జగనాసుర భ్రష్ట చరిత్ర

మనిషి నెత్తురు రుచి మరిగిన పులి నక్కజిత్తులు నేర్చి రాజ్యం చేస్తే అది జగన్‌ రాక్షస పాలనకు నకలు అవుతుంది. మాజీ మంత్రి, సీఎం జగన్‌కు స్వయానా బాబాయి వివేకానందరెడ్డి దారుణ హత్యోదంతం నేటికీ ఒక కొలిక్కి రాకపోవడంలో జగనాసుర భ్రష్ట చరిత్ర చీకటి కోణాలు భీతిల్లజేస్తున్నాయి.

Published : 30 Apr 2024 00:16 IST

నిషి నెత్తురు రుచి మరిగిన పులి నక్కజిత్తులు నేర్చి రాజ్యం చేస్తే అది జగన్‌ రాక్షస పాలనకు నకలు అవుతుంది. మాజీ మంత్రి, సీఎం జగన్‌కు స్వయానా బాబాయి వివేకానందరెడ్డి దారుణ హత్యోదంతం నేటికీ ఒక కొలిక్కి రాకపోవడంలో జగనాసుర భ్రష్ట చరిత్ర చీకటి కోణాలు భీతిల్లజేస్తున్నాయి. అవినాష్‌ ఏ తప్పూ చేయలేదని బలంగా నమ్మాను కాబట్టే ఎంపీ టికెట్‌ ఇచ్చానంటూ సీబీఐ ముద్దాయిగా నిర్ధారించిన వ్యక్తినే నేడు చంకనెత్తుకొని జగన్‌ ఊరేగుతున్నారు. ‘చిన్నాన్నకు రెండో భార్య ఉన్నమాట నిజమా... కాదా, ఆయనతో ఆమెకు సంతానం కలిగిందా... లేదా’ అంటూ బాబాయి వ్యక్తిత్వ హననానికీ తెగించారు. 2019 మార్చి 14-15 నడిరాత్రి వేళ వివేకాను క్రూరంగా చంపించినవాళ్లు హత్యాస్థలిలో నెత్తుటి మడుగును శుభ్రం చేసి, గాయాలు కనపడకుండా కుట్లు వేసి గుండెపోటు మరణంగా చిత్రించబోయారు. సొంత మీడియాలోనూ కాకమ్మ కథల్నే ప్రచారం చేశారు. వివేకా కూతురు డాక్టర్‌ సునీత వాస్తవం పసిగట్టగానే ‘హత్య - రాజకీయ కుట్ర’ కోణాలు పైకి తేలాయి. మారణాయుధం ఏమిటో హంతకులకు తప్ప ఎవరికీ తెలియనప్పుడే, గొడ్డలితో ఎక్కడ ఎన్ని వేట్లు వేసి వధించారో తానే ప్రత్యక్ష సాక్షి అన్నట్లుగా వివరించిన జగన్‌- సీబీఐ దర్యాప్తు కోసం డిమాండ్‌ చేయడమే కాదు, హైకోర్టులో కేసూ వేశారు. అప్పటి చంద్రబాబు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్‌) కేసులో పురోగతి సాధిస్తున్న దశలో జగన్‌ సర్కారు ఏర్పాటైంది. సీబీఐ దర్యాప్తు కోరుతూ దాఖలు చేసిన వ్యాజ్యాన్ని అర్ధాంతరంగా ఉపసంహరించుకొన్న జగన్‌- వివేకా హత్య కేసును నీరుగార్చే బాధ్యతను నిష్ఠగా చేపట్టారు. హైకోర్టులో డాక్టర్‌ సునీత న్యాయపోరాటానికి ఫలశ్రుతిగా సీబీఐ దర్యాప్తునకు దారులు పడ్డాయి. అప్పటినుంచి జగన్‌లో నిద్ర లేచిన ఫ్యాక్షనిజ నైజం సీబీఐకి అడుగడుగునా అవరోధాలు సృష్టించింది. కేసు విచారణ ఏపీలో సక్రమంగా సాగే పరిస్థితి లేదన్న వాదనకు వత్తాసుగా సుప్రీంకోర్టే దాన్ని తెలంగాణకు మార్చింది. అవినాష్‌రెడ్డికి సీబీఐ ఉచ్చు బిగించినప్పటినుంచే జగన్‌లో రాక్షసత్వం మరింతగా బుసలుకొడుతోంది!

‘అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పలేనివారంతా చిన్నపిల్లాడైన అవినాష్‌ను దూషిస్తూ తెరమరుగు చేయాలనుకోవడం దారుణం’ అన్నది జగన్‌ సుభాషితం. ‘వివేకా హత్య కేసులో ఆధారాల్ని గంగిరెడ్డి తుడిచేస్తుంటే, అవినాష్‌ జస్ట్‌ చూస్తూ నిలబడ్డారంతే’ అన్నది జగన్‌ మేనమామ ప్రవచనం. అదే నిజమైన పక్షంలో- గొడ్డలి వేటును గుండెపోటుగా చిత్రించిన ‘చిన్న పిల్లాడు’ ఎవరు జగన్‌మోహన్‌ రెడ్డీ? అవినాష్‌ బెయిలు రద్దు చేస్తే గాని సాక్షులకు రక్షణ ఉండదని సీబీఐ ఈనెల తొలివారంలో తెలంగాణ హైకోర్టుకు నివేదించింది. నిందితులు, వారి తరఫు వ్యక్తులు సాక్షులను ప్రభావితం చెయ్యడానికి నిరంతరం ప్రయత్నిస్తూ దర్యాప్తును పక్కదారి పట్టించాలని చూస్తున్నారని సీబీఐ స్పష్టీకరించింది. ఆర్థిక నేరాల్లో నెంబర్‌-1 ముద్దాయిగా ఉండి కూడా పదేళ్లకు పైగా బెయిలుపై కొనసాగుతూ ముఖ్యమంత్రిత్వం చేపట్టిన జగన్‌కు చట్టంతో చెడుగుడు ఆడటం కొట్టిన పిండి. వివేకా కేసులో రెండు అనుమానాస్పద మరణాలు చోటుచేసుకొన్నా వాటి అతీగతీ లేదు. సీబీఐ అధికారులపైనే తప్పుడు కేసులు బనాయించిన వైపరీత్యం చరిత్రలో ఎన్నడూ కానరాదు. కర్నూలులో అవినాష్‌ను నిర్బంధించడానికి వెళ్ళిన సీబీఐ అధికారుల్ని అతగాడి దరిదాపుల్లోకి వెళ్లకుండా వైకాపా మూకలు రోజుల తరబడి అడ్డుకొంటే, రౌడీ తండాలకు సకల సేవలు అందించి తరించిపోయింది జగన్‌ సర్కారు! వివేకా హత్య విషయం ప్రపంచానికి తెలియక ముందే జగన్‌కు తెలుసునంటూ ఆ వైనంపై దర్యాప్తు జరపాల్సి ఉందని సీబీఐ తెలంగాణ హైకోర్టుకు విన్నవించింది. అనుమానితుల కాల్‌ డేటా, సీసీటీవీ సాక్ష్యాలు, గూగుల్‌ టేక్‌ఔట్‌ వివరాలు, ఐపీడీఆర్‌ విశ్లేషణల ద్వారా అవినాష్‌, భాస్కరరెడ్డి, శివశంకరరెడ్డిల ప్రమేయాన్ని సీబీఐ ధ్రువీకరించింది. వీరంతా వివేకాను బలిగొన్న పాత్రధారులైతే, తెరవెనక చక్రం తిప్పిన సూత్రధారులెవరు? కొన్నేళ్లుగా హంతకులకు వంతపాడుతూ, ముద్దాయిల్ని ముద్దు చేస్తున్న జగనే- వివేకా హత్య దరిమిలా గత ఎన్నికల్లో ప్రధాన లబ్ధిదారు. గోముఖ వ్యాఘ్రం లాంటి జగన్‌ నిజనైజాన్ని నిశితంగా గమనిస్తున్న ప్రజలు కొర్రుకాల్చి వాత పెట్టేందుకు సిద్ధంగా ఉన్నారు!

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.