logo

హామీలపై దగా.. ప్రశ్నించినందుకు పగ!

‘దేవుని దయతో మన ప్రభుత్వం వచ్చిన వారంరోజుల్లోనే సీపీఎస్‌ రద్దు చేస్తా.. ఉపాధ్యాయుల సమస్యలన్నీ పరిష్కరిస్తా’ అంటూ హామీలు గుప్పించి నమ్మించిన జగన్‌మోహన్‌రెడ్డి చివరకు మొండి చేయి చూపారు.

Updated : 29 Apr 2024 04:40 IST

గురువులపై జగన్‌ సర్కారు నిరంకుశత్వం
కేసులు, అరెస్టులతో జులుం
యాప్‌ల పేరుతో నిత్యం వేధింపులు

భీమవరం పట్టణం, ఏలూరు అర్బన్‌, న్యూస్‌టుడే: ‘దేవుని దయతో మన ప్రభుత్వం వచ్చిన వారంరోజుల్లోనే సీపీఎస్‌ రద్దు చేస్తా.. ఉపాధ్యాయుల సమస్యలన్నీ పరిష్కరిస్తా’ అంటూ హామీలు గుప్పించి నమ్మించిన జగన్‌మోహన్‌రెడ్డి చివరకు మొండి చేయి చూపారు. మీరిచ్చిన హామీలు గుర్తున్నాయా..? అని ప్రశ్నిస్తూ ఉద్యమించిన ఉపాధ్యాయులపై కక్షగట్టిన వైకాపా సర్కారు వారిపై ఉక్కుపాదం మోపింది. పలు సందర్భాల్లో గృహనిర్బంధం చేసి పోలీసులను కాపలా ఉంచింది. ఉద్యమాలకు పిలుపునిచ్చిన ప్రతిసారీ గృహనిర్బంధాలు, అరెస్టులతో భయాందోళనలకు గురిచేసింది. గతంలో ఎన్నడూ చూడని స్థాయి నిరంకుశత్వంతో గురువులు విలవిల్లాడారు.

జగన్‌ సర్కారు విద్యకు తొలి ప్రాధాన్యం ఇస్తున్నట్లు పైకి చెబుతూనే తెర వెనుక ఉపాధ్యాయులను ఇరుకున పెట్టే చర్యలకు దిగింది. ఇబ్బడి ముబ్బడిగా బోధనేతర పనులు అప్పగిస్తూ చెలగాటమాడింది. ముఖ ఆధారిత హాజరు, విద్యార్థుల హాజరు, మధ్యాహ్న భోజనం నాణ్యత పరిశీలన, మూల్యాంకనం, అమ్మఒడి, విద్యాదీవెన, విద్యాకానుక, చిక్కీలు.. ఇలా అనేక పేర్లతో యాప్‌లు తీసుకొచ్చారు. అప్‌లోడ్‌ సమయంలో సర్వర్‌ మొరాయించినా ఉపాధ్యాయులే బాధ్యులు. ఇలా 67 మందికి తాఖీదులిచ్చారు.

అన్ని విధాలా ఒత్తిళ్లు

బడుల్లో మరుగుదొడ్లు శుభ్రంగా లేకపోయినా ప్రధానోపాధ్యాయులదే   బాధ్యత అంటూ తాఖీదులు ఇచ్చారు. శుభ్రంగా ఉన్నాయో లేదో  రోజూ ఫొటోలు తీసి నిర్దేశిత యాప్‌లో అప్‌లోడ్‌ చేయాలి. నాడు-నేడు పనుల పర్యవేక్షణ పేరిట ఉపాధ్యాయులకు కంటి మీద కునుకు లేకుండా చేసింది. ఇసుక, కంకర, సిమెంటు ఆయా పాఠశాలలకు అర్ధరాత్రి వచ్చేవి. వాటిని దిగుమతి చేసుకునేందుకు ఉపాధ్యాయులు దగ్గర ఉండాలి. నిర్మాణం అనేది ఇంజినీరింగ్‌ అధికారులపై ఆధారపడి ఉంటుంది. కానీ నాణ్యత లోపిస్తే దానికి కూడా ఉపాధ్యాయులే బాధ్యులన్నారు. ఇలాంటి కారణాలతో 200 మంది ప్రధానోపాధ్యాయులకు షోకాజ్‌ నోటీసులిచ్చారు. ఈ పనుల పర్యవేక్షణ కూడా తల్లిదండ్రుల కమిటీల పేరుతో స్థానిక వైకాపా నాయకులకే పెత్తనం అప్పగించారు. భీమవరం ప్రాంతంలో నిర్మాణ సామగ్రి తప్పించేందుకు యత్నించిన ఓ పాఠశాల కమిటీని ప్రశ్నించినందుకు పంచాయితీ చేసి సంబంధిత ఉపాధ్యాయుడ్ని బదిలీ చేయించారు. మద్యాన్ని దశలవారీగా నిషేధిస్తానన్న జగన్‌ ఆ దుకాణాల వద్ద గురువులను కాపలా ఉంచారు. కరోనా సమయంలో ప్రభుత్వ మద్యం దుకాణాల దగ్గర కాపలాను వ్యతిరేకిస్తూ రాష్ట్రవ్యాప్తంగా ఉపాధ్యాయులు ఆందోళనకు దిగారు.

నిరసన ప్రదర్శనలో ఉపాధ్యాయులు (పాత చిత్రం)

65 మందిపై కేసులు.. వేర్వేరు సందర్భాల్లో 65 మందిపై కేసులు బనాయించారు. 2023 ఏప్రిల్‌లో పాలకోడేరు మండలం మోగల్లు నుంచి ప్రదర్శనగా విజయవాడ బయలుదేరిన ఉపాధ్యాయ సంఘ నాయకులను అరెస్టు చేశారు. వారి కళ్లుగప్పి విజయవాడ చేరుకున్న ఆరుగురిని పోలీసులు అరెస్టు చేశారు.  

అవమానించటం, అగౌరవపరచిన పరిస్థితులను ఇప్పటికీ ఉపాధ్యాయలోకం మరిచిపోలేకపోతోంది. పాఠశాలల్లో కనీస వసతులు ఉండవు. ఉపాధ్యాయ పోస్టులు భర్తీచేయలేదు. బోధన సామగ్రి ఇవ్వరు. పుస్తకాల పంపిణీ సక్రమంగా ఉండదు. అనేక యాప్‌లు తీసుకొచ్చి, బోధన మినహా అన్ని పనులు చేయించారని  ఉపాధ్యాయులు వాపోతున్నారు.

పోలీస్‌ స్టేషన్‌లో పీఆర్‌టీయూ జిల్లా అధ్యక్షుడి నిర్బంధం (పాత చిత్రం)

భారం మోపి.. వేధించి

  • జీవో 117 పేరుతో పాఠశాల విద్యను విభజించి వేలాది ఉపాధ్యాయ కొలువులను రద్దుచేశారు. జిల్లాలో ఇలా 2500 వరకు పోస్టులు రద్దయ్యాయి. జీవో ప్రకారం 3, 4, 5 తరగతులను సమీప ఉన్నతపాఠశాలలో విలీనం చేశారు.   టీచర్లపై రెట్టింపు స్థాయి భారం మోపింది. ఏకోపాధ్యాయ పాఠశాలల్లో పరిస్థితి మరీ దారుణంగా తయారైంది.
  • పిల్లలకు పాఠాలు చెప్పడం కంటే వర్కుబుక్‌ రాయించడానికే సమయం సరిపోయేది. వీటిని సకాలంలో రాయించలేదంటూ యలమంచిలి, పాలకొల్లు మండలాల్లో అయిదుగురు ఉపాధ్యాయులకు ఇంక్రిమెంట్లు రద్దు చేశారు.
  • కరోనా సమయంలో జగనన్న విద్యాకానుక కిట్లు పంపిణీ చేయాలనే ఒత్తిడితో బయటకు వెళ్లిన పాలకోడేరు మండలానికి చెందిన ఇద్దరు ఉపాధ్యాయులు కొవిడ్‌తో మృతి చెందారు. ఇలాంటి కుటుంబాలకు కారుణ్య నియామకాలు చేపట్టలేదు.

ఉమ్మడి జిల్లాలో పాఠశాలలు 3,300
ఉపాధ్యాయుల సంఖ్య 14,000

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని