logo

కొల్లేరుపై అన్నీ కోతలే

దేశంలో అతి పెద్ద మంచినీటి సరస్సు.. ప్రపంచంలోనే మరెక్కడా లేనన్ని పక్షి జాతులు.. అరుదైన మత్స్యజాతికి ఆలవాలం.. ఎన్నో సంస్కృతుల సమాహారం.. ద్వీపాలు, ద్వీపఖండాల మనోహరం కొల్లేరు.

Published : 29 Apr 2024 03:00 IST

పర్యాటకాభివృద్ధికి సొమ్ములు ఇవ్వని ప్రభుత్వం

మండవల్లి, కైకలూరు, న్యూస్‌టుడే: దేశంలో అతి పెద్ద మంచినీటి సరస్సు.. ప్రపంచంలోనే మరెక్కడా లేనన్ని పక్షి జాతులు.. అరుదైన మత్స్యజాతికి ఆలవాలం.. ఎన్నో సంస్కృతుల సమాహారం.. ద్వీపాలు, ద్వీపఖండాల మనోహరం కొల్లేరు. ఇంతటి ప్రాధాన్యం ఉన్నా వైకాపా ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో పర్యాటకంగా అభివృద్ధి చెందలేదు. ఏటికేడు ఆక్రమణలు పెరుగుతున్నాయి. నిలువ నీడలేక ఆకలితో అలమటించి పక్షులు చనిపోతున్నాయి. పెరుగుతున్న కాలుష్యం.. అంతరించిపోతున్న అరుదైన మత్స్యజాతులు, మృత్తికలు ఇలా.. నేడు కొల్లేరులో సహజత్వం కనుమరుగైపోతోంది.

కొల్లేరును పర్యాటకంగా అభివృద్ధి చేస్తే బతుకులు బాగుపడతాయని స్థానికులు ఆశగా ఎదురుచూస్తున్నా.. ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోలేదు. అటవీశాఖ పరిధిలో ఉన్నా కనీస అభివృద్ధికి నోచుకోవడం లేదు. అయిదేళ్లలో ఆటపాక పక్షుల కేంద్రంలో ఒకసారి మినహాయించి మరే ఇతర ప్రాంతంలో రూపాయి ఖర్చు చేసిన దాఖలాలు లేవు. పర్యాటక క్షేత్రంగా తీర్చిదిద్దితే గ్రామాల్లో రోడ్లు, మౌలిక సదుపాయాలు, పర్యాటకుల సందడితో ఉపాధి లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కానీ ఆటపాక పక్షుల కేంద్రంలో సైతం విరిగిన పక్షుల స్టాండ్‌లు, ధ్వంసమైన ఆట వస్తువులతో పార్కు, ఆవాసాల ఏర్పాటుకు అవకాశాలు లేక ఇబ్బందులు పడుతున్న పక్షులు దర్శనమిస్తున్నాయి.

పక్షుల కేంద్రంలో మరమ్మతులు లేక నిలిచిపోయిన బోటు

గత ప్రభుత్వంలో ఇలా..

కొల్లేరుకు పర్యాటకులను ఆకర్షించేందుకు పెలికాన్‌ ఫెస్టివల్‌ పేరుతో మూడు రోజుల పాటు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఏటా ఆటపాక పక్షుల కేంద్రానికి ప్రత్యేక నిధులతో అభివృద్ధి, పార్కులో వసతులు, పక్షుల కూతలకు ప్రత్యేక మిషన్లు, పర్యాటకుల వీక్షణ పాయింట్లు, పక్షుల స్టాండ్‌ల ఏర్పాటు, ఎప్పటికప్పుడు మరమ్మతులు చేసేవారు. కొల్లేరులో జిరాయితీ, సొసైటీ భూముల పంపిణీకి రాష్ట్ర మంత్రివర్గం తీర్మానం చేసి కేంద్రానికి పంపారు. మత్స్యకారులకు ఐస్‌బాక్స్‌లు, ద్విచక్ర వాహనాలు, ఎదురు గెడలు, అడవి తీగలు, వలలతోపాటు 50 ఏళ్లకే మత్స్యకారులకు పింఛన్లు అందించి ప్రోత్సహించారు.

పాడైపోయిన పక్షుల కూతలు  వచ్చే యంత్రం

వలస పక్షులకు ఇబ్బందులు..

కొల్లేరును పర్యాటకంగా అభివృద్ధి చేస్తాం.. అని సీఎం నుంచి అధికారులు, నాయకుల వరకు ప్రగల్భాలు పలికినా క్షేత్రస్థాయిలో జరిగింది శూన్యం. ఉన్న వసతులు కనుమరుగవుతున్నా పట్టించుకునే నాథులే కరవయ్యారు. ఆటపాక పక్షులకేంద్రం మాదిరిగా మణుగులూరులో మరొక కేంద్రం ఏర్పాటు చేయాలని ఎప్పటి నుంచో ప్రతిపాదన ఉన్నా మంజూరు చేయడం లేదు. విదేశాల నుంచి వచ్చే వలస పక్షులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి.

చింతపల్లి వెంకటనారాయణ, కవి, సామాజిక కార్యకర్త

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని