logo

జగన్‌ను నమ్మినందుకు నట్టేట ముంచారు!

సీఎం జగన్‌ సొంత జిల్లాలో వైకాపా నుంచి పలువురు కీలక నేతలు వరుసగా జారుకుంటున్నారు. ఏళ్ల తరబడి పార్టీలో సేవలందించి.. సొంత ఆస్తుల్ని అమ్ముకున్న వారు... ఇప్పుడు ఆ పార్టీపై, అగ్రనేతలపై విశ్వాసం కోల్పోయి బయటకొచ్చేస్తున్నారు.

Published : 23 Apr 2024 05:38 IST

రెండో స్థానం హోదా కల్పిస్తానని హామీ
రూ.50 కోట్ల విలువైన ఆస్తులమ్ముకున్నాను
ఆవేదనతో రాజీనామా చేసిన అంబటి కృష్ణారెడ్డి
వరుసగా వైకాపాను వీడుతున్న కీలక నాయకులు
ఈనాడు, కడప

వైకాపా జిల్లా అధ్యక్షుడు సురేష్‌బాబుకు రాజీనామా పత్రం అందజేస్తున్న అంబటి కృష్ణారెడ్డి

సీఎం జగన్‌ సొంత జిల్లాలో వైకాపా నుంచి పలువురు కీలక నేతలు వరుసగా జారుకుంటున్నారు. ఏళ్ల తరబడి పార్టీలో సేవలందించి.. సొంత ఆస్తుల్ని అమ్ముకున్న వారు... ఇప్పుడు ఆ పార్టీపై, అగ్రనేతలపై విశ్వాసం కోల్పోయి బయటకొచ్చేస్తున్నారు. ఈ జాబితాలో తాజాగా రాష్ట్ర వ్యవసాయశాఖ మాజీ సలహాదారు అంబటి కృష్ణారెడ్డి దంపతులు చేరారు. జమ్మలమడుగు నియోజకవర్గం ఎర్రగుంట్లకు చెందిన అంబటి కృష్ణారెడ్డి.. 1980 నుంచి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి కుటుంబం వెంట ఉంటూ ప్రతి ఎన్నికల్లో విశేష కృషి చేస్తున్నారు. 2014లో జడ్పీ ఛైర్మన్‌ పార్టీ మారే పరిస్థితి ఉండగా, వైకాపా అధినేత జగన్‌ నన్ను హైదరాబాద్‌కు పిలిపించారని రాజీనామా పత్రంలో పేర్కొన్నారు. ‘నిన్ను నా తర్వాత రెండో స్థానంలో నిలబెడతాను. ఎట్టి పరిస్థితిలోనూ జడ్పీ ఛైర్మన్‌ పార్టీ మారకుండా చూడాలి’ అని జగన్‌ కోరారని తెలిపారు. ‘వైకాపా అధికారంలోకి వచ్చిన అనంతరం 2019, ఏప్రిల్‌ 16న ముఖ్యమంత్రి హోదాలో ఉన్న జగన్‌ను కలిశా. నా పరిస్థితి ఏమిటని అడిగా. ఆ రోజు నా చేతిలో చేయి వేసి నిన్ను జిల్లా పరిషత్తు ఛైర్మన్‌ చేస్తాను’ అని ప్రమాణం చేశారన్నారు. ‘ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి మద్దతు లేదని జడ్పీ ఛైర్మన్‌ పదవి ఇవ్వలేదు. చివరకు వ్యవసాయశాఖ సలహాదారు పదవి కట్టబెట్టారు. అది కూడా రెండేళ్ల కాల పరిమితితో జీవో ఇచ్చారు. జడ్పీ ఛైర్మన్‌ పదవి అయిదేళ్లుంటుంది. సలహాదారు పదవి రెండేళ్లకే పరిమితం చేశారని జగన్‌ను అడగ్గా.. నేను ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం నువ్వు పదవిలో ఉంటావని చెప్పడంతోనే జీవో ఇచ్చిన నెల రోజుల తర్వాత బాధ్యతలు స్వీకరించాను’ అని రాజీనామా పత్రంలో వివరించారు. రెండేళ్ల తర్వాత నాకు పదవీకాలం పొడిగించకుండా ఇతర సలహాదారులందరికీ పెంచారని వాపోయారు. జరిగిన అన్యాయంపై సీఎం, ఎంపీ అవినాష్‌రెడ్డికి వివరించినప్పటికీ పట్టించుకోలేదని, వైకాపాను నమ్ముకున్నందుకు రూ.50 కోట్ల అస్తులు అమ్ముకున్నానని అంబటి ఆవేదన వ్యక్తం చేశారు. జమ్మలమడుగు ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి తీరు నచ్చక వైకాపాను వీడుతున్నట్లు పేర్కొన్నారు. అంబటి కృష్ణారెడ్డితో పాటు ఆయన సతీమణి, తిప్పలూరు సర్పంచి పార్వతమ్మ కూడా వైకాపాకు రాజీనామా చేశారు. ఇది వరకే ఎర్రగుంట్ల శేఖర్‌రెడ్డి పార్టీని వీడారు. జమ్మలమడుగులో ఇప్పటికే చాలా మంది వైకాపాను వీడగా.. ఇంకా పలువురు వరుస కట్టారు.

మైదుకూరులోనూ వైకాపాకు షాక్‌

ఖాజీపేట మండలం దుంపలగట్టులో పుట్టా సుధాకర్‌ యాదవ్‌ సమక్షంలో తెదేపాలో చేరిన వైకాపా నాయకులు, కార్యకర్తలు

మైదుకూరు నియోజకవర్గంలో వైకాపాకు వరుస షాక్‌లు తగులుతున్నాయి. ఖాజీపేట మండలం దుంపలగట్టు గ్రామానికి చెందిన కీలక నేతులు రెడ్యం రవీంద్రారెడ్డి, ఇండ్ల సుబ్బారెడ్డి, చిన్న సుబ్బారెడ్డి, తవ్వా ఓబుల్‌రెడ్డి, రవీంద్రారెడ్డి, రెడ్యం ఈశ్వర్‌రెడ్డి, తెదేపా అభ్యర్థి పుట్టా సుధాకర్‌యాదవ్‌ సమక్షంలో సోమవారం తెదేపాలో చేరారు. ఇటీవల తెదేపాను వీడి వైకాపాలో చేరిన రెడ్యం వెంకటసుబ్బారెడ్డి స్వగ్రామంలో వైకాపాకు షాక్‌ తగలడం విశేషం. సీఎం జగన్‌ సొంత నియోజకవర్గం పులివెందులలోని లింగాల, తొండూరులో పలువురు కీలక నేతలు సోమవారం తెదేపాలో చేరారు. వేంపల్లెలో మంగళవారం పెద్ద ఎత్తున వైకాపా నుంచి తెదేపాలో చేరడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని