logo

క్రీడా మైదానం...రాచమల్లుకు ఆదాయం

ఆహ్లాదాన్ని, ఆరోగ్యాన్ని పంచుతూ, క్రీడాభివృద్ధికి ఎంతో దోహదపడే ప్రొద్దుటూరు అనిబిసెంటు పురపాలక బాలుర ఉన్నత పాఠశాల క్రీడా మైదానం అధ్వానంగా మారింది.

Published : 28 Apr 2024 05:29 IST

అయిదేళ్లయినా ఊసే లేని క్రీడా హబ్‌ హమీ
ఆవేదనలో యువకులు, సందర్శకులు, విద్యార్థులు

అనిబిసెంట్‌ ఉన్నత పాఠశాల మైదానంలో నిర్మించిన తాత్కాలిక మార్కెట్‌

న్యూస్‌టుడే, ప్రొద్దుటూరు: ఆహ్లాదాన్ని, ఆరోగ్యాన్ని పంచుతూ, క్రీడాభివృద్ధికి ఎంతో దోహదపడే ప్రొద్దుటూరు అనిబిసెంటు పురపాలక బాలుర ఉన్నత పాఠశాల క్రీడా మైదానం అధ్వానంగా మారింది. దీనికంతంటికీ వైకాపా ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదురెడ్డినే ప్రధాన కారణమని రోజు గ్రౌండ్‌కొచ్చే వేయి మంది క్రీడాకారులు, విద్యార్థులు, వాకర్సు, సందర్శకులు అంటున్నారు.  తమ పార్టీ అధికారంలోకి వస్తే క్రీడా మైదానాన్ని క్రీడా హబ్‌గా మారుస్తానని ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు హామీ ఇచ్చారు. అధికారంలోకి రాగానే విస్మరించడమే కాకుండా ఉన్న బడిని గ్రౌండ్‌ను తనకు ఆదాయం సమకూరేలా తాత్కాలిక కూరగాయల మార్కెట్‌ను ఎమ్మెల్యే ఏర్పాటు చేయించారు. శివాలయం కూడలి వద్ద ఉన మార్కెట్‌ శిథిలావస్థకు చేరగా, దౌర్జన్యంగా కూల్చివేయించారు. వ్యాపారులకు ప్రత్యామ్నాయ కూరగాయల మార్కెట్‌ నిర్మాణానికి సర్వేనెంబర్‌ 361లో 4.40 ఎకరాల్లో ఉన్న క్రీడా మైదానాన్ని ఎంపిక చేసుకున్నారు. దీనిపై ప్రజల నుంచి పెద్ద ఎత్తున అభ్యంతరాలు రావడంతో, కూల్చేసిన మార్కెట్‌ స్థలంలో ఏడాదిలోపు కొత్తగా నిర్మిస్తామన్నారు. ఆపై క్రీడా మైదానం యథావిధిగా పాఠశాలకు అప్పగిస్తామని హామీ ఇచ్చారు. మూడేళ్లవుతున్నా గ్రౌండ్‌లో క్రీడాభివృద్ధి కోసం ఒక్క  ఫైసా అభివృద్ధి పనులు చేపట్టకపోగా ఏడాది లోపల తాత్కాలిక మార్కెట్‌ను తొలగిస్తామన్నా హామీ నెరవేరలేదు. క్రీడల్లో నైపుణ్యత పొందేందుకు సాధన చేసుకోవడానికి ఉన్న గ్రౌండ్‌ ఏ మాత్రం సరిపోలేదని, తొందరగా కూరగాయల మార్కెట్‌ను తొలగించి యథావిధిగా గ్రౌండ్‌ను అప్పగించి, అభివృద్ధి చేయాలని పుర ప్రజలు కోరుతున్నారు.


క్రికెట్‌ పిచ్‌ చెదిరిపోయింది
-శివ రాయల్‌, అండర్‌-19 క్రికెటర్‌, ప్రొద్దుటూరు.

తాత్కాలిక కూరగాయల మార్కెట్‌ ఏర్పాటుతో క్రికెట్‌ పిచ్‌ పాడైంది. ఆ పిచ్‌పై ప్రతి ఆదివారం ప్రాక్టీస్‌ మ్యాచ్‌లు ఆడి, ఆటను మెరుగుపరచుకునేవాడిని. గత మూడేళ్లుగా క్రిక్‌ట్‌ సాధన చేసేందుకు గ్రౌండ్‌ అనుకూలంగా లేదు. దాంతో రాష్ట్ర అండర్‌-19 క్రికెట్‌ పోటీలకు ఎంపికకాలేకపోయాను.


ఫుట్‌బాల్‌ శిక్షణ ఆపేశాం
-హఫీజ్‌, ఫుట్‌బాల్‌ క్రీడా కోచ్‌, ప్రొద్దుటూరు

ప్రతి ఏటా ఫుట్‌బాల్‌ క్రీడా శిక్షణ శిబిరం నిర్వహించి, ఎంతో మంది పిల్లలు క్రీడాకారులుగా తయారయ్యేవారు. జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయి ఎస్‌జీఎఫ్‌ఐ పోటీలకెళ్లేవారు. మార్కెట్‌ నిర్మించడంతో గ్రౌండ్‌ కాస్త చిన్నదైంది. దాంతో సాధన చేయించలేకపోతున్నాం.


రన్నింగ్‌ ట్రాక్‌ పాడైంది
-హేమశ్రీ తైక్వాండో రాష్ట్ర క్రీడాకారిణి, ప్రొద్దుటూరు

అనిబిసెంట్‌ క్రీడా మైదానం చాలా విశాలంగా ఉండేది. రన్నింగ్‌ ట్రాక్‌ లైన్‌ ఉండేది. మార్కెట్‌ నిర్మాణం కారణంగా ట్రాక్‌ లైన్‌ పోయింది. దాంతో పరుగు సాధన చేయాలంటే చాలా ఇబ్బందిగా ఉంది.


ఆహ్లాదాన్ని పంచేది
-చెన్నయ్య, క్రీడాకారుడు, దేవగుడి

పరుగు, హైజంపు, లాంగ్‌జంపు, వాలీబాల్‌, సాఫ్ట్‌బాల్‌ క్రీడల సాధన కోసం దేవగుడి నుంచి  ప్రొద్దుటూరు అనిబిసెంటు గ్రౌండ్‌కు వచ్చేవాడిని. ఇక్కడ ప్రాక్టీస్‌ చేయడంతో అండర్‌-14, 17, 19 ఎస్‌జీఎఫ్‌ఐ అథ్లెటిక్స్‌ పోటీల్లో నెగ్గేవాడిని. మార్కెట్‌ నిర్మించడంతో క్రీడా మైదానం చిన్నదైపోయింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని