logo

జగన్‌ పాలన ఫలితమిది!

పదోతరగతి ఫలితాల్లో 86.67 ఉత్తీర్ణత శాతంతో జిల్లా రాష్ట్రంలో 17వ స్థానంలో నిలిచింది. బాలురు 83.65, బాలికలు 89.71 ఉత్తీర్ణత శాతం నమోదుతో బాలికలు పైచేయి సాధించారు.

Updated : 23 Apr 2024 06:23 IST

పదోతరగతి ఉత్తీర్ణతలో జిల్లాది 17వ స్థానం

పదోతరగతి ఫలితాల్లో 86.67 ఉత్తీర్ణత శాతంతో జిల్లా రాష్ట్రంలో 17వ స్థానంలో నిలిచింది. బాలురు 83.65, బాలికలు 89.71 ఉత్తీర్ణత శాతం నమోదుతో బాలికలు పైచేయి సాధించారు. ప్రైవేటు పాఠశాలల విద్యార్థుల ఫలితాల నమోదులో స్వల్ప హెచ్చుతగ్గులు మాత్రమే ఉండగా, ప్రభుత్వ యాజమాన్య పాఠశాలల్లో ఉత్తీర్ణత శాతం గణనీయంగా తగ్గుతూ వస్తోంది. బోధనేతర కార్యక్రమాల అమలులో ఉపాధ్యాయవర్గం మునిగిపోతుండడం, మానసిక ఒత్తిడికి గురవుతుండడం, పాఠశాలల నిర్వహణ లోపాలు, అశాస్త్రీయమైన ప్రభుత్వ విధానాల అమలుతోనే ఈ పరిస్థితి నెలకొందని విద్యావేత్తలు చెబుతున్నారు.

న్యూస్‌టుడే, కడప విద్య, రాయచోటి, మదనపల్లె విద్య 

విద్యారంగంలో రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలుపుతున్నామని వైకాపా ప్రభుత్వం గొప్పలు చెబుతుండగా, జిల్లాలోని పాఠశాలల నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. పాఠాలు బోధించాల్సిన ఉపాధ్యాయులపై పని భారం పెరగడమే కాకుండా పూర్తిస్థాయిలో మౌలిక వసతులు కల్పించలేదు. మనబడి...నాడు-నేడు కింద రూ.కోట్లు వెచ్చించినా అనుకున్న స్థాయిలో ఫలితాలు రాలేదు. జిల్లాలోని ఉన్నత పాఠశాలల్లో పదో తరగతి అభ్యసించిన విద్యార్థులను ప్రత్యేక తరగతులు నిర్వహించి వారికి అవసరమైన స్టడీమెటీరియల్స్‌ సకాలంలో అందించకపోవడం ఫలితాలపై ప్రభావం చూపింది. పదోతరగతి ఫలితాల్లో రాష్ట్రంలో జిల్లా 17వ స్థానానికి పడిపోవడంపై విద్యావేత్తలు పెదవివిరుస్తున్నారు.

  • ఉమ్మడి కడప జిల్లా సమయంలో ఫలితాలు కాస్త మెరుగ్గా ఉన్నా కొత్త జిల్లాలు ఏర్పాటై రెండేళ్లు గడిచినా డీఈవో పోస్టు ఇన్‌ఛార్జితోనే కొనసాగుతోంది. ఉపాధ్యాయులు, ఎంఈవోలు, డీడీఈవోల కొరత నెలకొంది. కె.వి.పల్లి, పీలేరు మండలాలకు ఇన్‌ఛార్జులే ఉన్నారు. ఫలితంగా పర్యవేక్షణలో వారి పాత్ర సంస్థాగతంగానే నామమాత్రంగా ఉందన్న విమర్శలున్నాయి. జిల్లాలో ఎక్కువ ఖాళీ పోస్టులు కాన రాకుండా జీవో 117తో, సాంకేతికంగా పోస్టుల రద్దుతో ముందుకెళ్లిన ప్రభుత్వం మరోవైపు ఉద్యోగోన్నతులు, బదిలీలు, ప్రభుత్వ ఉత్తర్వు బదిలీల పేరుతో జాప్యాన్ని కొనసాగించింది. విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా ఇలాంటి ప్రక్రియలన్నీ వేసవి సెలవుల్లోనే చేపడతామని ఊదరగొట్టిన పాలకులు తరగతుల నిర్వహణ జరుగుతుండగా నెలల తరబడి  ప్రక్రియను పూర్తి చేయలేకపోవడం విద్యార్థుల చదువులపై ప్రభావం చూపింది.
  • పాఠశాలల విలీన ప్రక్రియ ఫలితాలపై తీవ్ర ప్రభావం చూపిందని ఉపాధ్యాయ సంఘాలు ఆరోపిస్తున్నాయి. పాఠశాలల విలీనంతో ఉన్నత పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరగడం, అందుకనుగుణంగా వసతులు లేక పోవడంతో పదోతరగతి విద్యార్థులకు అదనపు తరగతులు నిర్వహించలేని పరిస్థితి నెలకొంది. మొత్తం 193 మంది ప్రధానోపాధ్యాయులు ఉన్నత పాఠశాలలకు బాధ్యులుగా ఉండగా, రెగ్యులర్‌ ప్రధానోపాధ్యాయులుంటే పాఠశాలల నిర్వహణపై స్వీయ పర్యవేక్షణ ఉంటుంది. వీరికి నాడు-నేడు పనుల బాధ్యతలు అప్పగించడంతో పర్యవేక్షణపై దృష్టి సారించలేకపోయారు. పాఠశాల కంటే బ్యాంకులు, ఇంజినీరింగ్‌ కార్యాలయాల చుట్టూ తిరగడానికే వీరు అధిక సమయం వెచ్చించాల్సి వచ్చింది. బోధనేతర పనుల్లో  ఉపాధ్యాయులు మునిగిపోవడం, మానసిక ఒత్తిడికి గురవుతుండటం, పాఠశాలల నిర్వహణలో లోపాలు, అశాస్త్రీయమైన ప్రభుత్వ విధానాల అమలుతోనే ఈ పరిస్థితి నెలకొందని విద్యావేత్తలు చెబుతున్నారు. ప్రభుత్వ యాజమాన్య పాఠశాలల్లో ఫలితాల శాతం తగ్గిపోవడంపై అధికార యంత్రాంగం అంతర్మధనంలో పడింది.

దుఃఖాన్ని అధిగమించి... ఉత్తీర్ణత సాధించి

దోతరగతి చివరి పరీక్ష రోజే ఆమె తండ్రి మృతి చెందారు. పుట్టెడు దుఃఖంలోనూ పరీక్ష రాసి ఉత్తీర్ణత సాధించింది. మదనపల్లె పట్టణంలోని కనకదాసనగర్‌కు చెందిన గణపతి (43) చేనేత కార్మికుడికి భార్య శివమ్మ, కుమారుడు తేజు, కుమార్తె రమ్య ఉన్నారు. రమ్య పదోతరగతి చదువుతోంది. గణపతి మార్చి 26వ తేదీ రాత్రి గుండెపోటుతో మృతిచెందారు. మరుసటి రోజు సాంఘిక శాస్త్రం పరీక్ష కాగా, తండ్రి మరణంతో రమ్య కుంగిపోయింది. దుఃఖాన్ని దిగమింగుకుని పరీక్షకు హాజరైంది. సోమవారం విడుదలైన పదోతరగతి పరీక్షల్లో 422 మార్కులతో ఉత్తీర్ణత సాధించింది. తండ్రి మృతిచెందినా ఆత్మ స్థ్యైర్యంతో పరీక్ష రాసి ఉత్తీర్ణత సాధించడంపై పలువురు అభినందిస్తున్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని