logo

గులాబీ సైన్యానికి కొత్త దళపతులు

తెరాస అధిష్ఠానం.. జిల్లాలకు కొత్త అధ్యక్షులను నియమించింది. జూబ్ల్లీహిల్స్‌ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌కు హైదరాబాద్‌ జిల్లా, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డికి

Published : 27 Jan 2022 05:12 IST

హైదరాబాద్‌కు మాగంటి.. రంగారెడ్డికి మంచిరెడ్ఢి. మేడ్చల్‌కు శంభీపూర్‌ రాజు

ఈనాడు డిజిటల్‌, హైదరాబాద్‌: తెరాస అధిష్ఠానం.. జిల్లాలకు కొత్త అధ్యక్షులను నియమించింది. జూబ్ల్లీహిల్స్‌ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌కు హైదరాబాద్‌ జిల్లా, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డికి రంగారెడ్డి జిల్లా, ఎమ్మెల్సీ శంభీపూర్‌రాజుకు మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లాల బాధ్యతల్ని అప్పగించింది. ఈమేరకు బుధవారం జాబితాను విడుదల చేసింది. ఈసారి 3 జిల్లాలకు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలను అధ్యక్షులుగా నియమించడం విశేషం. వీరంతా తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్‌తో సన్నిహితంగా ఉంటూ, పార్టీ, ప్రభుత్వ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. గతంలో గ్రేటర్‌ హైదరాబాద్‌ అధ్యక్షుడిగా మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు వ్యవహరించారు. అప్పట్లో పార్టీ కమిటీలను రద్దు చేసినప్పటి నుంచి గ్రేటర్‌ అధ్యక్షునిగా ఎవరినీ నియమించలేదు. గ్రేటర్‌ స్థానే ఇప్పుడు జిల్లాలకు బాధ్యులను నియమించింది. ఈ మూడు జిల్లాల పరిధిలో అధికంగా శాసనసభ స్థానాలుండటంతో రాజధానిలో పార్టీ పూర్తి పట్టు సాధించేందుకు తెరాస ప్రణాళికలను రూపొందించింది.

మరింత బలోపేతం చేస్తాం

జూబ్లీహిల్స్‌: తెరాసను హైదరాబాద్‌ జిల్లాలో మరింత బలోపేతం చేస్తామని హైదరాబాద్‌ జిల్లా నూతన అధ్యక్షుడు మాగంటి గోపీనాథ్‌ తెలిపారు. ఆయన కార్యాలయానికి బుధవారం భారీ ఎత్తున అభిమానులు, కార్యకర్తలు తరలివచ్చి శుభాకాంక్షలు తెలిపారు. సంబరాలు చేసుకున్నారు. మాగంటి మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌, కేటీఆర్‌ తనపై నమ్మకంతో అప్పగించిన ఈ పదవికి తగిన న్యాయం చేస్తానన్నారు. గోపీనాథ్‌.. ఎన్టీఆర్‌ హయాంలో 1983లో తెదేపాలో చేరి తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు. 1987-88 వరకు హుడాలో డైరెక్టర్‌గా, 1988-93 వరకు జిల్లా వినియోగదారుల ఫోరం సభ్యుడిగా, 2014-15 వరకు తెదేపా గ్రేటర్‌ హైదరాబాద్‌ అధ్యక్షుడిగా పనిచేశారు. 2014లో జూబ్లీహిల్స్‌ నుంచి తెదేపా ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఏడాది తరువాత తెదేపాకు రాజీనామా చేసి తెరాసలో చేరారు. 2018లో తెరాస నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని