logo

సీఎం రేవంత్‌రెడ్డి బహిరంగ సభకు సర్వం సిద్ధం

లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బుధవారం పాల్గొననున్న ‘ఓరుగల్లు జనజాతర’ బహిరంగ సభకు సర్వం సిద్ధమైంది. హనుమకొండ జిల్లా కాజీపేట మండలం మడికొండ సెయింట్‌ పాల్స్‌ మైదానంలో మధ్యాహ్నం 3 గంటలకు బహిరంగ సభ ఉంటుందని లోక్‌సభ ఎన్నికల ఇన్‌ఛార్జి, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి తెలిపారు.

Updated : 24 Apr 2024 05:57 IST

లక్షకు పైగా జన సమీకరణకు కాంగ్రెస్‌ ఏర్పాట్లు

మడికొండ శివారులో ఏర్పాటు చేసిన సభావేదిక

మడికొండ, న్యూస్‌టుడే: లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బుధవారం పాల్గొననున్న ‘ఓరుగల్లు జనజాతర’ బహిరంగ సభకు సర్వం సిద్ధమైంది. హనుమకొండ జిల్లా కాజీపేట మండలం మడికొండ సెయింట్‌ పాల్స్‌ మైదానంలో మధ్యాహ్నం 3 గంటలకు బహిరంగ సభ ఉంటుందని లోక్‌సభ ఎన్నికల ఇన్‌ఛార్జి, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రి మధ్యాహ్నం 3.20 నుంచి 3.40 గంటల మధ్య సభాస్థలికి చేరుకుంటారని చెప్పారు. మంగళవారం స్టేషన్‌ ఘన్‌పూర్‌, వర్ధన్నపేట ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, కేఆర్‌ నాగరాజు, వరంగల్‌ నగర పోలీస్‌ కమిషనర్‌ అంబర్‌ కిషోర్‌ ఝా, ముఖ్యమంత్రి భద్రతా సిబ్బంది సభా వేదిక, పరిసరాల్లో ఏర్పాట్లను పరిశీలించారు. వరంగల్‌ లోక్‌సభ పరిధిలోని ఏడు నియోజకవర్గాల నుంచి లక్షకుపైగా జనం హాజరవుతారన్న అంచనాతో ఏర్పాట్లు చేశారు. కాంగ్రెస్‌ అభ్యర్థి కడియం కావ్య నామినేషన్‌ అనంతరం నేతలంతా మధ్యాహ్నం బహిరంగ సభ వద్దకు రానున్నారు.

  • ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో పాటు అభ్యర్థి కడియం కావ్య, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కొండా సురేఖ, ధనసరి అనసూయ సీతక్క, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, ఏఐసీసీ ఇన్‌ఛార్జి దీపాదాస్‌ మున్షి, నాయకులు రోహిత్‌చౌదరి, స్థానిక ఎమ్మెల్యేలు సభా వేదికపై పాల్గొననున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.

ట్రాఫిక్‌ మళ్లింపు..

హైదరాబాద్‌ ప్రధాన రహదారి పక్కన బహిరంగ సభ ఉండడంతో రాకపోకల రద్దీ సమయంలో అప్రమత్తంగా ఉండి ట్రాఫిక్‌ను మళ్లించాలని సీపీ అంబర్‌ కిషోర్‌ ఝా పోలీస్‌ అధికారులను ఆదేశించారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి కాజీపేట నుంచి వచ్చే వాహనాలను మడికొండ చౌరస్తా మీదుగా ధర్మసాగర్‌ ఔటర్‌కు మళ్లిస్తారు. హైదరాబాద్‌ నుంచి వచ్చే వాహనాలను హసన్‌పర్తి మీదుగా పంపిస్తారు. బందోబస్తులో వంద మంది పోలీసు అధికారులు, 700 మంది సిబ్బంది పాల్గొనున్నారు.

సభకు వచ్చే వాహనాల పార్కింగ్‌ ఇలా..

  • జనగామ, పాలకుర్తి, భూపాలపల్లి, పరకాల నుంచి వచ్చే వాహనాలు దిల్లీ పబ్లిక్‌ పాఠశాల వద్ద ఔటర్‌ దిగి రాంపూర్‌ సమీపంలో నిలపాలి.
  • వరంగల్‌ పశ్చిమ, తూర్పు, వర్ధన్నపేట నియోజకవర్గాల నుంచి వచ్చే వాహనాలను మడికొండ చౌరస్తా దగ్గర ఆపాలి.  
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని