Video Morphing Case: అమిత్‌షా వీడియో మార్ఫింగ్‌ కేసు.. పలువురు కాంగ్రెస్‌ నాయకులకు నోటీసులు

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా వీడియో మార్ఫింగ్‌ కేసులో పలువురు కాంగ్రెస్‌ నాయకులు, పార్టీ సోషల్‌ మీడియా విభాగానికి దిల్లీ పోలీసులు నోటీసులు జారీ చేశారు.

Updated : 29 Apr 2024 17:04 IST

హైదరాబాద్‌: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా వీడియో మార్ఫింగ్‌ కేసులో పలువురు తెలంగాణ కాంగ్రెస్‌ నాయకులు, సోషల్‌ మీడియా విభాగానికి దిల్లీ పోలీసులు నోటీసులు జారీ చేశారు. హైదరాబాద్‌లోని గాంధీభవన్‌కు వచ్చి.. కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి అస్లాం తస్మీన్‌, పార్టీ సోషల్‌ మీడియా ఇన్‌ఛార్జి మన్నె సతీశ్‌, ఆ పార్టీకి చెందిన నవీన్‌, శివకుమార్‌లకు నోటీసులు ఇచ్చారు. ఇదే కేసులో సీఎం, పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న రేవంత్‌రెడ్డికి కూడా సమన్లు జారీ చేసినట్లు తెలుస్తోంది. మే 1న ఫోన్‌ తీసుకొని విచారణకు హాజరుకావాలని చెప్పినట్లు సమాచారం. అమిత్‌షా మార్ఫింగ్‌ వీడియోను రేవంత్‌ ‘ఎక్స్‌’లో పోస్టు చేశారని దిల్లీ పోలీసులు ఆరోపిస్తున్నారు.

కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా పేరిట వైరలవుతున్న కొన్ని నకిలీ వీడియోలపై దిల్లీ పోలీసులు ఆదివారం కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన దిల్లీ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అమిత్‌ షా ఈ నెల 23న తెలంగాణలో జరిగిన విజయ సంకల్ప సభలో పాల్గొన్నారు. అక్కడ మాట్లాడుతూ ‘‘భాజపా అధికారంలోకి వస్తే రాజ్యాంగ విరుద్ధమైన ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేస్తాం. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు చెందిన ఆ హక్కులను తిరిగి వారికే ఇచ్చేస్తాం’’ అని వ్యాఖ్యానించారు. దీన్ని కొంతమంది వక్రీకరించి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల రిజర్వేషన్‌ను రద్దు చేస్తామని షా చెబుతున్నట్లుగా ఎడిట్‌ చేశారని భాజపా ఆరోపిస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని