logo

బోరుపైపు నుంచి మంటలు

యలమంచిలి రెవెన్యూ పరిధిలోని కొత్తలంకలో నూతనంగా ఏర్పాటు చేసిన ఒక బోరు పైపు నుంచి సోమవారం మంటలు ఎగిసిపడటం కలకలం రేపింది

Published : 23 Apr 2024 05:53 IST

కొత్తలంక ఆక్వా చెరువుల వద్ద కలకలం

అదుపు చేసిన ఓఎన్‌జీసీ సిబ్బంది

 

యలమంచిలి, న్యూస్‌టుడే: యలమంచిలి రెవెన్యూ పరిధిలోని కొత్తలంకలో నూతనంగా ఏర్పాటు చేసిన ఒక బోరు పైపు నుంచి సోమవారం మంటలు ఎగిసిపడటం కలకలం రేపింది. భౌగోళికంగా కోనసీమ జిల్లా వైపునున్న కొత్తలంక ప్రాంతం యలమంచిలి రెవెన్యూలో ఉంది. గోదావరి తన గమనాన్ని మార్చుకోవడం వల్ల పశ్చిమ గోదావరిలోని కొన్ని లంకభూములు ప్రస్తుతం కోనసీమ జిల్లా వైపున ఉన్నాయి. రెవెన్యూ పరంగా పశ్చిమలోనే కొనసాగుతున్నాయి. ఈ కోవకు చెందినదే కొత్తలంక.  ఆక్వా చెరువుతోపాటు సమీపంలో ఉన్న కొబ్బరితోటకు నీరు తోడేందుకు వీలుగా రైతు కాసా విష్ణుమూర్తి 200 అడుగుల మేర బోరు ఆదివారం తవ్వించారు. మోటారు ఏర్పాటు చేసి రెండుగంటల పాటు తోటకు నీరు కూడా తోడారు. సోమవారం మళ్లీ బోరు వేయగా కొంతసేపు శబ్దం వచ్చి ఆ తర్వాత మంటలు వచ్చినట్లు చెబుతున్నారు. చెరువుల దగ్గర ఉన్న రైతులు, కూలీలు మంటలను అదుపు చేయడానికి ప్రయత్నించినా అదుపులోకి రాకపోవడంతో కోనసీమ జిల్లా రాజోలు అగ్నిమాపక సిబ్బందికి, మలికిపురం మండలం కేసన్నపల్లి ఓఎన్‌జీసీ సిబ్బందికి సమాచారం అందించగా వారు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటలు వచ్చిన ప్రాంతంలో ఎటువంటి గ్యాస్‌ పైపులు లేవని తేల్చారు. భూగర్భంలో గ్యాస్‌ నిల్వలు ఉండటం వల్ల మంటలు వచ్చి ఉంటాయని ఓఎన్‌జీసీ సిబ్బంది భావిస్తున్నారు. నెమ్మదిగా బోరు తవ్విన ప్రాంతాన్ని పూడ్చేసి సిమెంట్‌తో డమ్మీ  వేశారని తహసీల్దార్‌ విజయశ్రీ వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని