KRMB: తెలంగాణ అభ్యర్థన.. జలశక్తి శాఖ కీలక సమావేశం వాయిదా

నాగార్జునసాగర్‌, శ్రీశైలం జలాశయాలు వాటికి అనుబంధంగా ఉన్న ఉమ్మడి నిర్మాణాలను కృష్ణానదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ)కు అప్పగించే ప్రక్రియను కేంద్ర జలశక్తి శాఖ ప్రారంభించనుంది.

Updated : 02 Dec 2023 13:53 IST

దిల్లీ: నాగార్జునసాగర్ వద్ద చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి నేతృత్వంలో ఏర్పాటు చేసిన అత్యవసర సమావేశం వాయిదా పడింది. ఆదివారం ఎన్నికల కౌంటింగ్‌ ఉన్నందున తెలంగాణ అభ్యర్థన మేరకు సమావేశాన్ని ఈ నెల 6కి వాయిదా వేసింది. సాగర్‌, శ్రీశైలం ప్రాజెక్టులకు సంబంధించి తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న వివాదాలపై ఈ నెల 6న మరోసారి చర్చించనున్నారు.

సాగర్ ప్రాజెక్టుపైకి సీఆర్‌పీఎఫ్‌ బలగాలు

అప్పటివరకు నీటి విడుదల నిలిపివేత

కేంద్ర జలశక్తి శాఖ కార్యాలయంలో జరిగిన ఇవాళ్టి సమావేశానికి తెలుగు రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు (సీఎస్‌లు), సీఆర్‌పీఎఫ్‌, సీఐఎస్‌ఎఫ్‌ డైరెక్టర్‌ జనరల్‌లు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా హాజరయ్యారు. సీడబ్ల్యూసీ, కృష్ణా బోర్డు ఛైర్మన్‌లు నేరుగా పాల్గొన్నారు. తమ నీటి అవసరాలు, ప్రాజెక్టుల వద్ద పరిస్థితిని ఏపీ అధికారులు వివరించారు. ఏపీ పంపిన ఇండెంట్‌పై ఈ నెల 4న నిర్ణయం తీసుకోవాలని కృష్ణానదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ)ను జలశక్తి శాఖ ఆదేశించింది. అప్పటివరకు సాగర్‌ నుంచి నీటి విడుదల నిలిపివేయాలని ఏపీకి సూచించింది.

సాగర్ వ్యవహారం.. ఇరురాష్ట్రాల పోటాపోటీ కేసులు

బోర్డుకు అప్పగించే యోచనలో..!

అలాగే నాగార్జునసాగర్‌, శ్రీశైలం జలాశయాలు వాటికి అనుబంధంగా ఉన్న ఉమ్మడి నిర్మాణాలను కృష్ణానదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ)కు అప్పగించే ప్రక్రియను కేంద్ర జలశక్తి శాఖ ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. గత మూడు రోజులుగా నాగార్జునసాగర్ వద్ద చోటు చేసుకున్న పరిణామాలను కేంద్ర ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. కేఆర్‌ఎంబీ పర్యవేక్షణలో ప్రాజెక్టులను సీఆర్‌పీఎఫ్‌, సీఐఎస్‌ఎఫ్‌ భద్రత పరిధిలోకి రెండు జలాశయాలను తీసుకురావాలని యోచన చేస్తోంది. జలాశయాల నిర్వహణ మొత్తం కేఆర్ఎంబీకే అప్పగించాలని కేంద్రం ఇప్పటికే కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ అంశాలపై సమావేశంలో చర్చించినట్లు సమాచారం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని