logo

సీఎం ఇలాకా.. ఇసుక మిగలదిక!

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సొంత ఇలాకా ఉమ్మడి కడప జిల్లాలో గత నాలుగేళ్లుగా ఇసుక అక్రమ తవ్వకాలు ఇష్టారాజ్యంగా జరుగుతున్నాయి.

Published : 21 Jul 2023 04:47 IST

ఉమ్మడి  కడప జిల్లాలో  భారీగా అక్రమ తవ్వకాలు, రవాణా
పెన్నా, పాపఘ్ని, చిత్రావతి నదుల్లో  అక్రమార్కుల  విధ్వంసం

కొండాపురం మండలం ఏటూరు ఇసుక రేవులోకి నిర్మించిన రహదారిది.  రేవుకు  ఇచ్చిన అనుమతి  
గడువు ముగిసిపోయినా తవ్వకాలు కొనసాగుతూనే ఉన్నాయి. నిత్యం 200కుపైగా టిప్పర్లతో బెంగళూరు నగరంతో పాటు అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాలకు ఇసుక అక్రమంగా తరలిపోతోంది.

ఈనాడు, కడప, న్యూస్‌టుడే, జమ్మలమడుగు, సిద్దవటం, కొండాపురం, రాజంపేట గ్రామీణ, కమలాపురం: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సొంత ఇలాకా ఉమ్మడి కడప జిల్లాలో గత నాలుగేళ్లుగా ఇసుక అక్రమ తవ్వకాలు ఇష్టారాజ్యంగా జరుగుతున్నాయి. పెన్నానదిలో వల్లూరు మండలం చెరువుకిందపల్లె, ఖాజీపేట మండలం కొమ్మలూరు, చెన్నముక్కపల్లె, జమ్మలమడుగుతోపాటు పాపఘ్ని నదిలో పెండ్లిమర్రి మండలం కొత్తగంగిరెడ్డిపల్లె ఇసుక రేవులకు మాత్రమే అనుమతులున్నాయి. సిద్దవటం, ఒంటిమిట్ట, పెండ్లిమర్రి, చెన్నూరు, ఖాజీపేట, వల్లూరు, చక్రాయపేట, కొండాపురం, జమ్మలమడుగు తదితర మండలాల్లో 15 చోట్ల భారీ ఎత్తున ఇసుక తవ్వకాలు అనధికారికంగా జరుగుతున్నాయి. అనుమతులున్న చోట మీటరు లోతు వరకు తవ్వుకోవాలని గనులశాఖ నిబంధనల్లో పేర్కొండగా, అనుమతులే లేకపోగా 5 నుంచి 10 మీటర్ల లోతున తవ్వకాలు జరుగుతున్నాయి. జిల్లాలో జేపీ సంస్థ ప్రమేయం లేనప్పటికీ వైకాపా కీలక నేతల కనుసన్నల్లోనే ఇసుక తవ్వకాలు, రవాణా సాగుతోంది. పెన్నా, పాపఘ్ని, చిత్రావతి నదులతోపాటు వాగులు, వంకలను వదలకుండా అక్రమార్కులు ఇసుక దందా సాగిస్తున్నారు. జిల్లావ్యాప్తంగా వందలాది గ్రామాలకు తాగునీరందించే పెన్నానది గర్భాన్ని సైతం పెకలించి ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారు. గ్రామాలతోపాటు పంట పొలాలకు ముప్పు వాటిల్లేవిధంగా జరుగుతున్న ఇసుక తవ్వకాలపై ప్రశ్నించిన ప్రజలను లారీలతో తొక్కించుకుంటూ వెళతామని నాయకులు బెదిరించిన ఘటనలు లేకపోలేదు. చెన్నూరు సమీపంలోని పెన్నానదిలో ఏడాదిగా తవ్వకాలు జరుగుతున్నాయి. ఇక్కడ 4 హెక్టార్లలో ఏడాదికి 45 వేల క్యూబిక్‌ మీటర్ల ఇసుక తవ్వకాలకు మాత్రమే గనులశాఖ అనుమతించగా, ఆరు నెలల్లోనే 3 లక్షల నుంచి 4 లక్షల క్యూబిక్‌ మీటర్ల ఇసుక తవ్వేసినట్లు అంచనా. అది కూడా మీటరు లోతు మాత్రమే తవ్వాలనే నిబంధన విధించినా నాయకులు గుత్తేదారుల అవతారమెత్తి రేయింబవళ్లు తవ్వకాలు సాగిస్తున్నారు. నది మధ్యలో 5 మీటర్ల లోతున తవ్వేసిన దాఖలాలు కనిపిస్తున్నాయి. పెన్నా నదిలో సిద్దవటం మండలం ఎస్‌.రాజంపేట, జంగాలపల్లె ఇసుక రేవులకు ఎలాంటి అనుమతులు లేకున్నా గత కొన్ని నెలలుగా నిత్యం వందలాది టిప్పర్లతో ఇసుక తరలించుకుపోతున్నారు. సిద్దవటం మండలం మూలపల్లె, వంతాటిపల్లె, ఒంటిమిట్ట మండలం దర్జిపల్లె, గొల్లపల్లె సమీపంలో పెన్నానదిలో యథేచ్ఛగా తవ్వకాలు జరుగుతున్నాయి. ఇసుకను బద్వేలు- కడప ప్రధాన రహదారి పక్కనున్న కమ్మపాళ్యం స్టాక్‌ పాయింట్‌కు తరలించి అక్కడ బద్వేలు, కడప, రాజంపేట ప్రాంతాలకు విక్రయాలు సాగిస్తున్నారు. టిప్పరు ఇసుకకు రూ.10 వేలు వంతున వసూలు చేస్తూ నిత్యం 250 నుంచి 300 టిప్పర్ల వరకు తరలిపోతోంది. ఇసుక తవ్వకాలపై ‘ఈనాడు’ ప్రధాన సంచికలో వరుస కథనాలు ప్రచురితం కావడంతో జిల్లాలోని రేవుల్లో గురువారం పెద్దగా సందడి కనిపించలేదు.


అడ్డుకున్న వైకాపా నేతలు

ఇసుక అక్రమ రవాణాను వైకాపా నేతలే సహించలేకపోతున్నారు. కమలాపురం మండలం పొడదుర్తి వద్ద అక్రమంగా పాపఘ్ని నది నుంచి గురువారం ఇసుక తరలిస్తుండగా వైకాపా నేత రమణ ఆధ్వర్యంలో అడ్డుకున్నారు. ‘నదిలో ఇసుక తవ్వకాలకు ఎలాంటి అనుమతుల్లేవు. భారీ యంత్రాలతో తవ్వకాలు చేపట్టి టిప్పర్లతో తరలిస్తున్నారు. వైకాపా కీలక నేతల ప్రమేయంతో ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయి. అక్రమంగా తవ్వకాలు, రవాణాను సహించలేకపోతున్నాం’ అని ఇసుక టిప్పర్లను అడ్డుకున్నారు. దీంతో పోలీసులు జోక్యం చేసుకుని అడ్డుకున్న నాయకులపై ఒత్తిడి తీసుకొచ్చారు. వాహనాలను అడ్డుకోవద్దంటూ గట్టిగా హెచ్చరించే ప్రయత్నం చేశారు. రాత్రి పదింటి వరకు కూడా వివాదం నడుస్తోంది.

కొండాపురం మండలం పొట్టిపాడు సమీపంలోని చిత్రావతి నదిలో ఇసుక అక్రమ తవ్వకాలు జోరుగా సాగుతున్నాయి. ఇక్కడ గనులశాఖ నుంచి ఎలాంటి అనుమతులు లేకున్నా నిత్యం భారీ యంత్రాలతో తవ్వకాలు చేపడుతూ ఇతర ప్రాంతాలకు తరలించుకునిపోతున్నారు.


సిద్దవటం మండలంలోని పెన్నా నదిలో ఎస్‌.రాజంపేట ఇసుక రేవుకు ఎలాంటి అనుమతులు లేవు. గత కొన్ని నెలలుగా నిత్యం భారీ యంత్రాలతో తవ్వకాలు సాగిస్తూ వందలాది టిప్పర్లతో తరలిస్తున్నారు.


అన్నమయ్య జిల్లా నందలూరు మండలం ఆడపూరు వద్ద భారీ యంత్రాలతో అనధికారికంగా తవ్వకాలు జరుపుతున్నారు.  ఇదే మండలం మందడం వద్ద ఇసుక రేవుకు అనుమతి గడువు  ముగిసిపోయినప్పటికీ యథేచ్ఛగా  తవ్వేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని