చదరంగంలో కొత్త చరిత్ర

పదిహేడేళ్ల యువతేజం గుకేశ్‌ చదరంగ క్రీడా చరిత్రలో సరికొత్త అధ్యాయాన్ని ఆవిష్కరించాడు. ఫిడే క్యాండిడేట్స్‌ టోర్నీలో విజేతగా ఆవిర్భవించడం ద్వారా ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ టైటిల్‌ పోరుకు అర్హత సాధించాడు.

Published : 23 Apr 2024 01:13 IST

దిహేడేళ్ల యువతేజం గుకేశ్‌ చదరంగ క్రీడా చరిత్రలో సరికొత్త అధ్యాయాన్ని ఆవిష్కరించాడు. ఫిడే క్యాండిడేట్స్‌ టోర్నీలో విజేతగా ఆవిర్భవించడం ద్వారా ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ టైటిల్‌ పోరుకు అర్హత సాధించాడు. ఇదే ఊపులో అతడు మరోమెట్టు ఎక్కి చిర యశస్సును సొంతం చేసుకోవాలంటే- ప్రపంచ ఛాంపియన్‌ డింగ్‌ లిరెన్‌తో తలపడి ఓడించాలి! ఇలా ఛాంపియన్‌కి ఛాలెంజ్‌ విసిరే స్థాయికి ఎదగడంలో- విశ్వనాథన్‌ ఆనంద్‌ తరవాత రెండో భారతీయుడు అతడే! ఈఎన్‌టీ సర్జన్‌ అయిన తండ్రి, మైక్రో బయాలజిస్ట్‌ అయిన తల్లి అందించిన విశేష ప్రోత్సాహమే కొండంత అండగా గుకేశ్‌ చదరంగ ప్రస్థానం ఉరకలెత్తింది. ఏడేళ్ల వయసునుంచే అరవై నాలుగు గళ్ల మేధా క్రీడను ఆపోశన పట్టడం అలవడింది. ఆసియా స్కూల్‌ చెస్‌ ఛాంపియన్‌షిప్‌(తొమ్మిదేళ్ల లోపువారికి), ప్రపంచ యూత్‌ చెస్‌ ఛాంపియన్‌షిప్‌(12 ఏళ్ల లోపువారికి) పోటీల్లో విజేతగా నిలవడం అతడి సహజ ప్రజ్ఞను చాటింది. 2018నాటి ఆసియా యువజన చదరంగ సమరంలో అయిదు స్వర్ణ పతకాలు కొల్లగొట్టిన గుకేశ్‌, పన్నెండేళ్ల వయసుకే గ్రాండ్‌ మాస్టర్‌ హోదా సముపార్జించాడు. అది 2019నాటి మాట. కార్ల్‌సన్‌, ఆనంద్‌లను అధిగమిస్తానని ఆనాడే ప్రకటించిన గుకేశ్‌ ఆ ఇరువురు దిగ్గజాల మీదా పైచేయి చాటుకున్నాడు. ఇప్పుడిక అతడి తదుపరి లక్ష్యం విశ్వవిజేతను మట్టి కరిపించడమే. ‘ప్రపంచ రికార్డుదేముంది... భారత్‌ తరఫున ఆడటమే గొప్ప’ అని గుకేశ్‌ వినయంగా స్పందించినా, స్వభావరీత్యా ఆ యువ క్రీడాకారుడి దూకుడు ఎక్కడా తగ్గదు. కార్ల్‌సన్‌, కాస్పరొవ్‌ 22 ఏళ్ల వయసులో ప్రపంచ ఛాంపియన్లుగా అవతరించారు. ఆ రికార్డును బద్దలుకొట్టి భారత యువ కిశోరం నవచరిత్రను లిఖించే ఘట్టం కోసమే భారతావని ఎదురుచూపులు!

ఇరువైపులా చతురంగ బలాలను మోహరించి దీక్షగా ఆడే చదరంగానికి ‘మేధావుల క్రీడ’గా పేరొచ్చింది. చెస్‌ పుట్టినిల్లు భారతదేశమే అయినా విశేష ప్రాచుర్యం పొందింది ఐరోపాలో. ఆఫ్రికా ఖండానికీ చెస్‌ క్రీడ విస్తరించింది. 2010నాటికి దేశంలో గ్రాండ్‌మాస్టర్ల సంఖ్య సుమారు 20. ఇప్పుడది 80కి పైబడటం దేశీయంగా చదరంగ క్రీడ పట్ల జనాదరణ ఎంతగా పెరిగిందో చాటుతోంది. ప్రత్యర్థిని దిమ్మెరపరచే వేగంతో శత్రుసేనల్ని కకావికలం చేసి వారి రాజును దిగ్బంధించే నేర్పరితనమే చెస్‌లో విజేత ఎవరో నిర్ణయిస్తుంది. సంప్రదాయ క్రీడకు భిన్నంగా అనూహ్య ఎత్తుగడలతో వేగంగా దూసుకుపోయే ఆటతీరుతో విశ్వనాథన్‌ ఆనంద్‌ అయిదు పర్యాయాలు ప్రపంచ ఛాంపియన్‌గా నిలవడం- ఏనాటికైనా అద్భుత రికార్డే. ఆయన దిద్దిన విశిష్ట ఒరవడి హరికృష్ణ, హంపి, హారికలు మొదలు గుకేశ్‌, ప్రజ్ఞానంద, విదిత్‌ల వరకు ఎందరినో ఉత్తేజపరుస్తోంది. అమెరికా, రష్యా, నెదర్లాండ్స్‌ ప్రభృత దేశాలను తలదన్నే స్థాయిలో ఇక్కడ దండిగా గ్రాండ్‌మాస్టర్లు రూపుదిద్దుకొంటున్నారు. విశ్వనాథన్‌ ఆనంద్‌ ఘన వారసత్వాన్ని అందిపుచ్చుకొంటూ గుకేశ్‌, నిహాల్‌, అర్జున్‌ ప్రభృత యువతరం, దాక్షిణ్‌ అరుణ్‌ లాంటి జూనియర్‌ ఆటగాళ్లు తమ క్రీడాప్రజ్ఞకు పదును పెట్టుకుంటే- చదరంగం బల్లపై ఇండియా ఆధిపత్యం ఇప్పట్లో చెక్కుచెదరదు. ఆ స్వప్నం సాకారం కావడానికి ఆటగాళ్లకు వ్యవస్థాగత తోడ్పాటు, నిరంతర శిక్షణ అందించే పటిష్ఠ యంత్రాంగాన్ని ప్రభుత్వం తీర్చిదిద్దాలి. ఔత్సాహిక క్రీడాకారులు క్షేత్రస్థాయిలో ఎదుర్కొంటున్న మౌలిక సమస్యల్నీ చురుగ్గా పరిష్కరించాలి. దేశంలో సహజసిద్ధ యువ ప్రజ్ఞకు కొదవ లేదు. ఆ బలిమిని సద్వినియోగపరచుకుంటే క్రీడల్లో ఇండియాకు ఎదురుండదు!

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.