logo

కిమ్‌ను తలదన్నే జగన్‌ సర్కారు... కిమ్మనకూడదు జనం నోరు..!

ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ పేరు వింటేనే మనకు అరాచక పాలన గుర్తుకొస్తుంది. దీనిని తలదన్నేలా రాష్ట్రంలో జగన్‌ పాలన భయభ్రాంతులకు గురిచేస్తోంది.... అఫ్ఘనిస్థాన్‌లో తాలిబన్ల ఆటవిక పాలనను సైతం మరిపిస్తోంది.

Updated : 28 Apr 2024 10:54 IST

దాడులు, దౌర్జన్యాలు, అరాచకాలే వైకాపా అజెండా
పౌర హక్కులను ఘోరంగా కబళిస్తున్న పాలకులు
అధికార నేతలకు వత్తాసు పలుకుతున్న పోలీసులు
ఎన్నికల ముందు తారస్థాయికి చేరుతున్న ఆగడాలు
ఈనాడు, కడప

త్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ పేరు వింటేనే మనకు అరాచక పాలన గుర్తుకొస్తుంది. దీనిని తలదన్నేలా రాష్ట్రంలో జగన్‌ పాలన భయభ్రాంతులకు గురిచేస్తోంది.... అఫ్ఘనిస్థాన్‌లో తాలిబన్ల ఆటవిక పాలనను సైతం మరిపిస్తోంది. వైయస్‌ఆర్‌, అన్నమయ్య జిల్లాల్లో అధికార వైకాపా నేతలు పౌరహక్కులను ఘోరంగా కబళిస్తున్నారు. ప్రధానంగా పులివెందుల, పీలేరు, తంబళ్లపల్లె, కమలాపురం తదితర నియోజకవర్గాల్లో ప్రతిపక్షాలతోపాటు తమ వ్యతిరేకులను నిత్యం రాచిరంపాన పెడుతూ పేట్రేగిపోతున్నారు. తమ స్వలాభం కోసం జనం నెత్తురును కళ్లజూస్తూ కిరాతకులుగా వ్యవహరిస్తున్నారు. వైకాపా దత్తపుత్రులైన ఖాకీలు నేతల అరాచకాండకు నిర్లజ్జగా సహకరిస్తున్నారు. దీని పర్యవసానమే అన్నమయ్య జిల్లా వాల్మీకిపురంలో శనివారం తెదేపా ప్రచార రథం దహనకాండ.  సార్వత్రిక ఎన్నికలకు ముందు ప్రజల్ని భయపెట్టి వశపర్చుకునే ఎత్తుగడల్లో భాగమే తాజాగా జరిగిన దుర్ఘటన. ఇప్పటికైనా ఎన్నికల సంఘం జోక్యం చేసుకుని ఆదిలోనే అధికార వైకాపా అరాచకాలను అడ్డుకట్ట వేయాల్సిన సమయమిదే.

పీలేరులో పేట్రేగిన మూకలు

పీలేరు నియోజకవర్గంలో గత ఐదేళ్లుగా అరాచకాల అలజడి సాగింది. విపక్షాల్ని అణచివేసే చర్యలతో పాటు భూకబ్జాలకు అంతులేకుండా పోయింది. ప్రభుత్వ, ప్రైవేటు భూముల్ని వైకాపాలోని మాఫియా రాజేసింది. వందలాది ఎకరాలు కాజేసినట్లు ప్రభుత్వ విచారణలో తేలగా.. ఆపై నిందితులతోపాటు అధికారులను గుర్తించినా చర్యలు మాత్రం శూన్యం. కీలక నేతలు అధికారాన్ని అడ్డేయడంతో కాజేసిన భూములు వెనక్కి తీసుకోలేకపోయారు. నిందితులతో పాటు అక్రమాలకు వత్తాసు పలికిన అధికారులను ఇష్టారాజ్యంగా వదిలిపెట్టేశారు. పీలేరు పరిసరాల్లో రూ.400 కోట్ల భూఆక్రమణలు సాగాయి. కంభం వారిపల్లె కేంద్రంగా ఎర్రచందనం స్మగ్లింగ్‌ను సాగించారు. అడ్డుకోబోయిన టాస్క్‌ఫోర్స్‌ ఏఆర్‌ కానిస్టేబుల్‌ గణేష్‌ను వాహనంతో గుద్ది చంపేశారు. కేసును పట్టించుకోకుండా పోలీసు యంత్రాంగం రాజభక్తిని చాటుకుంది.

శ్రేణులతో కలిసి నిరసనకు దిగిన తెదేపా పీలేరు అసెంబ్లీ అభ్యర్థి నల్లారి కిషోర్‌కుమార్‌రెడ్డి భార్య తనూజారెడ్డి


చంద్రబాబుపైనే కేసులు

ప్రతిపక్ష నేత, తెదేపా అధినేత, మాజీ సీఎం నారా చంద్రబాబునాయుడు సాగునీటి ప్రాజెక్టుల సందర్శనకు వచ్చిన తరుణంలో అంగళ్లలో వైకాపా రాళ్లదాడికి పాల్పడింది. అక్కడ వైకాపా కవ్వింపు చర్యలు ముందస్తుగా తెలిసినప్పటికీ పోలీసు యంత్రాంగం భక్తిప్రపత్తులతో అధికార పార్టీ సేవలో తరిస్తూ అరాచకానికి అడ్డుకట్ట వేయకుండా నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరించింది. చంద్రబాబుతో సహా ఐదారు వందల మందిపై ఎదురు కేసులు నమోదు చేసి పోలీసు శాఖ తమ స్వామిభక్తిని చాటుకుంది. తంబళ్లపల్లె, పీలేరు నియోజకవర్గాల్లో కీలక వ్యక్తులను గుర్తించి అక్రమ కేసులు బనాయించి జైలు పాటు చేయడంతో పాటు నెలల తరబడి వేధించింది.


తంబళ్లపల్లెలో అరాచక రాజ్యం

తంబళ్లపల్లెలో తాలిబన్ల రాజ్యం కంటే మించిన వ్యవహారాలు సాగుతున్నాయి. అక్కడ ప్రజాస్వామ్యం ఏ కోశానా కనిపించదు. ఎవరూ నోరు తెరవడానికి వీల్లేదు. ప్రశ్నించిన పక్షంలో దాడులకు గురికావాల్సి ఉంటుంది. కేసులు పెట్టి జైలు పాలు చేస్తారు. అక్కడ అధికార పార్టీ ప్రైవేటు సైన్యం స్వైరవిహారం చేస్తూ కావాల్సిన భూములను కబ్జా చేసి వాటిని రెవెన్యూశాఖ ద్వారా అధికార ముద్ర వేసుకుని తమ ఖాతాలో వేసుకుంటున్నారు. వందలాది ఎకరాలు ఇలా కబ్జా జరిగిపోగా బాధితులు భయపడుతూ ప్రాణాలు దక్కితే చాలన్నట్లుగా బిక్కుబిక్కుమంటూ జీవనం సాగిస్తున్నారు. నియోజకవర్గంలో ప్రభుత్వ, ట్రస్టు, ప్రైవేటు భూములను చాలావరకు కాజేయగా.. బాధితులందరూ తమకు న్యాయం చేయాలంటూ ఇప్పుడిప్పుడే బయటకొస్తున్నారు. ఏన్డీఏ అభ్యర్థి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి రంగంలోకి దిగడంతో ఆయన వద్దకు శనివారం వచ్చి న్యాయం చేయాలని వేడుకున్నారు. తానున్నానంటూ.. ఇక్కడే కార్యాలయం ఏర్పాటు చేసుకుని అండగా ఉంటాననే భరోసా ఇచ్చారు.

వాల్మీకిపురం వద్ద దహనమవుతున్న తెదేపా ప్రచార రథం మంటలను ఆర్పుతున్న అగ్నిమాపక సిబ్బంది


పులివెందులలో ప్రాణాలకే ముప్పు

పులివెందులలో ఎవరైనా తెదేపాలో చేరినా.. మద్దతుగా నిలిచినా వారి ప్రాణాలకు ముప్పు తలెత్తుతోంది. గతేడాది సెప్టెంబరు 8న తెదేపా అధినేత చంద్రబాబునాయుడు ప్రాజెక్టుల సందర్శనలో భాగంగా పులివెందులకు వచ్చారు. ఈ నేపథ్యంలో కార్యకర్త చింతకాయల నాగరాజు బాణసంచా కాల్చి తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. దీన్ని జీర్ణించుకోలేని వైకాపా నేతలు నాగరాజును పొలంలో కిరాతకంగా నరికి చంపేశారు. ఈ ఘటనను అక్రమ సంబంధం కింద చూపించి కేసును దారిమళ్లించి వైకాపాపై పోలీసులు తమ స్వామిభక్తిని చాటుకున్నారు. తాజాగా మురారిచింత గ్రామంలో వైకాపా నుంచి తెదేపాలో చేరిన చలమారెడ్డి కుటుంబంపై దాడి చేశారు.


కమలాపురంలో దాడులు

బాధితులను పరామర్శిస్తున్న తెదేపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు పుత్తా

కమలాపురం మండలం కోగటం గ్రామంలో శనివారం తెదేపా కార్యకర్తలపై వైకాపా నేతలు దాడులకు పాల్పడ్డారు. పెద్ద గ్రామమైన ఇక్కడ వైకాపా రిగ్గింగ్‌ చేసుకునే ఎత్తుగడలో భాగంగా తెదేపాకు అనుకూలంగా ఉన్న ఎం.ఎల్లారెడ్డి, ఆయన సతీమణి లత, లక్ష్మీనారాయణరెడ్డిపై 12 మంది వైకాపా మూక రాడ్లు, రాళ్లతో దాడికి దిగింది. భయకంపితులు చేయడం ద్వారా పోలింగ్‌ రోజు ఏకపక్షంగా ఎన్నికలు జరిపించుకోవాలనే వ్యూహంతో ఘాతుకానికి పాల్పడింది. దాడిలో గాయపడ్డ ముగ్గురిని కడప ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి తరలించారు. అక్కడ తెదేపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు పుత్తా నరసింహారెడ్డి బాధితులను పరామర్శించారు. ఈ సందర్భంగా పుత్తా మాట్లాడుతూ ఏడాదిలో మూడు పార్టీలు మారిన మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డి, ఆయన కుమారుడు అనిల్‌కుమార్‌రెడ్డి, కరుణ్‌రెడ్డి, ప్రవీణ్‌కుమార్‌రెడ్డి గ్రామంలో అరాచకాలకు పాల్పడుతున్నట్లు ఆరోపించారు. పై నలుగురిపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు