పంచాయతీల పీకనులిమిన జగన్‌

గాడిదను చూపించి గుర్రమని టాంటాం వేసేవారిని ఏమంటాం? అటువంటి అబద్ధాలరాయుళ్లనూ తలదన్నేంతటి బుకాయింపుల భాష జగన్‌ సొంతం! ‘ప్రతి కుటుంబం, ప్రతి గ్రామం కలలను నెరవేరుస్తూ విప్లవాత్మక పథకాలు, వ్యవస్థలు తీసుకొచ్చా’మంటూ ఆయన తాజాగా నిర్లజ్జగా ఆత్మస్తుతి చేసుకున్నారు.

Published : 29 Apr 2024 00:24 IST

గాడిదను చూపించి గుర్రమని టాంటాం వేసేవారిని ఏమంటాం? అటువంటి అబద్ధాలరాయుళ్లనూ తలదన్నేంతటి బుకాయింపుల భాష జగన్‌ సొంతం! ‘ప్రతి కుటుంబం, ప్రతి గ్రామం కలలను నెరవేరుస్తూ విప్లవాత్మక పథకాలు, వ్యవస్థలు తీసుకొచ్చా’మంటూ ఆయన తాజాగా నిర్లజ్జగా ఆత్మస్తుతి చేసుకున్నారు. పల్లెసీమల స్వప్నాల సాకారం సంగతి దేవుడెరుగు- పంచాయతీ ఖజానాలకు కన్నమేయడంలో జగన్‌ చేతివాటం కారణంగా గ్రామీణుల బతుకులు దుర్భరమయ్యాయని వైకాపా సర్పంచులే వేనోళ్ల దుయ్యబడుతున్నారు. వీధిదీపాలు, బోర్లకు మరమ్మతుల నుంచి పారిశుద్ధ్య నిర్వహణకోసం బ్లీచింగ్‌ పౌడర్‌ కొనడం వరకు దేనికీ పంచాయతీల దగ్గర కాసుల్లేకుండా చేసిన నయవంచకత్వం జగన్‌ది. పల్లెల బాగుకోసం తానేమీ సొమ్ము విదల్చకపోగా- ఆర్థిక సంఘం ద్వారా పంచాయతీలకు కేంద్రమిచ్చిన రెండు వేల కోట్ల రూపాయలకు పైగా నిధులను కాజేసిన జగన్మాయదారి ప్రభుత్వమిది! దానిపై ఫిర్యాదులు వెల్లువెత్తడంతో కేంద్ర పంచాయతీ రాజ్‌ ఉపకార్యదర్శి రాష్ట్రానికి వచ్చి విచారించారు. ‘ఆర్థిక సంఘం నిధులను సర్పంచులకే తెలియకుండా ఎలా ఖర్చుచేసా’్తరన్న ఆయన ప్రశ్న- జగన్‌ అరాచక ఏలుబడికి అద్దంపట్టేదే. ప్రజల ద్వారా ఎన్నికై, జనానికి జవాబుదారీగా ఉండే సర్పంచులను ఉత్సవ విగ్రహాలుగా మార్చేసిన జగన్‌- తన కనుసన్నల్లో మెలిగే సచివాలయాల వ్యవస్థకు పురుడుపోశారు. గ్రామాలకేమి కావాలో స్థానికులే చర్చించుకుని, గ్రామసభల్లో నిర్ణయాలు తీసుకుని, ప్రజాప్రతినిధులతో ఆ పనులు చేయించుకునే వాతావరణాన్ని వైకాపా అధినేత విధ్వంసం చేశారు. పాలనను వికేంద్రీకరించాలన్న రాజ్యాంగ ఆశయాలకు సమాధికట్టిన జగన్‌- స్థానికసంస్థల పీకనులిమి సర్వంసహాధిపత్యాన్ని చలాయించారు!

‘మన 58 నెలల పాలన ప్రోగ్రెస్‌ రిపోర్టును పరిశీలిస్తే గ్రామగ్రామానా  తీసుకొచ్చిన విప్లవాత్మక మార్పులు కనిపిస్తాయి’ అన్నది జగన్‌ ప్రవచనమే. ఆయనగారు తెచ్చిన మార్పులేమిటంటే- వీధిదీపాలను కొండెక్కించి పల్లెలను కటికచీకట్లో ముంచేయడం, గ్రామీణ రోడ్లను గాలికొదిలేసి జనం ప్రాణాలను బలిగొనడం వంటివే! ‘చంద్రకాంతి’ పథకంలో భాగంగా తెలుగుదేశం ప్రభుత్వం గ్రామాల్లో 24.88 లక్షల ఎల్‌ఈడీ వీధిదీపాలను ఏర్పాటు చేయించింది. కేంద్రం అధీనంలోని ఇంధన సామర్థ్య సేవల సంస్థ(ఈఈఎస్‌ఎల్‌)కు వాటి నిర్వహణ బాధ్యతలు అప్పగించింది. తాను సీఎం కాగానే ఆ పథకం పేరును ‘జగనన్న పల్లెవెలుగు’గా మార్చిన వైకాపా అధినేత- నిరుడు జూన్‌ నాటికి ఈఈఎస్‌ఎల్‌కు రూ.651 కోట్లకు పైగా బకాయిలను పేరబెట్టారు. విద్యుత్‌ బాకీల పేరిట పల్లెల సొమ్మును లెక్కాపత్రం లేకుండా తన్నుకుపోయిన జగన్‌ ప్రభుత్వం- వీధిదీపాల నిర్వహణను మళ్లీ పంచాయతీల నెత్తినే రుద్దింది. చేతిలో రూపాయి లేని పంచాయతీ పాలకవర్గాలకు అది గుదిబండ కావడంతో గ్రామాల్లో అంధకారం అలముకొంది. ఉపాధి హామీ నిధులకు పంచాయతీ సొమ్మును జతచేసి అయిదేళ్లలో గ్రామాల్లో 25వేల కిలోమీటర్లకు పైగా సిమెంటు రోడ్లను నిర్మించింది నాటి తెదేపా ప్రభుత్వం. ఉపాధిహామీ నిధులను సచివాలయాలు, రైతుభరోసా కేంద్రాల వంటివాటి నిర్మాణానికి మళ్ళించిన జగన్‌- తన పదవీకాలంలో వాటినీ పూర్తిచేయించలేదు. మురుగు కాల్వలను శుభ్రం చేయించడం మొదలు తాగునీటి సరఫరా దాకా దేనికీ నిధులు రాల్చని జగన్‌- గ్రామీణాభివృద్ధికి గ్రహణం పట్టించారు. జనం బాధలు చూడలేక సొంత డబ్బుతో అభివృద్ధి పనులు చేపట్టిన సర్పంచ్‌లకు బిల్లులు చెల్లించకుండా వారి జీవితాలను ఆగమాగం చేశారు. నూరు తప్పుల శిశుపాలుడి కథను శ్రీకృష్ణుడు ముగించాడు. బాపూజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యాన్ని ఛిద్రంచేసిన జగన్‌ ప్రభుత్వానికి పరిసమాప్తి పలకాల్సింది... ఓటుహక్కు అనే సుదర్శన చక్రధారులైన ప్రజలే!

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.