Amaravati: స్థానికేతరులకు ఇళ్ల పట్టాలు.. మధ్యంతర ఉత్తర్వులకు హైకోర్టు నిరాకరణ

రాజధాని ప్రాంతంలో స్థానికేతరులకు పట్టాల పంపిణీ ప్రక్రియను నిలువరించాలని రైతులు వేసిన అనుబంధ పిటిషన్‌ను హైకోర్టు నిరాకరించింది. ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయలేమని స్పష్టం చేసింది.

Updated : 05 May 2023 15:29 IST

అమరావతి: రాజధాని అమరావతి ప్రాంతంలో స్థానికేతరులకు ఇళ్ల స్థలాలు ఇచ్చే ప్రక్రియను నిలువరించాలంటూ రైతులు వేసిన వ్యాజ్యాల్లో మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు ఏపీ హైకోర్టు నిరాకరించింది. ఇళ్ల స్థలాల కేటాయింపు కోర్టు ఇచ్చే తుది తీర్పునకు లోబడి ఉంటుందని స్పష్టం చేసింది. ఈ మేరకు సీజే జస్టిస్ ప్రశాంత్‌ కుమార్‌ మిశ్ర, జస్టిస్‌ రవినాథ్‌ తిల్హరి నేతృత్వంలోని ధర్మాసనం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం రాజధాని ప్రాంతంలో స్థానికేతరులకు ఇస్తున్న ఇళ్ల పట్టాల పంపిణీని నిలువరించాలని కోరుతూ అమరావతి రైతులు ఉన్నత న్యాయస్థానంలో అనుబంధ పిటిషన్‌ దాఖలు చేశారు. ఇటీవల విచారణ పూర్తిచేసిన హైకోర్టు శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది.

మాస్టర్‌ ప్లాన్‌కు భిన్నంగా పట్టాలు ఇవ్వడం సరికాదని రైతులు పిటిషన్‌లో పేర్కొన్నారు. ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేసిన తర్వాత అక్కడే నివసిస్తున్న వారికి ఇళ్ల పట్టాలివ్వాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను నిలువరించాలని అభ్యర్థించారు. మరోవైపు ప్రభుత్వం తరఫున న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. ఒప్పందం ప్రకారం రైతులకు రావాల్సిన భూమినే కోరాలి తప్ప.. సీఆర్‌డీఏ, ప్రభుత్వం పరిధిలో ఉన్న భూమిని ఎవరికైనా ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం ఉంటుందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. పేదలకు ఇవ్వాలని ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుందని తెలిపారు. ఇరువైపుల వాదనలు విన్న న్యాయస్థానం.. మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు నిరాకరించింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని