logo

జగన్‌ సర్కారు నిర్వాకం... పంచాయతీలు నిర్వీర్యం..!

గ్రామాల్లో అభివృద్ధే ధ్యేయమని చెప్పిన సీఎం జగన్‌ చివరకు పంచాయతీల్లోని నిధులను సైతం మళ్లించేసి పూర్తిగా నిర్వీర్యం చేశారు. సర్పంచులను ఉత్సవ విగ్రహాల్లా మార్చేశారు.

Published : 29 Apr 2024 03:54 IST

కేంద్ర, రాష్ట్ర నిధుల మళ్లింపు
ఉత్సవ విగ్రహాల్లా సర్పంచులు

పంచాయతీరాజ్‌ ఛాంబరు, సర్పంచుల సంఘం ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ వద్ద గత నెలలో  ‘నిధులు-విధులు’ కోసం సర్పంచుల నిరసన

గ్రామాల్లో అభివృద్ధే ధ్యేయమని చెప్పిన సీఎం జగన్‌ చివరకు పంచాయతీల్లోని నిధులను సైతం మళ్లించేసి పూర్తిగా నిర్వీర్యం చేశారు. సర్పంచులను ఉత్సవ విగ్రహాల్లా మార్చేశారు. రాష్ట్ర పంచాయతీరాజ్‌ ఛాంబరు, సర్పంచుల సంఘం ఆధ్వర్యంలో ‘నిధులు-విధులు’ కోసం సర్పంచులు అనేక సార్లు పోరాటాలు చేసినప్పటికీ జగన్‌ సర్కారు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. కేంద్రం నుంచి వచ్చిన 14, 15వ ఆర్థిక సంఘం నిధులను కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇతర అవసరాలకు ఉపయోగించుకుంది. దీంతో గ్రామాల్లో అభివృద్ధి పనులు జరగక కునారిల్లుతున్నాయి.

న్యూస్‌టుడే, కడప ఏడురోడ్లు: ప్రస్తుత మండు వేసవిలో గ్రామాల్లో తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. పంచాయతీల్లో నిధులు లేకపోవడంతో ట్యాంకర్లలో సరఫరా చేసే పరిస్థితి కూడా లేదు. వడగాలులు వీస్తుండడంతో విద్యుత్తు దీపాలు పాడవుతున్నాయి. వాటి మరమ్మతులకూ దిక్కులేదు. హరిత రాయబారులకు జీతాలు ఇవ్వకపోవడంతో వారు విధులకు రావడం లేదు. దీంతో చాలా గ్రామాల్లో చెత్త నిల్వలు పేరుకుపోయి వ్యాధులు ప్రబలు తున్నాయి. మురుగు కాలువల్లో పూడికలూ తీయలేకపోతున్నారు. ఇలా చిన్నచిన్న పనులు సైతం చేయలేకపోతున్నామని సర్పంచులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  

రూ.830 కోట్లకు పైగా బకాయిలు

ఉమ్మడి కడప జిల్లాలో 807 గ్రామ పంచాయతీలున్నాయి. కేంద్రం 14, 15వ ఆర్థిక సంఘాల కింద సుమారు రూ.600 కోట్లకు పైగా విడుదల చేసింది. వాటిని వైకాపా ప్రభుత్వం ఇతర అవసరాలకు మళ్లించేసింది. మరోవైపు 2019 నుంచి ఇప్పటి వరకు రాష్ట్ర ఆర్థిక సంఘం కూడా ఏటా జిల్లాకు సుమారు రూ.46 కోట్ల వరకు విడుదల చేయాలి. ఈ అయిదేళ్లలో రూ.230 కోట్లు రావాలి. అటు కేంద్రం, ఇటు రాష్ట్ర ప్రభుత్వం నిధులు కలిపి మొత్తం రూ.830 కోట్లకు పైగా నిధులు గ్రామపంచాయతీలకు జమ కాలేదు. ఇదిలాగుంటే వారం రోజుల కిందట   రూ.988 కోట్ల నిధులను రాష్ట్రవ్యాప్తంగా పంచాయతీలకు విడుదల చేస్తామని ప్రభుత్వం చెప్పినప్పటికీ అవి ఇప్పటికీ జమ కాలేదు. మొత్తం మీద ఐదేళ్ల జగన్‌ పాలనలో పంచాయతీల ఖజానా ఖాళీ చేసేసి కోలుకోలేని దెబ్బ తీశారు.

ఎన్నికల్లో తగిన మూల్యం తప్పదు

సీఎం జగన్‌ అధికారంలోకి వచ్చాక పంచాయతీరాజ్‌ వ్యవస్థను నిర్వీర్యం చేసి సర్పంచులకు ఎటువంటి అధికారాలివ్వకుండా ఉత్సవ విగ్రహాల్లా మార్చారు. జడ్పీటీసీసభ్యులు, ఎంపీపీలు, సర్పంచులకు రావాల్సిన గౌరవ వేతనం కొన్ని నెలలుగా విడుదల చేయలేదు. రానున్న ఎన్నికల్లో సీఎం జగన్‌ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు.

కొత్తపు మునిరెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు, పంచాయతీరాజ్‌ ఛాంబరు

అభివృద్ధికి దూరంగా పల్లెలు

జగన్‌ పాలనలో గ్రామాలు అభివృద్ధికి ఆమడదూరంలో నిలిచాయి. పంచాయతీలకు వస్తున్న ఆర్థిక సంఘం నిధులను రాష్ట్ర ప్రభుత్వం ఇతర అవసరాలకు ఉపయోగించుకోవడంతో గ్రామాల అభివృద్ధి కుంటు పడింది. తాగునీటి అవసరాలు, విద్యుత్తు దీపాలు, డ్రైనేజీ వ్యవస్థ, రోడ్ల నిర్మాణం ఇలా... ఏ పనులూ చేయలేకపోతున్నాం.

పార్థసారథిరెడ్డి, సర్పంచి, పులికుంట్ల, గాలివీడు మండలం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని