AP Sarpanches: పేరుకే ప్రెసిడెంటు! పైసా రాదు.. పెత్తనం లేదు!

ప్రెసిడెంట్‌ (సర్పంచి) అనే పిలుపునకు గ్రామాల్లో ఒకప్పుడు చాలా విలువ ఉండేది. ఎమ్మెల్యే, ఎంపీ స్థాయి వ్యక్తులైనా వారికి అంతటి ప్రాధాన్యతనిచ్చేవారు.

Published : 15 Jun 2023 09:30 IST

 ఎందుకొచ్చిన పదవులంటున్న సర్పంచులు
అధికార పార్టీకే కొమ్ముకాస్తున్న అధికారులు

పాలకొల్లు, న్యూస్‌టుడే:   ప్రెసిడెంట్‌ (సర్పంచి) అనే పిలుపునకు గ్రామాల్లో ఒకప్పుడు చాలా విలువ ఉండేది. ఎమ్మెల్యే, ఎంపీ స్థాయి వ్యక్తులైనా వారికి అంతటి ప్రాధాన్యతనిచ్చేవారు. కుటిల రాజకీయాలు తెరపైకి వచ్చాక ఆ పదవికున్న విలువ తగ్గుతూ వచ్చింది. ప్రస్తుత ప్రభుత్వ హయాంలో పూర్తిగా దిగజారిందని సర్పంచుల ఛాంబర్‌ జిల్లా అధ్యక్షుడు కడలి గోపాలరావు వాపోయారు. గ్రామాల్లో చిన్న చిన్న పనులకు కూడా నోరెళ్ల్లబెట్టాల్సి వస్తోందని ఎవరేం అడుగుతారోనని సమాధానం చెప్పలేక సర్పంచులు పంచాయతీలకు రావడమే తగ్గించేశారు. ఇదే పరిస్థితి కొనసాగితే భవిష్యత్తులో సర్పంచి అయ్యేందుకు ఎవరూ ముందుకురాని రోజులు రావొచ్చని కాజపడమరకు చెందిన మాజీ సర్పంచి మాతా రత్నంరాజు పేర్కొన్నారు. 14, 15వ ఆర్థిక సంఘం నిధులు సైతం ప్రభుత్వం ఇష్టానుసారం వినియోగించుకుందిగాని పల్లెల్లో స్థానిక అవసరాలకు సర్పంచులు వెచ్చించే అవకాశం ఇవ్వడం లేదు. దీంతో ఇంటి పన్నులు, కొబ్బరిచెట్ల వేలం పాటల ఆదాయంపై ఆయా పంచాయతీలు ఆధారపడుతున్నాయి. మైనర్‌ పంచాయతీల్లో అదికూడా లేక చతికిలపడుతున్నాయి.


* ఈయన యలమంచిలి మండలం ఇలపకుర్రు సర్పంచి కొండేటి జీవరత్నం. పేరుకు ప్రెసిడెంటేగాని పెత్తనం మరొకరిది. పదవి చేపట్టి రెండున్నరేళ్లు గడుస్తున్నా గ్రామంలో చిన్నపని చేసిన దాఖలాలు లేవు. గ్రామంలో ఏ మూల చూసినా అసంపూర్తి భవనాలు ఏన్నో సమస్యలు. ఆయా సమస్యలపై ప్రతి సోమవారం నిర్వహించే స్పందనలో కలెక్టర్‌కు ఇప్పటికి పదిసార్లు పైబడి ఫిర్యాదు చేశారు. ఏ ఒక్కదానికీ సరైన స్పందన లభించలేదని జీవరత్నం వాపోతున్నారు.


* నరసాపురం మండలం మల్లవరంలో ఎస్సీ శ్మశానవాటికలో స్థల సమస్య తలెత్తడంతో పరిష్కారం నిమిత్తం స్థానిక సర్పంచి ఎస్‌.సుజాత పంచాయతీ పాలకవర్గం కలిసి ఒక తీర్మానం చేశారు. ఇది జరిగిన రెండు రోజుల్లోనే పంచాయతీ తీర్మానానికి వ్యతిరేకంగా కొందరు వ్యవహరించగా వారిపై సబ్‌కలెక్టర్‌ నుంచి ఇతర అధికారులకు ఫిర్యాదు చేశారు. ఏ ఒక్క అధికారీ స్పందించలేదు.


ప్రతిపక్ష సర్పంచులైతే

వైకాపా ప్రభుత్వం వచ్చాక సర్పంచుల పాత్ర గ్రామాల్లో తగ్గిపోగా ప్రతిపక్ష సర్పంచుల పరిస్థితి మరీ దయనీయంగా ఉంది. పెనుమంట్ర మండలంలో ఇద్దరు ప్రతిపక్ష సర్పంచులు ఉండగా పూర్తయిన భవనాలను సైతం ప్రారంభించలేని దుస్థితిలో ఒకరు, అభివృద్ధికి సహకరిస్తామని కోరినా కనీసం ప్రతిపాదనలు చేయడానికి కూడా అధికారులు ముందుకురాక మరొకరు ఇబ్బంది పడుతున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.


ఆంక్షల మధ్య యంత్రాంగం

ఉన్నత చదువులు పూర్తిచేసుకుని ప్రజల సేవ కోసం వచ్చిన ఉన్నతాధికారుల నుంచి క్షేత్రస్థాయిలో పనిచేసే మండల స్థాయి అధికారుల వరకు అంతా ఆంక్షల మధ్య చిక్కుకుపోతున్నారు. అసలు విధులేంటి బాధ్యతలేంటి అనేదానికంటే అధికార పార్టీ నాయకులను ప్రసన్నం చేసుకోవడానికి ప్రాధాన్యతనివ్వడం సమస్యలకు దారితీస్తుంది. ఈ పరిస్థితిపై ‘న్యూస్‌టుడే’ డీపీవో మల్లికార్జునరావును సంప్రదించగా ఆయన స్పందించలేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు