logo

నెడితే చాలు... పడిపోతాయి ఇళ్లు!

పేదలందరికీ ఇళ్లు కట్టిస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వం గొప్పలు చెబుతూ వస్తోంది. మూడేళ్లుగా సాగుతున్న ఈ ప్రక్రియ ఆచరణలో ఆశించినంత వేగం కనిపించడంలేదు.

Published : 12 Jul 2023 02:17 IST

నాసిరకంగా జగనన్న గృహ నిర్మాణ పనులు
వైకాపా నేతలకు పనుల బాధ్యత అప్పగింత
కట్టడాలు పడగొట్టేసి తిరిగి నిర్మించుకుంటున్న లబ్ధిదారులు
ఈనాడు, కడప, న్యూస్‌టుడే, అట్లూరు

తమ ప్రభుత్వం కొత్తగా ఇళ్లు కాదు ఊళ్లు నిర్మిస్తోంది. ఇంటి నిర్మాణానికి అక్కాచెల్లెళ్లకు మూడు అవకాశాలిస్తున్నాం. ఐచ్ఛికం-1 కింద ప్రభుత్వం చూపిన నమూనా మేరకు అవసరమైన, నాణ్యమైన నిర్మాణ సామగ్రి ప్రభుత్వం సరఫరా చేస్తుంది. లబ్ధిదారుల చేతికే బిల్లులిస్తుంది. వారే దగ్గరుండి ఇల్లు కట్టించుకోవచ్చు. ఐచ్ఛికం-2 కింద లబ్ధిదారులే ఇంటి సామగ్రిని తెచ్చుకుని ఇల్లు కట్టుకోవచ్చు. పనుల పురోగతిని బట్టి దశల వారీగా బిల్లులు విడుదల చేస్తాం. ఐచ్ఛికం-3 ద్వారా ప్రభుత్వమే స్వయంగా నాణ్యమైన సామగ్రితో ఇల్లు కట్టించి తాళాలు అందిస్తుంది.

- రాష్ట్రంలో ఇళ్ల నిర్మాణానికి 2020లో శ్రీకారం చుడుతూ ముఖ్యమంత్రి జగన్‌ అన్న మాటలివి!

పేదలందరికీ ఇళ్లు కట్టిస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వం గొప్పలు చెబుతూ వస్తోంది. మూడేళ్లుగా సాగుతున్న ఈ ప్రక్రియ ఆచరణలో ఆశించినంత వేగం కనిపించడంలేదు. ఐచ్ఛికం-3 ఎంచుకున్న లబ్ధిదారుల పరిస్థితి దయనీయంగా మారింది. ఈ విధానం కింద అట్లూరు మండలంలో స్థానిక వైకాపా నేతకు 206 ఇళ్ల నిర్మాణ బాధ్యతలు అప్పగించారు. గోడల వరకు నిర్మాణాలు చేపట్టగా రూ.లక్ష వరకు బిల్లు చెల్లించారు. ఇంతవరకు సవ్యంగా జరిగినా తదుపరి వ్యవహారంతో నిర్మాణాలు అర్ధంతరంగా నిలిచిపోయాయి. ఐచ్ఛికం-3 విధానాన్ని ఎంచుకున్న లబ్ధిదారుల పరిస్థితి దారుణంగా ఉంది.


అదనపు మొత్తం ఇవ్వలేదని...

మండల కేంద్రం అట్లూరు క్రాస్‌లో పేదలకు 48 ఇళ్ల నిర్మాణ పనులు స్థానిక వైకాపా నేత చేపట్టారు. గుత్తేదారు అవతారమెత్తిన సదరు నేత నెలల కిందట గోడల వరకు నిర్మాణాలు పూర్తి చేశారు. రూ.35 వేల రుణం మొత్తం ఇప్పించాలని గుత్తేదారు కోరుతుండగా లబ్ధిదారులు ససేమిరా అంటున్నారు. జగన్‌ ప్రారంభంలో తామే నిర్మాణం చేపట్టి తాళాలు ఇస్తామన్నారు. ఇప్పుడు అదనపు మొత్తం ఎందుకంటూ నిలదీయడంతో గుత్తేదారు తదుపరి నిర్మాణ పనులను నిలిపేశారు.


నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనం

ఇంటి చెట్టూ ముళ్ల కంపలు, లోపల జిల్లేడు మొక్కలు నిలువెత్తుగా పెరిగాయంటే నెలల తరబడి పనులు నిలిచిపోయాయని స్పష్టమవుతోంది. గుత్తేదారుకు.. లబ్ధిదారుల మధ్య వివాదాలు తలెత్తడంతో పనులు నిలిపేశారు. ప్రస్తుతం మొండి గోడలకు ఇళ్ల నిర్మాణాలు పరిమితమయ్యాయి.


నాసిరకం గోడలు కూల్చేసి...

ట్లూరు మండలంలో నాసిరకం సిమెంటు రాళ్లతో నిర్మాణాలు చేపట్టారు. గోడలు కదిలిస్తే పడిపోయే పరిస్థితిలో ఉన్నాయి. కొందరు లబ్ధిదారులైతే గోడలను కూలదోసి నాణ్యతగా ఉన్న వాటితో నిర్మాణాలు చేపట్టగా, మరికొందరు ఇళ్లే వద్దంటూ చేతులెత్తేశారు. ఐచ్ఛికం-3 కింద బిల్లులు లబ్ధిదారులతో సంబంధం లేకుండా గుత్తేదారుకు ఇచ్చే విధానం ఉండగా, నరేగా కింద ఇచ్చే రూ.30 వేలు మాత్రం లబ్ధిదారు ఖాతాకు చెల్లింపులు జరుగుతున్నాయి. నాసిరకం పనులను ప్రశ్నిస్తూ నగదు మొత్తాన్ని ఇవ్వకుండా నిలిపేస్తున్నారు.


స్తంభాలు తొలగించి...

కొందరు లబ్ధిదారులైతే గుత్తేదారు వేసిన పునాదులను సైతం తొలగించి రెండోసారి మరింత పటిష్టంగా వేసుకున్నారు. ఈ మేరకు ఆధారాలు తొలగించిన పునాదుల స్తంభాలు పక్కనే దర్శన మిస్తున్నాయి.


పట్టుకుంటే పగిలిపోతూ...

గోడలకు వాడుతున్న సిమెంటు ఇటుకలు నాసిరకం కావడంతో పట్టుకుంటేనే పగిలిపోతున్నాయి. కొందరు లబ్ధిదారులు నాసిరకం పనులపై  ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సిమెంటు రాళ్లు పగులకొట్టి చూపిస్తున్నారు.


ముఖ్యమంత్రి ఇలాకాలో...

ముఖ్యమంత్రి జగన్‌ ఇలాకా పులివెందులలోనూ పేదల ఇళ్ల నిర్మాణ పనులు స్తంభించిపోయాయి. ఏడాదిన్నరగా పనులు మందకొడిగా సాగుతున్నాయి. 2021, డిసెంబరు 24న సీఎం లబ్ధిదారులకు పట్టాల పంపిణీతో పాటు 7,309 ఇళ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం నిర్మాణ బాధ్యతలు రాప్తాడు వైకాపా ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి కుటుంబానికి చెందిన గుత్తేదారు సంస్థ రాక్రీట్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్‌ అండ్‌ లాజిస్టిక్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌కు ఐచ్ఛికం-3 కింద అప్పగించింది. పనుల నాణ్యత అంతంతమాత్రంగానే ఉండగా , చివరకు ఆ సంస్థ చేతులెత్తేసి వెళ్లిపోయింది. ఇక్కడా ఇళ్ల నిర్మాణం పునాదులు, మొండి గోడలకే పరిమితమైంది.


సొంతంగా నిర్మించుకుంటున్నాం

 - వెంకటయ్య, కమలకూరు

సొంతంగా నిర్మించుకునే స్థోమత లేక గుత్తేదారులతో ఇల్లు నిర్మించేందుకు ఒప్పుకొన్నాను. ఇంటి గోడలు నెడితే పడిపోయేలా ఉన్నాయి. పునాదులు, గోడలు తొలగించి తిరిగి కట్టుకుంటున్నాం. మా ఇంటికి రూ.80 వేల వరకు గుత్తేదారు బిల్లులు తీసుకున్నారు. ఐచ్ఛికం-3 నిర్మాణాలపై నమ్మకం లేక సొంతంగా అప్పు చేసి నిర్మించుకుంటున్నాం. 


మేమే కొత్తగా కట్టుకుంటున్నాం

  - చిన్న గుర్రమ్మ, కమలకూరు

నాకు ముగ్గురు పిల్లలు. గోడల పగుళ్లు చూస్తే భయంగా ఉంది. గుత్తేదారు చేపట్టిన నిర్మాణాలు తొలగించి కొత్తగా చేపట్టాం. గుత్తేదారు పునాదులకే రూ.75 వేలు బిల్లు తీసుకున్నారు. ఈ డబ్బులు పోయినా పర్వాలేదు. పిల్లలకు. మాకు ప్రాణభయం ఉండదని నిర్ణయం తీసుకున్నాం.


లబ్ధిదారులదే బాధ్యత

- సత్యబాబు, ఏఈ, గృహనిర్మాణశాఖ, అట్లూరు

ఇంటిని దగ్గరుండి నాణ్యతగా నిర్మించుకోవాల్సిన బాధ్యత లబ్ధిదారులదే. ఎక్కడైనా తేడాలుంటే మా దృష్టికి తీసుకొస్తే చర్యలు తీసుకుంటాం. లబ్ధిదారులు అప్పుగా తీసుకుని రూ.35 వేలు ఇవ్వాలనే జీవో వచ్చింది. ఈ మొత్తం ఇవ్వడానికి ఎవరూ ముందుకు రావడంలేదు. దీంతో సమస్య జఠిలమైంది.      

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని