logo

తాగునీటి ఎద్దడి రాకుండా అప్రమత్తత అవసరం

వరంగల్‌ నగరంలో తాగునీటి ఎద్దడి రావొద్దు, రెండునెలల పాటు అధికారులందరూ అప్రమత్తంగా పనిచేయాలని ఐఏఎస్‌ అధికారి, రాష్ట్ర ప్రభుత్వం నియమించిన వరంగల్‌ ఉమ్మడి జిల్లా నీటి సరఫరా ప్రత్యేకాధికారి బి.గోపి సూచించారు.

Published : 30 Apr 2024 03:08 IST

 సమావేశంలో మాట్లాడుతున్న నీటి సరఫరా వరంగల్‌ ఉమ్మడి జిల్లా ప్రత్యేకాధికారి గోపి, చిత్రంలో హనుమకొండ జిల్లా కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌, కమిషనర్‌ అశ్విని తానాజీ వాకడే
కార్పొరేషన్‌, న్యూస్‌టుడే: వరంగల్‌ నగరంలో తాగునీటి ఎద్దడి రావొద్దు, రెండునెలల పాటు అధికారులందరూ అప్రమత్తంగా పనిచేయాలని ఐఏఎస్‌ అధికారి, రాష్ట్ర ప్రభుత్వం నియమించిన వరంగల్‌ ఉమ్మడి జిల్లా నీటి సరఫరా ప్రత్యేకాధికారి బి.గోపి సూచించారు. నీటి సరఫరాపై రోజువారీగా నివేదికలు పంపించాలని, మీ పరిధిలో కాకపోతే నేరుగా రాష్ట్ర ప్రభుత్వం రంగంలోకి దిగుతుందన్నారు. నగరంలో తాగునీటి సరఫరా తీరు, వేసవి ప్రణాళిక, సమస్యలు తదితర అంశాలపై సోమవారం మధ్యాహ్నం హనుమకొండ జిల్లా కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌, గ్రేటర్‌ వరంగల్‌ కమిషనర్‌ అశ్విని తానాజీ వాకడేతో కలిసి బల్దియా సమావేశ మందిరంలో సమీక్ష నిర్వహించారు.

ఎస్‌ఈ ప్రవీణ్‌చంద్ర నగరంలోని 66 డివిజన్ల వారీగా నీటి సరఫరా, ధర్మసాగర్‌ చెరువులో నీటినిల్వల వివరాలు తెలిపారు. ఎల్‌ఎండీ ద్వారా రా వాటర్‌ వస్తుందా?, ఏయే ప్రాంతాల్లో నీటి సరఫరా సమస్యలు ఉన్నాయి, అద్దె వాటర్‌ ట్యాంకర్లు తదితర అంశాలపై ప్రత్యేకాధికారి గోపి అడిగి తెలుసుకున్నారు. వేసవిలో అధికారులు, ఉద్యోగులకు సెలవులు లేవని, నీటి సరఫరాపై శ్రద్ధ పెట్టాలని, లీకేజీలు గంటల వ్యవధిలోనే అరికట్టేలా చూడాలన్నారు.

 కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌ మాట్లాడుతూ.. నీటి సరఫరాపై ఏ చిన్న సమస్య తలెత్తినా వెంటనే పరిష్కారమయ్యేలా చూడాలన్నారు. 66 డివిజన్లకు ప్రత్యేకాధికారులను నియమించాలన్నారు. ఇంజినీర్లు కాలనీల్లో పర్యటించాలని సూచించారు. కమిషనర్‌ అశ్విని తానాజీ వాకడే మాట్లాడుతూ.. నీటి సరఫరాపై ఫిర్యాదులు స్వీకరించేందుకు ప్రత్యేక సెల్‌ ఏర్పాటు చేశామని, అప్రమత్తంగా ఉన్నామన్నారు. అనంతరం హనుమకొండ కేయూసీ ఫిల్టర్‌బెడ్‌ను ప్రత్యేకాధికారి గోపి పరిశీలించారు. కార్యక్రమంలో ఎస్‌ఈ ప్రవీణ్‌చంద్ర, పబ్లిక్‌హెల్త్‌ ఈఈ రాజ్‌కుమార్‌, బల్దియా ఈఈలు రాజయ్య, శ్రీనివాసరావు, శ్రీనివాస్‌, డీఈలు, ఏఈలు, లైన్‌మెన్లు పాల్గొన్నారు.

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని