Lasya Nanditha: లాస్య నందిత మృతి పట్ల నేతల సంతాపం

కంటోన్మెంట్‌ ఎమ్మెల్యే లాస్య నందిత మృతి పట్ల ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి, శ్రీధర్‌బాబు, జూపల్లి కృష్ణారావు సంతాపం ప్రకటించారు.

Updated : 23 Feb 2024 10:12 IST

హైదరాబాద్‌: కంటోన్మెంట్‌ భారాస ఎమ్మెల్యే లాస్య నందిత మృతి పట్ల ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి, శ్రీధర్‌బాబు, జూపల్లి కృష్ణారావు సంతాపం ప్రకటించారు. ఆమె కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. తెదేపా అధినత చంద్రబాబునాయుడు ఆమె మృతి పట్ల సంతాపం తెలిపారు. ఎమ్మెల్యే లాస్య నందిత కుటుంబసభ్యులను మాజీ మంత్రి హరీశ్‌రావు పరామర్శించారు. పటాన్‌చెరు ఆస్పత్రికి వెళ్లి కుటుంబసభ్యులను ఓదార్చారు.

తండ్రి సాయన్న చనిపోయిన ఏడాదిలోపే లాస్య నందిత మృతి చెందడం దురదృష్టకరం. ఆమె ముందు ఉజ్వల భవిష్యత్తు ఉండగా, విధి మరొకటి తలచింది. లాస్య నందిత కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి. ఆమె శ్రేయోభిలాషులు, స్నేహితుల నుంచి వస్తున్న ప్రేమ, మద్దతు ఆ కుటుంబానికి బలాన్ని చేకూర్చాలి. - తెదేపా అధినేత చంద్రబాబు

వారం క్రితమే లాస్యను కలిసి మాట్లాడాం. ఇంతలోనే ఇలాంటి షాకింగ్‌, దిగ్ర్భాంతికర వార్త వినాల్సి వచ్చింది. ఇలాంటి కష్ట సమయాల్లో లాస్య కుటుంబ సభ్యులకు, మిత్రులకు నా ప్రగాఢ సానుభూతి. - భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌

చిన్న వయసులోనే ఎమ్మెల్యేగా గెలుపొందిన లాస్య మృతి ఎంతో బాధ కలిగించింది. ఆమె కుటుంబసభ్యులకు ఆ భగవంతుడు మనోధైర్యం కలిగించాలి. - శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి

చిన్న వయసులో ఎమ్మెల్యేగా ఎన్నికై.. తన తండ్రి, దివంగత మాజీ ఎమ్మెల్యే సాయన్న ఆశయాలను ముందుకు తీసుకుపోతూ అందరి మన్ననలు పొందిన నందిత అకాల మృతి తీవ్ర బాధాకరం. ఏడాది క్రితం సాయన్న మరణం, ఇప్పుడు ఆయన కూతురు మృతి చెందడం విచారకరం. - రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర

లాస్య నందిత అకాల మరణం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. ఆమె కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి. లాస్య.. గొప్ప భవిష్యత్ ఉన్న యువ నాయకురాలు. ప్రజల మద్దతుతో ఎన్నికై ఇలా అకాల మరణం చెందడం ఎంతో బాధాకరం. ఆమె ఆత్మకు శాంతి కలగాలి. - మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి

లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో మృతి చెందారన్న వార్త తెలుసుకుని తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాను. ఆమె కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి - మాజీ మంత్రి తలసాని

లాస్య నందిత మరణం కంటోన్మెంట్‌ ప్రజలకు, భారాస పార్టీకి తీరని లోటు - మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని