logo

విలీనం..బతుకు ‘చక్ర’బంధం!

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తే తమ కష్టాలు తీరి, ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు, ప్రయోజనాలు అందుతాయని ఆశ పడ్డారు ఆర్టీసీ సిబ్బంది.

Updated : 28 Apr 2024 05:22 IST

ఆర్టీసీ కార్మికులను వంచించిన వైకాపా ప్రభుత్వం
ఈనాడు డిజిటల్‌ భీమవరం, తణుకు, భీమవరం అర్బన్‌

 ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తే తమ కష్టాలు తీరి, ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు, ప్రయోజనాలు అందుతాయని ఆశ పడ్డారు ఆర్టీసీ సిబ్బంది. దీని కోసం ఉద్యమాలు సైతం చేశారు. వైకాపా అధికారం చేపట్టిన కొన్ని రోజుల్లోనే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసినా వీసమెత్తు ప్రయోజనం కలగకపోగా, అప్పటికే ఉన్న ప్రయోజనాలు సైతం తొలగించడం గమనార్హం. జీతాలన్నా ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ఉంటున్నాయా అంటే అదీ లేదు. కార్మికులు తలచింది ఒకటైతే జగన్‌ ప్రభుత్వం చేసింది మరొకటి అని విలీనం పేరుతో ప్రభుత్వం ఆడిన నాటకంలో కార్మిక ప్రయోజనాలు కోల్పోయామంటున్నారు ఉద్యోగులు.

అన్నీ కోతలే

 ప్రభుత్వ ఉద్యోగుల కంటే డీఏ 8 శాతం వీరికి తక్కువగా ఉంది. ప్రభుత్వ ఉద్యోగులకు 2018 జనవరి 1 నుంచి వేతన స్కేలు అమలు చేయగా, ఆర్టీసీ వారికి 2022 జనవరి 1 నుంచి అమలు చేశారు. ఈ మధ్యకాలంలో రావాల్సిన డీఏలన్నీ ఇవ్వలేదని ఉద్యోగ సంఘాలు ఆరోపిస్తున్నాయి.

 గృహ అలవెన్స్‌ (హెచ్‌ఆర్‌ఏ) నగరాల్లో హెచ్‌ఆర్‌ఏ 16 నుంచి 12 శాతానికి, గ్రేడ్‌1 మున్సిపాలిటీల్లో 14.5 శాతం నుంచి 12 శాతానికి తగ్గిందని ఆవేదన చెందుతున్నారు. ః కార్పొరేషన్లో ఉండగా ప్రతి నెలా ఒకటో తేదీన వేతనాలు అందేవి. ఇప్పుడు అదంతా కలగా మారిపోయిందని వాపోతున్నారు.

రద్దయిన పాత స్కీములు

ఆర్టీసీ కార్పొరేషన్‌గా ఉన్న సమయంలో ఉద్యోగులకు హెల్త్‌స్కీము అమలయ్యేది. ఎంత తీవ్రమైన అనారోగ్యం వచ్చినా ఉద్యోగులకు ఉచితంగా వైద్యం అందేది. దాదాపు రూ.30లక్షల విలువైన వైద్యం కూడా ఉద్యోగులు పొందిన సందర్భాలున్నాయి. ప్రస్తుతం ఉద్యోగులు ప్రతినెలా రూ.225 చెల్లించి ఈహెచ్‌ఎస్‌ కార్డు తీసుకున్నా ఫలితం లేకుండా పోయింది.  వైద్యపరీక్షలన్నీ సొంతంగానే చేయించుకోవాల్సి వస్తోందని ఉద్యోగులు వాపోతున్నారు.  

పాతజీతాలే.. రోడ్డు రవాణా సంస్థ ప్రభుత్వంలో విలీనమైన తర్వాత వారికందే ఒక్కో ప్రయోజనాన్ని కోల్పోవాల్సి వచ్చింది. పీఆర్‌సీని కోల్పోవడమే కాకుండా, పాత జీతాలతోనే సరిపుచ్చుకోవాల్సి వచ్చింది. ప్రభుత్వ ఉద్యోగుల పీఆర్‌సీ అనగానే 19శాతం తక్కువగా ఉన్న తమ వేతనాలు వారితో సమానంగా పెరుగుతాయని ఆశపడ్డారు. 2019 నాటి వేతనాలతోనే సరిపుచ్చుకోవాల్సి వచ్చింది.

ఆవిరైన హక్కులు.. ఆర్టీసీ సిబ్బందిని ప్రభుత్వ ఉద్యోగులుగా చెబుతున్నా... విధుల్లో మాత్రం కార్మికులుగానే చూస్తోంది.  కానీ సెలవులు ఇవ్వకుండా కంపెనీల చట్టం కింద వారికి అయిదు సెలవులే వర్తింపచేసింది. ప్రభుత్వ ఉద్యోగులు అయ్యారనే నెపంతో కార్మిక చట్టాలు వర్తించకుండా చేశారు. 

డిపోలు :  తణుకు, తాడేపల్లిగూడెం, నరసాపురం, భీమవరం, జంగారెడ్డిగూడెం, నూజివీడు, ఏలూరు
180 మంది : ఒక్కో డిపోలో ఉన్న ఉద్యోగులు (ఏలూరు డిపోలో 300 వరకు ఉన్నారు)
 


 అందని ప్రోత్సాహకాలు  

గతంలో గ్యారేజీ ఉద్యోగులకు రాత్రి భత్యం, డీజిల్‌ పొదుపు చేసినందుకు నెలవారీ ప్రోత్సాహకాలు ఇచ్చేవారు. అదనంగా పని చేసిన సమయానికి అదనపు భత్యం, ప్రతి నెలా టెక్నికల్‌ భత్యం, వేడి దగ్గర పనిచేస్తే హీట్‌ అలవెన్స్‌, 45 ఏళ్లు దాటిన మహిళా కండక్టర్లకు ఆరోగ్య భత్యం వంటి సౌకర్యాలు ఉండేవి. ప్రతి నెలా వచ్చే జీతంతో పాటు వారి అనుభవం ఆధారంగా రూ. వెయ్యి నుంచి రూ.రెండు వేల వరకు అదనపు ఆదాయం వచ్చేది. ఇప్పుడు అవేమీ అందడం లేదు.

- శ్యామ్‌సన్‌, బహుజన ఎంప్లాయిస్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి


గతమెంతో ఘనం

గతంలో రెండేళ్లకు ఒకసారి మూడు జతల ఏకరూప దుస్తులు అందించి, కుట్టుకూలి ఇచ్చేవారు. పాదరక్షలకు  రూ.వెయ్యి అందజేసేవారు. ఇప్పుడు గ్యారేజీ కార్మికులు, ఉద్యోగులు సొంత డబ్బులతోనే బూట్లు, ఏకరూప దుస్తులు కొనుగోలు చేసుకుంటున్నారు. దూర ప్రాంతాలకు వెళ్లే బస్సులు మధ్యలో ఆగిపోతే వాటి మరమ్మతులకు గ్యారేజీల నుంచి మెకానిక్‌లు వెళ్లి బాగు చేసేవారు. ఇప్పుడవేమీ లేవు.

 సుబ్బారావు, నేషనల్‌ మజ్దూర్‌ యూనియన్‌ కార్యదర్శి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు