icon icon icon
icon icon icon

వరంగల్

వరంగల్‌ లోక్‌సభ స్థానం1952లో ఆవిర్భవించింది. ఈ స్థానాన్ని (Warangal Lok Sabha constituency)  ఎస్సీకి రిజర్వ్‌ చేశారు.

Published : 26 Apr 2024 14:45 IST

లోక్‌సభ పరిధిలోని అసెంబ్లీ స్థానాలు: స్టేషన్‌ఘన్‌పూర్ (ఎస్సీ), వరంగల్ తూర్పు, వరంగల్ పశ్చిమ, పాలకుర్తి, వర్ధన్నపేట(ఎస్సీ), పరకాల, భూపాలపల్లి నియోజకవర్గాలు వరంగల్ (ఎస్సీ) ఈ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోకి వస్తాయి.

పోటీలో ఉన్న ప్రధాన పార్టీల అభ్యర్థులు వీళ్లే!

ప్రస్తుత ఎన్నికల్లో కాంగ్రెస్‌ నుంచి కడియం కావ్య, భాజపా నుంచి అరూరి రమేశ్‌, భారాస నుంచి మారేపల్లి సుధీర్‌కుమార్‌ పోటీ చేస్తున్నారు. మూడు ప్రధాన పార్టీల నుంచి బరిలో ఉన్న అభ్యర్థులు తొలిసారి ఎంపీగా పోటీ చేస్తుండటం గమనార్హం.. వరంగల్‌ నుంచి పోటీ చేసేందుకు అన్ని పార్టీల కన్నా ముందు భారాసనే అభ్యర్థిగా కడియం శ్రీహరి తనయ కావ్యను ప్రకటించింది. తర్వాత ఆమె హస్తం గూటికి చేరడంతో జరిగిన పరిణామాలతో భారాసకు అభ్యరి ఎంపిక కత్తిమీద సాములా మారింది. వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే అరూరి రమేశ్‌ తొలుత భారాస నుంచి పోటీ చేసేందుకు ఆసక్తి చూపారు. కానీ, పార్టీ అధిష్ఠానం టికెట్టు ఇచ్చే అవకాశం లేదనే సంకేతాలు రావడంతో అనూహ్యంగా భాజపాలోకి వెళ్లి పోటీలో నిలిచారు. కాంగ్రెస్‌లో చేరిన కావ్యకు పోటీచేసే అవకాశం దక్కడంతో ఇక భారాస నుంచి ఎవరిని పోటీలో నిలుపుతారనేది తీవ్ర చర్చనీయాంశంగా మారింది. స్టేషన్‌ఘన్‌పూర్‌ మాజీ ఎమ్మెల్యే రాజయ్య మళ్లీ భారాసలో చేరుతున్నారని ప్రచారమూ జరిగింది. ఆచితూచి, అన్ని కోణాల్లో ఆలోచించిన గులాబీ అధినేత కేసీఆర్‌ చివరకు వివాదరహితుడిగా పేరున్న జడ్పీ ఛైర్మన్‌ డాక్టర్‌ సుధీర్‌కుమార్‌ను పార్టీ అభ్యర్థిగా ప్రకటించారు.

ఇద్దరూ వైద్యులే...

వరంగల్‌ భారాస అభ్యర్థిగా ఖరారైన డాక్టర్‌ మారేపల్లి సుధీర్‌కుమార్‌ ఆయుర్వేద వైద్యుడు.. కాంగ్రెస్‌ అభ్యర్థిగా బరిలో నిలిచిన డాక్టర్‌ కడియం కావ్య సైతం వైద్యురాలే.. ఎంబీబీఎస్‌, ఎండీ పాథాలజీ పూర్తి చేసి కొన్నాళ్లు వర్ధన్నపేటలో అనంతరం హనుమకొండలోని ప్రతిమ రిలీఫ్‌ మెడికల్‌ కళాశాలలో వైద్యురాలిగా పనిచేసి రాజకీయాల్లోకి ప్రవేశించారు. 

గెలుపు ఎవరిదో..!

కాంగ్రెస్‌ అభ్యర్థి కడియం కావ్యకు గతంలో ఎలాంటి రాజకీయ అనుభవం లేదు. తండ్రి శ్రీహరికి శాసనసభ ఎన్నికల్లో మద్దతుగా నిలిచి ప్రచారం చేస్తూ ఆయన్ను గెలిపించడంలో కీలకపాత్ర పోషించారు. ఇక భాజపా అభ్యర్థి అరూరి రమేశ్‌ గతంలో రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొంది ఇప్పుడు లోక్‌సభకు పోటీచేసేందుకు కమలం నుంచి అవకాశం దక్కించుకున్నారు. భారాస అభ్యర్థి పోటీ చేయడం ఇదే ప్రథమం.. ఇలా మూడు ప్రధాన పార్టీల అభ్యర్థులు తొలిసారి బరిలో నిలుస్తూ ఎంపీ స్థానంపై గురి పెట్టారు.

 • ఇప్పటివరకూ గెలిచిన అభ్యర్థులు వీరే!
 • 1952 - పెండ్యాల రాఘవరావు (పీడీఎఫ్‌)
 • 1957- సాదత్ ఆలీ ఖాన్(కాంగ్రెస్‌)
 • 1962- బకర్ అలీ మిర్జా(కాంగ్రెస్‌)
 • 1967- రామసహాయం సురేందర్ రెడ్డి(కాంగ్రెస్‌)
 • 1971-ఎస్.బి.గిరి(తెలంగాణా ప్రజా సమితి)
 • 1977-జి.మల్లికార్జునరావు    (కాంగ్రెస్‌)
 • 1980-కమాలుద్దీన్ అహ్మద్ (కాంగ్రెస్‌)
 • 1984- డా. టి. కల్పనాదేవి (తెదేపా)
 • 1989-రామసహాయం సురేందర్ రెడ్డి (కాంగ్రెస్‌)
 • 1991-రామసహాయం సురేందర్ రెడ్డి(కాంగ్రెస్‌)
 • 1996- చందూలాల్ అజ్మీరా(తెదేపా)
 • 1998-చందూలాల్ అజ్మీరా(తెదేపా)
 • 1999- బోడకుంటి వెంకటేశ్వర్లు(తెదేపా)
 • 2004- ధరావత్ రవీందర్ నాయిక్(తెరాస)
 • 2009-సిరిసిల్ల రాజయ్య(కాంగ్రెస్‌)
 • 2014-కడియ శ్రీహరి(తెరాస),
 • 2019 - పసునూరి దయాకర్‌ (తెరాస)
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img