health: ఎదిగే పిల్లలకు ఈ ఆహారం తప్పనిసరి!

పసిపిల్లల బొజ్జ నింపడం సులువే కానీ పోషకాలను అందించడమే అసలైన టాస్క్‌.

Published : 27 May 2022 01:41 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: పసిపిల్లల కడుపు నింపడం సులువే. కానీ పోషకాలను అందించడమే అసలైన టాస్క్‌. పిల్లలు ఎదిగే క్రమంలో మంచి ఆహారం అందించాలి. అది వారి శారీరక ఎదుగుదలతో పాటు మానసిక వికాసానికి ఎంతగానో తోడ్పడుతుంది. పిల్లల ఆహార విషయంలో చాలామంది తల్లులు ఆందోళన చెందుతుంటారు. దానికి కారణాలూ లేకపోలేదు. పిల్లలకు ఉన్న ఏకైక ఆయుధం వారి ఏడుపే. వాళ్లు ఏం చెప్పాలన్నా ఏడుపు ద్వారానే తెలియజేస్తారు. ఆకలి వేసినా, ఆరోగ్యం బాలేక పోయినా ఇతరత్రా సమస్య ఏది ఉన్నప్పటికీ పిల్లలు ఏడుస్తారు. వారి ఏడుపు వెనుక ఉన్న కారణాన్ని కనుక్కోవడం చాలా ముఖ్యం. దానికి తోడు వారికి ఆకలి అవుతోందనే సంకేతం రాగానే ఏదో ఒకటి తినిపించి కడుపు నింపేయకూడదు. మంచి పోషకాలు ఉన్న ఆహారాన్ని తినిపిస్తే ఆరోగ్యంగా, ఆనందంగానూ ఉంటారు. 
 మరి ఆ ఆహర పదార్థాలేమిటో తెలుసుకుందామా! 
 

పెరుగు:

పిల్లల ఎదుగుదలలో పెరుగు మంచి పాత్ర పోషిస్తుందనే చెప్పాలి. ఇందులో విటమిన్స్‌, కాల్షియం, ప్రొబయోటిక్స్‌, ప్రొటీన్స్‌ అధికంగా ఉంటాయి. జీర్ణక్రియ మెరుగుపరచడానికి ఇది ఎంతగానో దోహదపడుతుంది. ఎముకలను, దంతాలను బలంగా చేస్తుంది. చల్లదనాన్ని ఇస్తుంది. పిల్లలకు అన్నంలో కలిపి అయినా పెరుగు తినిపించవచ్చు. లేదా మజ్జిగ రూపంలో అయినా మంచిదే! ఇంట్లో చేసిన పెరుగుకు ప్రాధాన్యమిస్తే మంచి ఫలితాలుంటాయి. 

పప్పు- అన్నం:

సంప్రదాయక వంటకాల్లో పప్పు ముందు వరుసలో ఉంటుంది. ఇందులో ఎన్నో పోషకాలుంటాయి. పప్పు, బియ్యంతో కలిపి వండితే చాలా రుచిగా ఉంటుంది. దీంతో పిల్లలు తినడానికి ఇష్టపడతారు. పిల్లలకు మంచి పోషకాలు అందించే సమతుల్యమైన ఆహారమిది! ఇందులో ఉండే విటమిన్స్‌, మినరల్స్‌, కార్బోహైడ్రేట్స్‌ పిల్లలను ఆనందంగా ఉండేందుకు దోహదపడతాయి. 

ఫ్రూట్‌ మిల్క్‌షేక్‌:

సీజనల్‌గా దొరికే ఫలాలను పిల్లలకు తప్పక తినిపించాలి. చక్కెర లేకుండా తాజా పండ్లను రసాల రూపంలో పిల్లలకు అందిస్తే మంచి ఫలితాలుంటాయి. వీటిల్లో ఉండే యాంటీఆక్సిడెంట్లు, ఫైటోన్యూట్రియంట్స్‌ ఎదిగే పిల్లల మానసిక వికాసానికి ఎంతగానో తోడ్పడతాయి.  

కొబ్బరి నీళ్లు:

వేసవిలో కొబ్బరి నీళ్లు మంచి ఔషధంలా పని చేస్తాయి. శరీరాన్ని డీహైడ్రేట్‌ కాకుండా కాపాడుతాయి. ఈ నీటికి నిమ్మరసం జోడించి తీసుకోవచ్చు. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. 
నెయ్యి: నేతి ముద్దలు పిల్లలకు ఎంత మురిపెంగా తినిపిస్తుందో తల్లి కదా! ఈ నెయ్యి పిల్లలకు మంచి న్యూట్రియంట్‌ ఉన్న ఆహారంగా పనిచేస్తుంది. ఇందులో ఉండే విటమిన్స్‌, యాంటీఆక్సిడెంట్స్‌, మినరల్స్‌, ఎషెన్సియల్‌ అమినో ఆమ్లాలు పిల్లల శారీరక, మానసిక వికాసానికి తోడ్పడతాయి. 

సూప్స్‌:

వివిధ రకాల కూరగాయలు, పండ్లుతో సూప్‌లు చేసి పిల్లలకు తాగించాలి. ద్రవరూపంలో ఉంటాయి కాబట్టి పిల్లలకు సులభంగా అందించవచ్చు. అవి వారి రోగనిరోధక శక్తి పెంపొందించడంలో దోహదపడతాయి. 


అయితే అన్ని రకాల కూరగాయలను, పండ్లను పిల్లలు ఇష్టపడకపోవచ్చు. ముందు కొంచెం కొంచెంగా పిల్లలకు తినిపించండి. అది వారికి నచ్చుతుందా లేదా! సరిగా జీర్ణమవుతుందా! అనేది తెలుసుకోవాలి. వాళ్లు ఇష్టంగా తినే వాటినే తినిపించాలి. అలా అని తినడం లేదని మానేయడం సరికాదు. వారికి ఏ విధంగా చేస్తే నచ్చుతుందో అదే విధంగా చేసి వారికి అందించాలి.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని