Gaddar: ‘గుమ్మడి విఠల్‌రావు’.. ‘గద్దర్‌’గా ఎలా మారారంటే..?

తన జీవితానికి సంబంధించిన ఎన్నో విషయాలను గద్దర్‌ గతంలో ఓ ఇంటర్వ్యూలో పంచుకున్న విశేషాలు.. 

Updated : 06 Aug 2023 18:46 IST

హైదరాబాద్‌: ఆకలి కేకలకు అక్షరరూపం కలిగించి పాటలతో ప్రళయం సృష్టించిన ప్రజాకవి గద్దర్‌ (Gaddar) మరణంతో అంతటా విషాదం నెలకొంది. రాజకీయ,సినీ ప్రముఖులు ఆయన మృతికి సంతాపం ప్రకటిస్తున్నారు. ఆయనకు సంబంధించిన విషయాలను నెమరు వేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో తన జీవితానికి సంబంధించిన ఎన్నో విషయాలను గతంలో ఓ సందర్భంలో గద్దర్‌ ఇలా చెప్పారు. ఆ విశేషాలు ఆయన మాటల్లోనే..

అసలు పేరు వేరు..!

‘‘మా నాన్న అంబేడ్కర్‌కు అభిమాని. ఔరంగబాద్‌లో అంబేడ్కర్‌ నిర్మించిన మిలింద్‌ విద్యాలయానికి మా నాన్న మేస్త్రీగా పనిచేశారు. అంబేడ్కర్‌ మాటలతో స్ఫూర్తి పొందిన మా నాన్నగారు.. పిల్లలందరికీ సరస్వతి భాయ్‌, భారతి భాయ్‌, నరసింగరావు అని పేర్లు పెట్టారు. అలా, నాకు విఠల్‌రావు అని పెట్టారు. మా అమ్మ చైతన్యవంతురాలు. మరాఠీలో చక్కని పాటలు పాడేవారు. సావిత్రిపులే మీద ఆమె మంచి పాటలు పాడేవారు’’

తిరుగుబాటు మొదలు..!

‘‘చదువుకుందామని స్కూల్‌కు వెళ్లినప్పుడు ‘నీ పేరేంటి?’ అని అడిగారు. దానికి నేను.. ‘విఠల్‌రావు’ అని చెప్పా. నా పేరు విని అక్కడివాళ్లందరూ నేను గొప్పింటి కుర్రాడిననుకున్నారు. ‘మీ నాన్న పేరేంటి?’ అని అడిగ్గా.. ‘శేషయ్య మేస్త్రీ’ అని చెప్పా. అది విని.. ‘‘నీకు రావు ఎందుకు విఠల్‌ చాలు’’ అన్నారు. అలా, నా పేరు విఠల్‌గా మారింది. తిరుగుబాటు మొదలైంది’’

Gaddar Movie songs: బండెనక బండి కట్టి.. వెండితెరపై గద్దర్‌ కలం.. గళం

గద్దర్‌గా మారా..!

‘‘నా పేరు గద్దర్‌గా మార్చుకోవడానికి కారణం విప్లవం. విప్లవంలో పాల్గొన్న సమయంలో అసలు పేరు ఉండకూడదు. వేరే పేరు ఉండాలి. పంజాబ్‌ నుంచి వెళ్లిన చాలామంది జాతీయవాదులు అమెరికా - కెనడాలో గద్దర్‌ పార్టీ అని పెట్టారు. భారతదేశంలో ఉన్న బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాళ్లు అక్కడి నుంచి పోరాటం చేసేవారు. ‘గద్దర్‌’ అంటే పంజాబీలో విప్లవం అని అర్థం. అలా నా పేరును గద్దర్‌గా మార్చుకున్నా. ఆ పేరుతోనే ప్రజలను చైతన్యం చేసేలా పాటలు రాశా.’’

అదే నా మొదటిపాట..!

‘‘ప్రేమ, బాధ, కోపం.. సందర్భం ఏదైనా సరే పాలకులను ప్రశ్నించేలా ప్రజలను చైతన్యం చేసేలా ప్రజా కవులు పాటలు రాస్తుంటారు. వాళ్లు ఎప్పుడూ అండర్‌ గ్రౌండ్‌లోనే ఉంటారు. ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వెళ్తూనే ఉంటారు. ఇంజనీరింగ్‌ కళాశాలో ఉన్నప్పుడు నేను మొదటిసారి పాట రాశా. ‘రిక్షా తొక్కే రహీమన్నా.. రాళ్లు కొట్టే రామన్నా’ ఇదే నా మొదటిపాట. ఈ పాట రాసినప్పుడు నా వయసు 22 ఏళ్లు ఉండొచ్చు’’

మొదటిసారి ఓటు..!

‘‘బ్యాలెట్‌ వైపు వెళ్లినప్పుడు కమ్యూనిస్టు నాయకుల నుంచే కాదు సామాన్యుల నుంచి కూడా వ్యతిరేకత వచ్చింది. వ్యతిరేకతను స్వీకరించకపోతే మనం ఎలా అభివృద్ధి చెందుతాం. ఎదుటివాళ్లు ప్రశ్నించడం వల్ల మనల్ని మనం కరెక్ట్‌ చేసుకోవచ్చు. కొన్ని సంవత్సరాల క్రితం సాయుధ పోరాటం చేయాలన్న నేను.. అనేక పరిణామాల తర్వాత ఈ సమాజంలో సాయుధ పోరాటం ఎందుకు వెనక్కి పోతుందనే విషయాన్ని గ్రహించా. ఇక్కడ కులం అనే అడ్డుగోడ ఉంది. సాయుధ పోరాటం అంటే తుపాకులు పట్టుకోవడం కాదు. తిరుగుబాటు చేయడం. అలా, ఒకే ఒక్కసారి నా భార్యతో కలిసి ఓటు వేశాను.’’

జెండా వెనుక కథ..!

‘‘నా కర్రకు బుద్ధుడి జెండా ఉండేది. అది మా నాన్నది. ఇంజనీరింగ్‌ కాలేజీకి వచ్చాక ఎర్రజెండా చేరింది. పులేకి గుర్తుగా నీలం రంగు జెండాను కట్టా’’

అది నా వ్యక్తిగత అభిప్రాయం..!

‘‘ప్రజాస్వామ్య తెలంగాణ రావాలనే లక్ష్యంతో ‘తెలంగాణ ప్రజా ఫ్రాంట్‌’ స్థాపించా. దానికి నేను ఛైర్మన్‌. ఎత్తుగడల రీత్యా మేము దాన్ని సరిగ్గా ముందుకు తీసుకువెళ్లలేదనేది నా వ్యక్తిగత అభిప్రాయం. ఇప్పుడు అది లేదు. 1969లో ఉద్యమం వచ్చినప్పుడు నేను ఇంజనీరింగ్‌ చదువుతున్నా. స్టూడెంట్‌గా ఉన్నప్పుడే ఉద్యమంలో పాల్గొన్నా’’

నంది అవార్డును తిరస్కరించా..!

‘‘ఎమోషనల్‌ ఐడియాలజీ మధ్య కవి జీవితం నడుస్తుంటుంది. నా పాటలన్నింటిలోనూ ప్రకృతితో ఎక్కువగా పోలుస్తూ చెబుతుంటా. మహిళలపై నేను ఎన్నో పాటలు రాశా. ‘నీ పాదం మీద పుట్టుమచ్చనై’ పాటకు నారాయణమూర్తి ప్రధాన బలం. ఆ పాట చేసినప్పుడు చాలా చర్చ జరిగింది. విప్లవ ఉద్యమంలో ఉన్నవారు ప్రభుత్వాలు ఇచ్చే అవార్డులు, రివార్డులకు దూరంగా ఉండాలని మేమే ఒక రూల్‌ పెట్టుకున్నాం. అదే క్రమంలో నంది అవార్డు వచ్చినా దాన్ని తిరస్కరించా’’

టార్చర్‌ సెల్‌..! 

‘‘ఇంజనీరింగ్‌ వదిలిపెట్టి బ్యాంక్‌ సర్వీస్‌ రాసి మామిడిపల్లిలో ఉద్యోగం చేస్తున్నప్పుడు పోలీసులు నన్ను పట్టుకున్నారు. కొన్నిరోజులపాటు నన్ను టార్చర్‌ సెల్‌లో పెట్టారు. రెండు రోజులు ఫ్యాన్‌కు వేలాడదీసి కొట్టారు. సమాచారం తెలుసుకుని.. నన్ను బంధించిన చోటుకు మా అమ్మ వచ్చి గొడవ చేశారు. అజ్ఞాతవాస జీవితం అది. అప్పుడు కుటుంబం చెల్లాచెదురైంది. నా భార్య డెలివరీకి నేను జైల్లో ఉన్నా. డెలివరీ ఖర్చులకు చేతిలో డబ్బులు కూడా లేవు.’’ అని ఆయన చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని