దాదాపు 2 ఎకరాల భూమి ఎయిర్‌పోర్టు అభివృద్ధి కోసం ఇచ్చాం. పరిహారం ఇవ్వలేదు. మాలాగే నక్కలపల్లి, గుంటూరుపల్లికి చెందిన 50 మందికిపైగా బాధితులు ఉన్నారు. రోజు రోజుకు భూముల ధరల పెరుగుతున్నాయి. మేమంతా స్వచ్ఛందంగా నగర అభివృద్ధి కోసం భూములు ఇచ్చాం. మాకు వెంటనే పరిహారం ఇవ్వాలి.

అభ్యర్థులు ఏమన్నారంటే?

వరంగల్‌ లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న ముగ్గురు ప్రధాన పార్టీల అభ్యర్థుల అభిప్రాయాలను ‘ఈనాడు’ తీసుకొంది. తాము విజయం సాధిస్తే విమానాశ్రయం కోసం పోరాడుతామని వారు  చెబుతున్నారు.

తప్పకుండా సాకారం చేస్తా

అరూరి రమేశ్‌, భాజపా

కేంద్రంలో మూడోసారి మోదీ ప్రభుత్వం వస్తుంది. ఇక్కడ నేను కూడా తప్పక విజయం సాధిస్తాననే నమ్మకం ఉంది. ఎయిర్‌పోర్టుకు 400 ఎకరాలకు పైగా భూమి కావాలి. దీనికి రాష్ట్ర ప్రభుత్వం సహకరించాలి. ఒకవేళ సహకరించకపోయినా పోరాడి భూసేకరణ పూర్తి చేస్తాం. అనంతరం మోదీ సహకారంతో కచ్చితంగా విమానాశ్రయం సాకారం చేస్తా.

స్థానిక మ్యానిఫెస్టోలో పొందుపరుస్తాం..

డాక్టర్‌ కడియం కావ్య,  కాంగ్రెస్‌  

విమానాశ్రయం ఏర్పాటుకు అత్యంత ప్రాధాన్యం ఇస్తాం. వరంగల్‌ లోక్‌సభ పరిధిలో నెరవెర్చాల్సిన హామీలపై ఒక మ్యానిఫెస్టోను రూపొందిస్తున్నాం. ఇందులో విమానాశ్రయం అంశం చేరుస్తాం.

కాంగ్రెస్‌, భాజపాలు ధ్వంసం చేశాయి

డాక్టర్‌ మారేపల్లి సుధీర్‌కుమార్‌, భారాస

వరంగల్‌లో ఒకప్పుడు విమానాశ్రయం ఉంది. దీన్ని పునరుద్ధరిస్తే చాలు.  కాంగ్రెస్‌, భాజపాలు వరంగల్‌ అభివృద్ధికి విఘాతం కలిగిస్తున్నాయి. కాంగ్రెస్‌ పాత విమానాశ్రయాన్ని పూర్తిగా తీసేయగా, మోదీ వచ్చాక జీఎంఆర్‌తో ఉన్న ఒప్పందాన్ని మరో 35 ఏళ్లకు పెంచారు. దీని వల్ల మనకు అంతర్జాతీయ విమానాశ్రయం భాగ్యం కలగడం లేదు. నేను ఎంపీగా నెగ్గితే దీనిపై పార్లమెంటులో గళమెత్తి కచ్చితంగా తీసుకొచ్చేలా కృషి చేస్తా.
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని