ఆరున్నరేళ్ల పరుగు.. 50 కోట్ల ప్రయాణికులు

హైదరాబాద్‌ మెట్రోరైలు 50 కోట్ల ప్రయాణికుల మైలురాయిని చేరుకుంది.

Updated : 03 May 2024 05:26 IST

ఈనాడు, హైదరాబాద్‌: హైదరాబాద్‌ మెట్రోరైలు 50 కోట్ల ప్రయాణికుల మైలురాయిని చేరుకుంది. ప్రస్తుతం రోజూ సగటున 5 లక్షల ప్రయాణికులు మెట్రోలో గమ్యస్థానం చేరుతున్నారు. చారిత్రకమైలుని చేరుకున్న దృష్ట్యా కస్టమర్‌, గ్రీన్‌మైల్‌ లాయల్టీ క్లబ్‌ను శుక్రవారం ఎల్‌అండ్‌టీ హైదరాబాద్‌ మెట్రోరైలు సంస్థ ప్రారంభించనుంది.

5 దశల్లో 69.2 కి.మీ. హైదరాబాద్‌లో మెట్రోరైలును 2017 నవంబరు 29న ప్రారంభించారు. తొలుత మియాపూర్‌ నుంచి అమీర్‌పేట- నాగోల్‌ మార్గంలో సేవలు మొదలు కాగా.. 5 దశల్లో పూర్తిగా 69.2 కి.మీ. అందుబాటులోకి వచ్చింది. కారిడార్‌-1 మియాపూర్‌ నుంచి ఎల్బీనగర్‌ మార్గంలో రెండున్నర లక్షల మంది నిత్యం ప్రయాణిస్తున్నారు. ఇదే స్థాయిలో కారిడార్‌-3 నాగోల్‌ నుంచి రాయదుర్గంలో రద్దీ ఉంటుంది. కారిడార్‌-2 జేబీఎస్‌ నుంచి ఎంజీబీఎస్‌ వరకు సగం మాత్రమే ఆపరేషన్‌లోకి రావడంతో ప్రయాణికుల సంఖ్య స్వల్పంగా ఉంది. నిత్యం ప్రయాణిస్తున్న 5 లక్షల మందిలో ఐటీ ఉద్యోగులే 1.50 లక్షల వరకు ఉన్నారని మెట్రో వర్గాలు అంటున్నాయి. విద్యార్థులు 1.20 లక్షల వరకు రాకపోకలు సాగిస్తున్నారు.

మెట్రోరైళ్లు చాలక.. ప్రయాణికుల ఆదరణతో మెట్రోరైలు ఎప్పటికప్పుడు సరికొత్త మైలురాళ్లు చేరుకుంటోంది. ఉదయం, సాయంత్రం  మెట్రోరైళ్లు చాలక ప్రయాణికులకు తిప్పలు తప్పడం లేదు. సరిపడా మెట్రోరైళ్లు లేకపోవడమే దీనికి కారణం. గత ప్రభుత్వం లీజుకైనా తీసుకుని నడపాలని ఆదేశించింది. ప్రభుత్వం మారడంతో ఈ ప్రతిపాదన అటకెక్కింది. కొత్త సర్కారు ఆదేశాలను బట్టి మెట్రో నడుచుకునే అవకాశం ఉంది. ఎన్నికలు ముగిసిన అనంతరం సీఎంతో భేటి తర్వాత దీనిపై స్పష్టత వచ్చే సూచనలు ఉన్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని