logo

ఒట్టేసి ఒక మాట... ఓటేశాక ఒక మాట..!

‘2019 ఎన్నికల ముందు పాదయాత్ర చేసిన అప్పటి ప్రతిపక్ష నేత, ప్రస్తుత సీఎం జగన్‌...నేను ఉన్నా.. నేను విన్నా.. అని చెప్పి ఓట్లు అడిగి ఇచ్చిన హామీలను తుంగలో తొక్కారు.

Published : 28 Apr 2024 05:39 IST

మాయమాటలతో సీఎం జగన్‌ మోసం
వాల్మీకులకు వైకాపాప్రభుత్వం ద్రోహం

మదనపల్లె డివిజన్‌లో ఇటీవల జరిగిన సమావేశానికి హాజరైన వాల్మీకి సోదరులు

న్యూస్‌టుడే, మదనపల్లె విద్య: ‘2019 ఎన్నికల ముందు పాదయాత్ర చేసిన అప్పటి ప్రతిపక్ష నేత, ప్రస్తుత సీఎం జగన్‌...నేను ఉన్నా.. నేను విన్నా.. అని చెప్పి ఓట్లు అడిగి ఇచ్చిన హామీలను తుంగలో తొక్కారు. రాష్ట్రవ్యాప్తంగా 50 లక్షలకు పైగా ఉన్న వాల్మీకుల చిరకాల కల నెరవేర్చడంలో ఆయన పూర్తిగా విఫలమయ్యారు. అధికారంలోకి వచ్చిన వెంటనే వాల్మీకి రిజర్వేషన్‌ బిల్లు పెట్టి కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి బిల్లు పాస్‌ చేయిస్తానని చెప్పి బాసలు చేశారు. ఒట్టేసి చెప్పిన ఆయన ఓట్లేసి గెలిపించిన తర్వాత ఇచ్చిన మాట తప్పారు. తూతూ మంత్రంగా బిల్లు పెట్టి మమ అని పించారు’ అని వాల్మీకి/బోయ సంఘాల నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 2019 నుంచి పాలన కొనసాగిస్తున్న ఆయన అసెంబ్లీ సమావేశాల్లో వాల్మీకి రిజర్వేషన్‌ బిల్లు పెట్టకుండా దాటవేస్తూ వస్తుండటంతో రాష్ట్రవ్యాప్తంగా నాయకులు ఆందోళనకు దిగారు. దీంతో కంటి తుడుపు చర్యగా 2023లో ఏకసభ్య కమిషన్‌ను ఏర్పాటు చేసి శామ్యూల్‌ ఆనంద్‌కుమార్‌ను నియమించగా ఆయన నివేదిక ప్రభుత్వానికి సమర్పించారు. రాష్ట్రంలో శ్రీకాకుళం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో వాల్మీకులు ఎస్టీలుగా కొనసాగుతుండగా, మిగిలిన జిల్లాల్లోని వాల్మీకులు బీసీలుగా కొనసాగుతున్నారు. ఒకే రాష్ట్రంలో ఒకే కులానికి చెందిన వ్యక్తులు రెండు వర్గాలుగా ఉన్న సంఘటన దేశంలో ఎక్కడా లేదని వాల్మీకి సంఘాలు మండిపడుతున్నాయి. శామ్యూల్‌ ఆనంద్‌కుమార్‌ ఇచ్చిన నివేదికలో చిత్తూరు, అనంతపురం, కడప, కర్నూలు జిల్లాల్లో ఉన్నవారిని ఎస్టీల్లో చేర్చవచ్చునని నివేదిక పార్ట్‌-1 సమర్పించగా వాల్మీకి సంఘాలు దాన్ని నిరసించాయి. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వాల్మీకులను ఎస్టీల్లో చేర్చాలని రోడ్లపైకి రావడంతో దాన్ని సాగదీస్తూ వచ్చి ఎన్నికల నోటిఫికేషన్‌ రావడంతో దాని ఊసే మరచిపోయిన రాష్ట్ర ప్రభుత్వం వాల్మీకులకు తీరని అన్యాయం చేసిందని వాల్మీకి సంఘాల నాయకులు మండి పడుతున్నారు.


ముమ్మాటికీ నమ్మక ద్రోహమే
- పులి శ్రీనివాసులు, వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు

సీఎం జగన్‌ గతంలో ప్రతిపక్ష నేత హోదాలో పాదయాత్ర నిర్వహించిన సమయంలో నేనున్నానని...ఒక్క అవకాశం ఇవ్వండని ఓట్లు అడుక్కుని మా ఓట్లతో గద్దెనెక్కి నాలుగేళ్లు మేమున్న సంగతే మరిచి పోయారు. మూడు అసెంబ్లీ సమావేశాలు జరిగితే ఒక్క దాంట్లో కూడా వాల్మీకి ఎస్టీ వర్గీకరణ బిల్లు పెట్టలేదు. దీంతో ఆందోళనలు ప్రారంభిస్తే ఒక కమిటీ ఏర్పాటు చేసి కేంద్రానికి అరకొర సమాచారంతో నివేదిక పంపారు. కంటితుడుపు చర్యగా నివేదిక పంపామని చెప్పడం దారుణం. దీనిపై ప్రజాక్షేత్రంలోనే తేల్చుకుంటాం.


గెలిపిస్తే మోసం చేస్తావా?
- మంజునాథ్‌, వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్‌ పట్టణ అధ్యక్షుడు, మదనపల్లె

ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్‌మోహన్‌రెడ్డి ఒక్క అవకాశం ఇవ్వండి మీ భవిష్యత్తు మారుస్తానని హామీ ఇచ్చి.. వాల్మీకులను పట్టించుకోకుండా నట్టేట ముంచారు. సీఎంగా ఐదేళ్లలో ఎప్పుడూ పట్టించుకోకుండా చివరి సంవత్సరంలో ఏదో చేసినట్లు వాల్మీకులను నమ్మించేందుకు కమిటీ ఏర్పాటు చేసి మభ్యపెట్టారు. ఎన్నికల్లో వాల్మీకులు తమ సత్తా ఏంటో చూపిస్తారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని