Andhra news: మే, జూన్‌ నెల పింఛను సొమ్ము లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లోనే జమ

పింఛను కోసం లబ్ధిదారులు సచివాలయాలకు రాకుండా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.

Updated : 28 Apr 2024 20:30 IST

అమరావతి: పింఛను కోసం లబ్ధిదారులు సచివాలయాలకు రాకుండా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. మే ఒకటో తేదీన బ్యాంకు ఖాతాల్లో పింఛను డబ్బు జమ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు  పంచాయితీరాజ్‌ శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్‌ కుమార్‌ .. జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన వీడియోకాన్ఫరెన్స్‌లో స్పష్టం చేశారు.

‘‘పింఛన్ల పంపిణీకి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఎలక్ట్రానిక్‌ విధానంలో నగదు బదిలీ లేదా శాశ్వత ఉద్యోగుల ద్వారా పంపిణీకి ఉన్న అవకాశాలను పరిశీలించాలని చెప్పింది. లబ్ధిదారులు ఇబ్బందులు ఎదుర్కోకుండా ఉండేందుకు గతంలో జారీ చేసిన ఆదేశాల స్ఫూర్తిని తీసుకోవాలని సూచించింది. కోడ్‌ అమల్లో ఉన్న దృష్ట్యా లబ్ధిదారులు అసౌకర్యానికి గురికాకుండా చూడాలని చెప్పింది. ఈసీ ఆదేశాల మేరకు మే, జూన్‌ మాసాలకు ఆధార్‌కు అనుసంధానమైన బ్యాంకు ఖాతలకు పింఛన్‌ సొమ్ము జమ చేస్తాం.

మొత్తం 65,49,864 మంది పెన్షన్ లబ్ధిదారుల్లో 74 శాతం మందికి ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ వ్యవస్థ ద్వారా నగదు జమ చేస్తాం. 48,92,503 మంది లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకు ఆధార్ మ్యాపింగ్ అయి ఉంది. మే 1న వీరందరి బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తాం. మొబైల్‌ లింక్‌ అయిన లబ్ధిదారులకు బ్యాంకుల ద్వారా నగదు జమ అయినట్టు సంక్షిప్త సందేశం వస్తుంది. దివ్యాంగులు, అనారోగ్యంతో మంచానపడిన వారు, వీల్ చైర్‌లకు పరిమితమైనవారు, వితంతువులతో పాటు బ్యాంకు ఖాతా లేని వారికి ఇంటింటికీ వెళ్లి పింఛను పంపిణీ చేస్తాం. మే 1వ తేదీ నుంచి 5వ తేదీ వరకూ పింఛన్ల పంపిణీ కొనసాగుతుంది. ఈమేరకు ఏర్పాట్లు చేయాల్సిందిగా జిల్లా కలెక్టర్లు, బ్యాంకర్లను ఆదేశించాం’’ అని శశిభూషణ్ కుమార్ తెలిపారు.

వాలంటీర్ల ద్వారా పింఛన్లు పంపిణీ చేయొద్దని మాత్రమే ఎన్నికల సంఘం ఆదేశిస్తే.. సీఎస్‌ ఏకంగా ఇంటింటికీ పింఛన్ల పంపిణీనే నిలిపేశారు. దీంతో ఏప్రిల్‌లో పింఛను కోసం వచ్చి రాష్ట్ర వ్యాప్తంగా 32 మంది వృద్ధులు చనిపోయారు. అధికార పార్టీ వృద్ధుల్ని మండుటెండల్లో మంచాలపై ఊరేగిస్తూ నానా హంగామా సృష్టించింది. దీంతో ఈ వ్యవహారంపై విపక్షాలు తీవ్రంగా స్పందించాయి. ఇంటి వద్దే పింఛన్లు పంపిణీ చేసే విధంగా ఆదేశాలు ఇవ్వాలని ఈసీకి తెదేపా అధినేత చంద్రబాబు లేఖ రాశారు. ఎన్డీయే కూటమి నేతలు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిని కలిసి విజ్ఞప్తి చేశారు. ఎన్నికల సంఘానికి పెద్ద సంఖ్యలో ఫిర్యాదులు అందాయి. ఈ నేపథ్యంలో ఈసీ స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడంతో.. మే, జూన్‌ నెల పింఛను లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలో వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు