logo

ఉద్యమ నేతను చూసి ఉప్పొంగిన ఆనందం

గులాబీ దళపతి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ బస్సు యాత్ర హనుమకొండ నగరంలో ఆదివారం విజయవంతమైంది. నక్కలగుట్టలో సాయంత్రం 4 గంటల నుంచి వరంగల్‌ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో భారాస నేతలు, కార్యకర్తలు, కేసీఆర్‌ అభిమానులు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు.

Updated : 29 Apr 2024 05:38 IST

నగరంలో బస్సు యాత్రకు విశేష స్పందన

ప్రజలకు అభివాదం చేస్తున్న మాజీ సీఎం కేసీఆర్‌. పక్కన వరంగల్‌ లోక్‌సభ భారాస అభ్యర్థి సుధీర్‌కుమార్‌

గులాబీ దళపతి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ బస్సు యాత్ర హనుమకొండ నగరంలో ఆదివారం విజయవంతమైంది. నక్కలగుట్టలో సాయంత్రం 4 గంటల నుంచి వరంగల్‌ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో భారాస నేతలు, కార్యకర్తలు, కేసీఆర్‌ అభిమానులు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. నక్కలగుట్టలోని అంబేడ్కర్‌ కూడలిలో బస్సులో వచ్చిన కేసీఆర్‌ను చూసి పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కళాకారుల నృత్యాలు, ఆదివాసీల కొమ్ము నృత్యం, మహిళల కోలాటాలతో ఘన స్వాగతం పలికారు. అంబేడ్కర్‌ కూడలి నుంచి హనుమకొండ చౌరస్తా కూడలి వరకు దారి పొడవునా జనం బారులు తీరారు. బస్సులో ముందు భాగంలో కేసీఆర్‌ కూర్చొని ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. అతి దగ్గరగా కేసీఆర్‌ కనిపించడంతో అభిమానులు, కార్యకర్తలు చేతులు ఆడిస్తూ తమ చరవాణిలో చిత్రాలు తీసుకున్నారు.

న్యూస్‌టుడే, బాలసముద్రం, హనుమకొండ చౌరస్తా, విద్యానగర్‌

మాట్లాడుతున్న కేసీఆర్‌. పక్కన అభ్యర్థి సుధీర్‌కుమార్‌. జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి, మాజీ మంత్రి దయాకర్‌రావు, మాజీ ఎమ్మెల్యేలు ధర్మారెడ్డి, రాజయ్య, శాసన మండలి ఉపాధ్యక్షుడు బండా ప్రకాశ్‌

పర్యటన ఇలా..

  • రాత్రి 7.39 గంటలు: మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ అంబేడ్కర్‌ సెంటర్‌కు చేరుకున్నారు.
  • 8.15: హనుమకొండ చౌరస్తా కార్నర్‌కు వచ్చారు.  
  • 8.35: ప్రచార వాహనంపైకి వచ్చారు.
  • 8.36 నుంచి 8.58:  ప్రసంగించారు.
  • 9.00: బస్సులోకి వెళ్లారు.
  • 9.29: అడ్వకేట్స్‌ కాలనీలోని కెప్టెన్‌ లక్ష్మీకాంతారావు నివాసానికి చేరుకున్నారు. ఆదివారం రాత్రి అక్కడే బస చేశారు.  

విశేషాలు..

ఉత్సాహంగా డప్పుతో దరువేస్తూ నృత్యం చేస్తున్న మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ తాటికొండ రాజయ్య

  • చరిత్రకు ప్రతీక వరంగల్‌ జిల్లా అంటూ కేసీఆర్‌ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. 
  • దారి పొడవునా గులాబీ కాగితపు పూల వర్షం కురిపించారు.
  • భద్రాచలం ఆదివాసీల కొమ్ము నృత్యం ఆకట్టుకుంది. 
  • సికింద్రాబాద్‌ నుంచి వచ్చిన పోతురాజులు ఉగ్రరూప ప్రదర్శన చేశారు. 
  • వందలాది మంది మహిళలు బోనాలతో పాల్గొన్నారు. 
  • ఏకరూప దుస్తులతో మహిళలు కోలాటం, బృంద నృత్యాలు చేశారు. 
  • సుమారు 22 నిమిషాల పాటు కేసీఆర్‌ ప్రసంగం సాగింది. మధ్యలో రెండు నిమిషాల పాటు ఉర్దూలో మాట్లాడి ముస్లిం, మైనార్టీలకు గతంలో తమ ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాలను వివరించారు. 
  • చౌరస్తాలో బస్సులో నుంచి కేసీఆర్‌ బయటకు రాగానే అందరూ ఒక్కసారిగా సీఎం.. సీఎం.. అంటూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు. 
  • కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చాక స్థిరాస్తి వ్యాపారం పడిపోయిందని దానిపై ఆధారపడిన అనేక కుటుంబాలు రోడ్డున పడ్డాయన్నారు. 
  • రాష్ట్రంలోని నగరాల్లో నిర్మాణం పూర్తయిన వాటికి అక్యుపెన్సీ సర్టిఫికెట్లు ఇవ్వడం లేదన్నారు.

కెప్టెన్‌ ఇంట్లో రాత్రి బస

కెప్టెన్‌ లక్ష్మీకాంతారావు నివాసంలో ఉమ్మడి జిల్లా భారాస నేతలతో సమావేశమైన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌

హనుమకొండ రోడ్డు షో అనంతరం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ మాజీ రాజ్యసభ సభ్యుడు కెప్టెన్‌ లక్ష్మీకాంతరావు నివాసంలో రాత్రి బస చేశారు. ఈ సందర్భంగా ఉమ్మడి జిల్లాకు చెందిన భారాస ముఖ్యనేతలు కేసీఆర్‌తో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో వరంగల్‌లో రాజకీయ పరిణామాలపై కేసీఆర్‌ ఆరా తీశారు.  సోమవారం మధ్యాహ్నం కేసీఆర్‌ వరంగల్‌ నుంచి వర్ధన్నపేట, తొర్రూరు మీదుగా ఖమ్మంలో జరగనున్న రోడ్డు షోకు బయలుదేరి వెళ్లనున్నారు.

ఈనాడు, వరంగల్‌

అభిమానాన్ని చాటుకుంటున్న కార్యకర్తలు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని