logo

Andhra news: గోదావరిలో దూకిన దంపతులు.. శవమై తేలిన నవ వధువు

నవ దంపతులు సిద్ధాంతం వంతెన పైనుంచి మంగళవారం గోదావరిలోకి దూకిన ఘటనలో భర్త ఒడ్డుకు చేరుకోగా.. భార్య గల్లంతైన విషయం తెలిసిందే.

Updated : 22 Dec 2023 09:54 IST

భర్త హత్య చేసి ఉంటాడని బంధువులు ఆందోళన

పెనుగొండ గ్రామీణ, పెనుగొండ, పోడూరు, న్యూస్‌టుడే: నవ దంపతులు సిద్ధాంతం వంతెన పైనుంచి మంగళవారం గోదావరిలోకి దూకిన ఘటనలో భర్త ఒడ్డుకు చేరుకోగా.. భార్య గల్లంతైన విషయం తెలిసిందే. ఆ రోజు నుంచి గాలిస్తుండగా గురువారం తెల్లవారుజామున జాలర్లకు సత్యవాణి(19) మృతదేహం దొరికింది. పెళ్లైన ఐదు రోజుల్లో ఆత్మహత్య చేసుకోవాల్సిన దుస్థితి మా అమ్మాయికి లేదని, భర్త హత్య చేసి ఉంటాడని యువతి బంధువులు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు గురువారం జాతీయ రహదారిపై బైఠాయించి న్యాయం చేయాలంటూ ఆందోళన చేశారు. రాకపోకలు నిలిచిపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. విషయం తెలుసుకున్న సీఐ నాగేశ్వరరావు, ఏస్సై రమేష్‌ తదితరులు అక్కడికి చేరుకొని బంధువులకు నచ్చజెప్పారు. మృతదేహాన్ని పోస్టుమార్టంకు పంపితే నిజాలు తెలుస్తాయని, భర్త శివరామకృష్ణ తమ అదుపులోనే ఉన్నాడని తగిన న్యాయం చేస్తామని భరోసా ఇవ్వడంతో ఆందోళన విరమించారు. మృతురాలి తాత మెల్లు రామారావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అనుమానాస్పద స్థితిలో మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రమేష్‌ తెలిపారు. పోస్ట్‌మార్టం నిమిత్తం యువతి మృతదేహాన్ని తణుకు ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. నరసాపురం డీఎస్పీ కె.రవి మనోహర చారి, పెనుగొండ తహసీల్దారు ఎన్‌.గురుమూర్తిరెడ్డి ఘటన స్థలానికి వెళ్లి పరిశీలించారు. సంఘటనకు గల కారణాలపై నవ వధువు బంధువులను అడిగి తెలుసుకున్నారు.

సహకరించలేదనే..: రామారావు మనవరాలు సత్యవాణిని కైలా శివరామకృష్ణకు ఇచ్చి ఈ నెల 15న వివాహం చేశారు. మొదటి రోజు ఉండ్రాజవరం మండలం మోర్త, రెండో రోజు పెనుగొండ మండలం వడలిలో గడిపారు. నీవంటే నాకు ఇష్టం లేదంటూ వధువు దాంపత్యానికి సహకరించలేదని, దీంతో ఇద్దరం కలిసి ఆత్మహత్య చేసుకోవాలనుకున్నామని శివరామకృష్ణ పోలీసులకు వెల్లడించారు. శివరామకృష్ణ న్యాయవాది వద్ద లేఖరిగా ఉంటూ ఖాళీ సమయాల్లో ఆటో నడుపుతుంటాడు.

పలు అనుమానాలు..: ఇద్దరూ కలిసి బ్రిడ్జిపై నుంచి దూకినప్పుడు శివరామకృష్ణ కిలోమీటరు మేర సిద్ధాంతం వరకు ఎలా ఈదుతాడు, అతడిని కొందరు బయటకు తీసినచోట వధువు చెప్పులు ఉండటమేమిటి, శివరామకృష్ణతో ఇంకెవరైనా ఉన్నారా, బంగారు ఆభరణాలు ఏమయ్యాయి, ముందుగానే హత్య చేసి గోదావరిలోకి తోసేశాడా.. అనే అనుమానాలు వ్యక్తం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని