ఎన్నికల వేళ.. సైబర్‌ వల

లోక్‌సభ ఎన్నికల వేళ సర్కారు పథకాల బూచి చూపిస్తూ సైబర్‌ నేరగాళ్లు డబ్బులు కొట్టేస్తున్నారు.

Updated : 18 Mar 2024 04:53 IST

ఈనాడు- హైదరాబాద్‌ : లోక్‌సభ ఎన్నికల వేళ సర్కారు పథకాల బూచి చూపిస్తూ సైబర్‌ నేరగాళ్లు డబ్బులు కొట్టేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ‘జన్‌ధన్‌ యోజన’ ద్వారా ప్రజలందరి బ్యాంకు ఖాతాల్లో రూ.5 వేల చొప్పున జమ చేస్తోందంటూ ప్రచారం చేస్తూ.. సామాజిక మాధ్యమాలే వేదికగా నకిలీ పోస్టులు, లింకులు పంపిస్తూ బోల్తా కొట్టిస్తున్నారు. పదుల సంఖ్యలో బాధితులు డబ్బు పోగొట్టుకున్నట్లు తెలిపారు.

స్క్రాచ్‌ చేయించి స్కాన్‌

ఇన్‌స్టాగ్రామ్‌, ఫేస్‌బుక్‌లో పోస్టులు, రీల్స్‌ తరహాలో కొన్ని ప్రకటనలు వస్తుంటాయి. వీటిలో కొన్ని సైబర్‌ నేరగాళ్లు రూపొందించినవి. డబ్బు వస్తుందని ఆశపడి క్లిక్‌ చేస్తే నేరుగా నేరగాళ్లు రూపొందించిన వెబ్‌సైట్‌లోకి తీసుకెళ్తుంది. ఇది నరేంద్ర మోదీ చిత్రంతో అచ్చం ప్రభుత్వ వెబ్‌సైట్‌లా ఉంటుంది. అక్కడ కనిపించే కార్డును స్క్రాచ్‌ చేయాలని సూచిస్తారు. అలా చేస్తే రూ.5 వేలు లేదా అంతకంటే పెద్ద మొత్తాల్లో డబ్బు వచ్చినట్లు చూపించి.. ఆ సొమ్ము పొందడానికి క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌ చేయాలని సూచిస్తారు. స్కాన్‌ చేస్తే యూపీఐ పిన్‌ అడుగుతుంది. పొరపాటున పిన్‌ నమోదు చేస్తే ఖాతాలో డబ్బు ఖాళీ అవుతుంది. కొందరు ఇలాంటి తప్పుడు ప్రకటనల్ని నమ్మి రూ.వేలల్లో డబ్బు కోల్పోయారు. ఈ తరహా జన్‌ధన్‌ యోజన పేరుతో వచ్చే లింకుల్ని క్లిక్‌ చేస్తే అనుమతి లేకుండానే యాప్‌లు డౌన్‌లోడ్‌ అవుతున్నట్లు పోలీసులు చెబుతున్నారు. ఫలితంగా ఫోన్లలోని బ్యాంకు ఖాతాల రహస్య, వ్యక్తిగత సమాచారం ఎప్పటికప్పుడు నేరగాళ్లకు చేరడం లేదా ఫోన్‌ను పూర్తిగా వారి ఆధీనంలోకి వెళ్తాయి.

ట్రెండుకు తగ్గట్లు మోసాలు..!

సైబర్‌ నేరగాళ్లు కొంతకాలంగా తాజా పరిస్థితులు.. వివిధ రాష్ట్రాల్లో పరిణామాలకు తగ్గట్లు మోసాలు చేస్తున్నారు. గతంలో క్రెడిట్‌, డెబిట్‌ కార్డు, కాల్‌ సెంటర్‌ మోసాలు ఎక్కువగా నమోదయ్యేవి. ఇప్పుడు పథకాల పేరుతో మోసగిస్తున్నారు. ప్రజల్లో విస్తృతం ప్రచారంలో ఉండే అంశాలను ఎంపిక చేసుకుని మోసాలు చేస్తున్నారు.

ఇవీ జాగ్రత్తలు

  • కేంద్ర ప్రభుత్వం బ్యాంకు ఖాతాల్లో డబ్బు జమ చేస్తోందని లింకు క్లిక్‌ చేయాలని వచ్చే ప్రకటనల్ని ఎట్టి పరిస్థితుల్లో నమ్మొద్దు.
  • ప్రభుత్వం ఒకవేళ నగదు ఇవ్వాలంటే నిర్దిష్ట పద్ధతిలో దరఖాస్తులు స్వీకరించి అర్హులను ఎంపిక చేస్తుంది.
  • క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌ చేసి.. యూపీఐ పిన్‌ నమోదు చేయాల్సి వస్తే మనం డబ్బు ఇతరులకు పంపిస్తున్నట్లు.
  • క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌ చేస్తే డబ్బు ఖాతాలోకి రాదు.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని