Gaddar: పెత్తందారీ వ్యవస్థపై ధిక్కార స్వరం... గద్దర్‌

గద్దర్‌ పాట పాడితే వేలాది గుండెలు చైతన్యవంతమవుతాయి. నేను సైతం అంటూ ప్రజాయుద్ధక్షేత్రంలోకి వస్తారు. అందుకనే ఆయనను ప్రజాయుద్ధనౌక అని వీరావేశంతో పిలుస్తారు.

Updated : 06 Aug 2023 17:01 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: సమాజంలోని అన్ని వర్గాలను మేలుకొలిపేది పాట. ఆ పాటనే సామాన్యులకు సైతం అర్థమయ్యేలా చెప్పి.. చైతన్యవంతులను చేసేది ప్రజాగాయకులు. ఒక్క అక్షరం ముక్క లక్ష మెదళ్లకు కదలిక అన్న రీతిలో ఒక్క పదం అంకుశమై పెత్తందార్ల ఆధిపత్యాన్ని ప్రశ్నించింది. ఆ పదాన్ని గేయరూపంలో పాడి కోట్లాది పీడిత ప్రజల జీవితాల్లో కదలిక తెచ్చినవారు గద్దర్‌. ఆయన పాట పాడితే వేలాది గుండెలు చైతన్యవంతమవుతాయి. నేను సైతం అంటూ ప్రజాయుద్ధక్షేత్రంలోకి వస్తాయయి. అందుకనే ఆయనను ‘ప్రజాయుద్ధనౌక’ అని వీరావేశంతో పిలుస్తారు.

ఆయన గొంతు కోసమే వేచి ఉండేవారు..

ఆయన సభలకు వస్తున్నారంటే చాలు వేలాది ప్రజలు ఎన్నిగంటలయినా వేచి ఉండేవారు. ఆయన గొంతు విప్పితే చాలు సమ్మోహనం. కోట్ల మంది పేదల కష్టాలను, నష్టాలను పాట రూపంలో వినిపించేవాడు. ఒక విధంగా ఆయన పాటల ద్వారానే సామాన్యుల భాష వాడుక భాషగా మారిందని చెప్పవచ్చు. పాటతో పాటు ఆలాపన, నృత్యం, ప్రసంగం ఉంటాయి. ఇలాంటి విభిన్నమైన ప్రక్రియలు ఆయనకే ప్రత్యేకం.

ప్రజా గాయకుడు గద్దర్‌ కన్నుమూత.. మూగబోయిన ఉద్యమ గళం

కర్ర పట్టి, ఎర్రజెండా చేతపట్టి..

కర్ర చేబూని ఎర్రజెండాతో ఎల్లప్పుడూ కనిపించే ఆయన ప్రజా యుద్ధక్షేత్రంలో నిత్యం కనిపించేవారు. కారంచేడు, చుండూరుల్లో జరిగిన దళితుల హత్యాకాండలో పాటలతో అమరవీరులకు వందనం అర్పించారు. మలిదశ తెలంగాణ ఉద్యమంలో ఆయన గానం చేసిన పాటలు ఉద్యమ స్ఫూర్తిని రగిలించాయి. గద్దర్‌ బాటలో తెలంగాణలోనే కాదు అనేక రాష్ట్రాల్లో ప్రజాగాయకులు ఆవిర్భవించారు. తమ పాటలతో నిత్యం ప్రజలకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు.

వెన్నులో తూటా బాధిస్తున్నా కదిలే పాటగా మారి

1997లో గద్దర్‌పై దాడి జరిగింది. వెన్నులో బుల్లెట్‌ బాధపెడుతున్నా అణగారిన గొంతుకల కోసం పాటను పల్లెపల్లెకు తీసుకెళ్లారు. తూటాలు దిగినా ఆయన వెనుకంజ వేయలేదు. తుదిశ్వాస వరకు గొంతులేని వారి కోసం గొంతుకగా మారారు. గళమెత్తారు.. ఆడారు.. పాడారు.. వారి జీవితాల్లో వెలుగులు నింపేందుకు అహరహం పోరాటం చేశాడు.

ఆయన పాటలు అగ్నికణాలు

గద్దర్‌ గాయకుడే కాదు. మంచి రచయిత కూడా. ప్రజల వేదనలను పాటలుగా రూపొందించారు. ‘‘సిరిమల్లె సెట్టుకింద లచ్చుమమ్మో’’ పాటలో తన తల్లి పడుతున్న బాధలను పాటగా మలిచారు. ఇంకా అనేక పాటలు ప్రజల పక్షాన నిలిచాయి. దోపిడీని ప్రశ్నించాయి. మలిదశ తెలంగాణ ఉద్యమంలో ఆయన పాడిన పాటలు నిత్యస్మరణగా మారాయి. పీడిత ప్రజల వేదనను చూసిన కాలమే కన్నబిడ్డ గద్దర్‌.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని