logo

జగనన్నా... అన్నింటికీ ఎగనామమే!

మాది రైతు ప్రభుత్వం.. మీకు అన్ని రకాలుగా అండగా ఉంటాం.. ఆర్బీకేల ద్వారా రైతుపరమైన కార్యకలాపాలతో సమూల మార్పులకు నాంది పలికాం..   సీఎం జగన్‌మోహన్‌రెడ్డి మాటలివి.

Published : 28 Apr 2024 04:38 IST

రైతులకు అందని రాయితీ బరకాలు, యంత్ర పరికరాలు

సిద్ధాంతంలో యంత్రం ద్వారా ధాన్యాన్ని బరకంపై వేయిస్తున్న రైతు

పెనుమంట్ర, పెనుగొండ గ్రామీణ, న్యూస్‌టుడే: మాది రైతు ప్రభుత్వం.. మీకు అన్ని రకాలుగా అండగా ఉంటాం.. ఆర్బీకేల ద్వారా రైతుపరమైన కార్యకలాపాలతో సమూల మార్పులకు నాంది పలికాం..   సీఎం జగన్‌మోహన్‌రెడ్డి మాటలివి. అందుకనుగుణంగా వ్యవసాయానికి భరోసా కల్పించాల్సింది పోయి ప్రభుత్వం రాయితీ బరకాలు, యంత్ర పరికరాలకు ఎగనామం పెట్టింది.  రైతుల ఒత్తిడితో అధికారులు ప్రభుత్వానికి నివేదించినా కనీసం పట్టించుకోకుండా వాటిని పక్కన పడేసింది. ఫలితంగా ఈ అయిదేళ్లలో రైతులు బరకాల కోసం వెచ్చించిన ఖర్చే రూ.లక్షల్లో ఉంటుంది. యంత్ర పరికరాలు అందక రైతులకు పెట్టుబడి భారం పెరిగింది. ఫలితంగా వారు ఆర్థికంగా నిలదొక్కుకునే మాట ఎలా ఉన్నా అప్పుల మూట కట్టుకున్న పరిస్థితి తలెత్తింది.

ప్రభుత్వం రాయితీ బరకాలు ఇవ్వకపోవడంతో బయట నుంచి అద్దెకు తెచ్చుకుంటున్నారు. యూరియా, రొయ్యల మేత సంచులతో కుట్టిన బరకాలు కావడంతో వర్షం నుంచి ధాన్యానికి రక్షణ స్వల్పంగానే ఉంటుంది. పైగా వీటి అద్దె సైతం ప్రాంతాల వారీగా రూ.20 నుంచి 60 దాకా వసూలు చేస్తున్నారు. అదే చినుకులు పడితే అద్దె రెట్టింపు అవుతుంది. యంత్రాల ద్వారా మాసూళ్లు చేసిన ధాన్యం ఆరబెట్టేందుకు రోజుకు రూ.400 నుంచి రూ.600 వరకు అద్దె రూపంలో చెల్లించాల్సి రావడంతో రైతులపై అదనపు భారం పడుతోంది. నీరు అందనప్పుడు ఆయిల్‌ ఇంజిన్లు ఉపయోగించడం, దుక్కు చేసేందుకు ట్రాక్టర్‌ అద్దె వంటివి తడిసి మోపెడవుతున్నాయి.

బయట ధరలు అధికమే...

బయట మార్కెట్‌లో టార్పాలిన్ల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. సైజులను బట్టి రూ.3 వేల నుంచి రూ.5 వేలు దాకా ఉంది. ఇంత వెచ్చించి కొనుగోలు చేసినా నాణ్యత ఉండకపోవడంతో ఒకటి, రెండు సీజన్‌లు మాత్రమే పనిచేస్తున్నాయి. బ్యాటరీ స్ప్రేయర్లు, ఆయిల్‌ ఇంజిన్లు బయట కొనుగోలు చేయడం రైతులకు భారంగా మారింది.  

రైతులకు ఉపయోగపడేలా...

తెదేపా ప్రభుత్వం రైతులకు రాయితీతో కూడిన యంత్ర పరికరాలను సమకూర్చింది. బ్యాటరీ స్ప్రేయర్లు, పవర్‌టిల్లర్లు, ఆయిల్‌ ఇంజిన్లు, ట్రాక్టర్లు, కోత యంత్రాలను ఆయా సామాజిక వర్గాలకు నిర్ణీత రాయితీతో సరఫరా చేసింది. మాసూళ్ల ప్రక్రియలో కీలకమైన బరకాలకు(టార్పాలిన్లు) అవసరం మేరకు రాయితీ అందించి ప్రకృతి వైపరీత్యాల సందర్భంలో భరోసా కల్పించింది.


బరకాల ఖర్చే ఎక్కువ..

మూడెకరాల్లో వరి పంటను సాగు చేస్తున్నాం. మాసూళ్ల సందర్భంలో బరకాలకు పెట్టే ఖర్చే ఎక్కువగా ఉంటుంది. గతంలో వ్యవసాయశాఖ రాయితీపై టార్పాలిన్లు ఇస్తే వాటిని నాలుగైదు సీజన్లకు వాడుకునే వాళ్లం. ఇప్పుడేమో అటువంటివి లేవంటున్నారు. బయట మార్కెట్‌లో వీటి ధరలు ఎక్కువగా ఉన్నాయి.

తప్పక అద్దె బరకాలపై ఆధారపడుతున్నాం.

-కె.హనుమంతురావు, రైతు, దొంగరావిపాలెం, పెనుగొండ మండలం


అంతా మాటల్లోనే..

ఆకాశమంత ప్రచారం తప్ప రైతులకు ప్రభుత్వం చేసింది శూన్యం. ఈ ప్రభుత్వంలో రాయితీతో కూడిన టార్పాలిన్లు, తైవాన్‌ స్ప్రేయర్ల ఊసే లేదు. ప్రభుత్వ విధానాల ఫలితంగా రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

 ఆకుల హరేరాం, రైతు సంఘం జిల్లా కార్యదర్శి

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని