logo

భాజపాతోనే మాదిగలకు న్యాయం

భాజపాతోనే మాదిగలకు న్యాయం జరుగుతుందని వరంగల్‌ ఎంపీ అభ్యర్థి అరూరి రమేశ్‌ పేర్కొన్నారు.

Published : 29 Apr 2024 04:33 IST

ఐక్యత చాటుతున్న భాజపా అభ్యర్థి అరూరి రమేశ్‌, మాజీ ఎమ్మెల్యేలు శ్రీధర్‌, శ్రీరాములు, రాజేశ్వర్‌రావు తదితరులు

వర్ధన్నపేట, న్యూస్‌టుడే: భాజపాతోనే మాదిగలకు న్యాయం జరుగుతుందని వరంగల్‌ ఎంపీ అభ్యర్థి అరూరి రమేశ్‌ పేర్కొన్నారు. వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామ శివారులోని ఓ వేడుకల మందిరంలో ఆదివారం రాత్రి రాష్ట్ర ఎస్సీ మోర్చా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కొండేటి శ్రీధర్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమ్మేళనంలో అరూరి పాల్గొని మాట్లాడారు. కడియం శ్రీహరి తెదేపా, భారాసలో ఉన్నత పదవులు అనుభవించి.. మిగిలిన దళిత నేతలను ఎదగకుండా చేసిన ద్రోహి అని ఆరోపించారు. కాంగ్రెస్‌లో చేరి ఆ పార్టీలోని దళిత నేతలకు టికెట్‌ రాకుండా చేశారని మండిపడ్డారు. అవసరాల కోసం పార్టీలు మారడం తప్ప కడియం శ్రీహరి ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. కడియం శ్రీహరికి బుద్ధి చెప్పాలంటే భాజపాను గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు వన్నాల శ్రీరాములు, రాజేశ్వర్‌రావు, హనుమకొండ జడ్పీ వైస్‌ ఛైర్మన్‌ గజ్జెల శ్రీరాములు, భాజపా నేతలు కేశవరెడ్డి, తిరుపతిరెడ్డి, కుమారస్వామి, మహేందర్‌, ప్రభాకర్‌ తదితరులు పాల్గొన్నారు.

‘మోదీ పాలనకు జనామోదం’

కాశీబుగ్గ, న్యూస్‌టుడే: దేశంలో పదేళ్ల మోదీ పాలనకు జనామోదం ఉందని, రానున్న ఎన్నికల ఫలితాల ద్వారా అది రుజువు కాబోతుందని భాజపా వరంగల్‌ ఎంపీ అభ్యర్థి అరూరి రమేశ్‌ పేర్కొన్నారు. వరంగల్‌ ఎనుమాములలో ఆదివారం వరంగల్‌ అర్బన్‌ బ్యాంకు ఛైర్మన్‌ ఎర్రబెల్లి ప్రదీప్‌రావుతో కలిసి పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వివిధ పార్టీల నాయకులు భాజపాలో చేరగా.. వారికి కండువా కప్పి ఆహ్వానించారు. మోదీ పేరే నన్ను గెలిపిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. భాజపా నాయకులు ముడుసు నర్సింహా, పత్రి సుభాశ్‌ తదితరులు పాల్గొన్నారు.

ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ ఆదేశాలనుసారం భాజపా ఎంపీ అభ్యర్థి అరూరి రమేశ్‌ గెలుపునకు కృషి చేస్తామని ఎంఎస్‌పీ నేత మంద కుమార్‌మాదిగ ప్రకటించారు. వరంగల్‌ కాశీబుగ్గ పార్కులో ఆదివారం నిర్వహించిన ఎమ్మార్పీఎస్‌ సమావేశంలో అరూరికి మద్దతుగా కరపత్రాలను ఆవిష్కరించారు. కట్ల రాజశేఖర్‌, చింతం సిద్ధూ, రాకేశ్‌కుమార్‌, వినయ్‌, కళ్లపెల్లి ప్రణయ్‌దీప్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని