జగనన్నా.. దాహం తీర్చవయ్యా!

వేసవి కాలం వచ్చింది. ఎండలు మండిపోతున్నాయి. నీటి ఎద్దడి ఏర్పడుతోంది. అధికారులు గుక్కెడు నీరు కూడా ఇవ్వలేకపోతున్నారు. దాహం తీర్చుకోవడానికి ప్రజలు నానాఇబ్బందులు పడుతున్నారు. ఇదీ పట్టణంలోని పలు ప్రాంతాల్లోని పరిస్థితి.

Updated : 19 Apr 2024 05:13 IST

కావలి, న్యూస్‌టుడే

వేసవి కాలం వచ్చింది. ఎండలు మండిపోతున్నాయి. నీటి ఎద్దడి ఏర్పడుతోంది. అధికారులు గుక్కెడు నీరు కూడా ఇవ్వలేకపోతున్నారు. దాహం తీర్చుకోవడానికి ప్రజలు నానాఇబ్బందులు పడుతున్నారు. ఇదీ పట్టణంలోని పలు ప్రాంతాల్లోని పరిస్థితి. అందునా 17వ వార్డులో  పదిహేను రోజులకు ఒకసారి పురపాలక సంఘం తరఫున నీళ్ల ట్యాంకర్లు పంపిస్తున్నారు. దీంతో వాడుక నీటికి కూడా పడరాని పాట్లు పడుతున్నారు. మధ్యలో మరో రోజు కావాల్సి ఉంటే కొనుగోలు చేయక తప్పడం లేదని ఆవేదన చెందుతున్నారు. ఈక్రమంలో సరైన సదుపాయాల్లేక ఇంకా అక్కడ ఇళ్లు పూర్తిగా నిర్మించుకోక, అలాగే వదిలేస్తున్నారు. ‌్ర ఈ వార్డుకు చెంతనే పురపాలక సంఘానికి చెందిన ప్రజలందరికీ నీరు అందించే సమ్మర్‌ స్టోరేజీ ట్యాంక్‌ ఉంది. అయినా అక్కడి ప్రజలు మాత్రం తాగునీటి పైపులైన్ల వ్యవస్థ సరిగా లేక అవస్థలు పడుతున్నారు. నెలకు రెండు సార్లు  వచ్చే ట్యాంకర్ల కోసం ఇంటింటా డ్రమ్ములు కొనుగోలు చేశారు. అమృత్‌ పథకంలో ఈ ప్రాంతానికి నీటి సరఫరా మెరుగుపడుతుందంటున్నారు. మురుగుకాలువలు అధ్వానంగా తయారయ్యాయి. కొన్ని ప్రాంతాల్లో అంతర్గత రహదారులు మాత్రమే నిర్మించి వదిలేశారు. మురుగునీరు పోయేందుకు వీల్లేకపోవడంతో దోమల బెడద తీవ్రంగా ఉందని వాపోతున్నారు. గడపగడపకి మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి సందర్శించగా సమస్యలు చెప్పుకున్నారు. అయినా మెరుగుపడలేదు.


నీటి సమస్య నిజమే

-సాయిరాం, డీఈ, పురపాలక సంఘం

నీటి ఎద్దడి నెలకొన్న మాట నిజమే. రోజు మార్చి రోజైనా ట్యాంకరు పంపాలని కోరుతున్నారు. ఈ సమస్యను పరిష్కరించేలా ప్రయత్నిస్తాం. ఇతర సమస్యల  పరిష్కారానికి చర్యలు తీసుకుంటాం.


నీరు రావడం లేదయ్యా

-బాలమ్మ

మా ప్రాంతంలో నీటి సరఫరా సరిగా లేదు. పైపులైన్ల ద్వారా ఇవ్వాలని చాలా రోజులుగా వేడుకుంటున్నాం. అలా జరగడం లేదు. క్రిస్టియన్‌ ఛారిటీస్‌ వారు వేసిన బోరు నీరు వాడుకుంటున్నాం. ఈసమస్యను ఇప్పటికైనా పరిష్కరించాలి.


15 రోజులకోసారా

-నారాయణమ్మ

పదిహేను రోజులకు ఓసారి ట్యాంకరు పంపడం దారుణం. కొన్ని వీధుల్లో బోర్లు కూడా లేవు. పురపాలక సంఘం వారు కనికరించాలి. ఇప్పటికైనా మా సమస్యను పరిష్కరించేలా చూడాలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని